పల్లె పాలనకు 61 ఏళ్లు
● 1964లో తొలిసారి పంచాయతీ ఎన్నికలు ● మొదటి పంచాయతీగా షాద్‌నగర్ ఎంపిక
● 1959 నుంచి మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ
బల్వంత్‌రాయ్ మెహతా కమిటీ నివేదిక ప్రకారం..
● ప్రజల భాగస్వామ్యం కోసం మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
● పాలన వికేంద్రీకరణ ద్వారా స్థానిక ప్రజల అవసరాలకు అనుగుణంగా వనరులను వినియోగించుకోవాలి.
● శాశ్వతమైన పరిపాలన అమలుకు యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి.
అచ్చంపేట: గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలన్నారు మహాత్మాగాంధీ. ప్రజాస్వామ్య వ్యవస్థలో మూల స్తంభమైన గ్రామ పంచాయతీల ఏర్పాటు, కాలానుగుణంగా చోటు చేసుకున్న మార్పులు ఆసక్తిగా ఉన్నాయి. ఇంతకీ గ్రామ పంచాయతీ వ్యవస్థ ఎలా ఏర్పడిందో తెలుసుకొందాం. నెహ్రూ నాయకత్వంలో ప్రజాస్వామ్యం– సామ్యవాదం నినాదంతో దేశంలో పాలన సాగించారు. 1951లో మొదటి పంచవర్ష ప్రణాళికను ప్రారంభించారు. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధితో పాటు గ్రామీణుల జీవన ప్రమాణాలు మెరుగుపర్చాలని సంకల్పించారు. ప్రొఫెసర్ ఎస్కే డే నేతృత్వంలో కమ్యూనిటీ డెవలప్‌మెంట్ కార్యక్రమం అమలు చేశారు. దీనిపై శాసీ్త్రయ అధ్యయనానికి 1957లో సామాజిక, ఆర్థికశాస్త్రవేత్త డాక్టర్ బల్వంత్‌రాయ్ మెహతా నేతృత్వంలో అధ్యయన బృందాన్ని నియమించారు. దాని ఆధారంగా 1959లో జిల్లా, బ్లాక్, గ్రామ పంచాయతీ ఇలా మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. దీనిని దేశంలో మొట్టమొదట రాజస్థాన్‌లో అక్టోబర్ 2న, మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో 1959 అక్టోబర్ 11న అప్పటి ప్రధాని నెహ్రూ ప్రారంభించారు. అనంతరం దశల వారీగా దేశమంతటా అమలైంది.
మొదట్లో పరోక్ష పద్ధతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1964లో సమగ్ర గ్రామ పంచాయతీ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం ప్రకారం 500కు పైగా జనాభా కలిగిన గ్రామాలను ఒక పంచాయతీగా ఏర్పాటు చేశారు. జనాభాను బట్టి 5 నుంచి 17 మంది వరకు వార్డు సభ్యులు ఉండవచ్చని ఇందులో పేర్కొన్నారు. 1964లో సర్పంచ్‌ల ఎన్నికలు పరోక్ష పద్ధతిలో జరిగాయి. వార్డు సభ్యులను ఓటర్లను ఎన్నుకుంటే, వారు సర్పంచ్‌ను ఎన్నుకునే వారు. ఎన్నికై న సర్పంచ్‌లు కలిసి సమితి(బ్లాక్) ప్రెసిడెంట్‌ను ఎన్నుకుంటారు. సమితి ప్రెసిడెంట్‌లు జిల్లా పరిషత్ అధ్యక్షుడిని, ఉపాధ్యక్షుడిని ఎన్నుకనేవారు. 1976 వరకు ఇదే పద్ధతి కొనసాగింది. వీరి ఎన్నికలో ఎమ్మెల్మేలు, ఎమ్మెల్సీలకు ఓటుహక్కు ఉండేది.
1978 నుంచి ప్రత్యక్ష పద్ధతి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1978లో నరసింహం కమిటీని ఏర్పాటు చేసింది. సర్పంచ్‌లను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోవాలని ఈ కమిటీ సూచించింది. దీంతో అప్పటి నుంచి సర్పంచ్‌ల ఎన్నిక ప్రక్రియ ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహిస్తున్నారు.
ఎస్పీ, ఎస్టీలకు రిజర్వేషన్లు
1992లో అమలులోకి వచ్చిన 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం గ్రామ పంచాయతీల్లో షెడ్యూల్డ్ కులాలు, తెగల వారికి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల కల్పించాలని, అలాగే 1/3వ వంతు మహిళలకు రిజర్వు చేయాలని సూచించింది. అప్పటి నుంచి గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌లో రిజర్వేషన్లు అమలవుతున్నాయి.
మండల వ్యవస్థ మార్పుతో
తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 1986 ఫిబ్రవరి 15న అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు తాలుకాలను రద్దుచేసి మండల వ్యవస్థను ఏర్పాటు చేశారు. మండలాలకు 1987లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. మండల పరిషత్ అధ్యక్షుడిని నేరుగా ఎన్నుకున్నారు. దీనిలో సభ్యులుగా ఆయా మండలాల పరిధిలోని సర్పంచ్‌లు ఉండే వారు. ఎంపీపీలు జిల్లా పరిషత్ చైర్మన్‌ను ఎన్నుకునేవారు.
1994లో పరిషత్ వ్యవస్థ
ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం– 1994 ద్వారా అదే సంవత్సరం నుంచి గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ అనే మూడంచెల వ్యవస్థను ఆమోదించింది. మండల పరిషత్‌లో సర్పంచ్‌లను సభ్యులుగా తొలగించి వారి స్థానంలో ఎంపీటీసీలను, జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలో ఎంపీపీలను సభ్యులుగా తొలగించి జెడ్పీటీసీలను సభ్యులుగా చేర్చారు. మెజార్టీ ఎంపీటీసీలు ఎంపీపీని, మెజార్టీ జెడ్పీటీసీలు జెడ్పీ చైర్మన్‌ను ఎన్నుకోవడం ప్రారంభమైంది.


