
హైదరాబాద్ నగరంలో పెళ్లి చేయాలంటే ఇంటి ముందు పందిరి వేసుకునేంత ప్రదేశం దొరకడం కష్టంగా మారింది. ఇరుకిరుకు రోడ్లు, నిత్యం వాహనాల రద్దీ, ట్రాఫిక్ ఇబ్బందులు నిత్యకృత్యాలుగా కనిపిస్తున్నాయి. దీంతో ఆర్థిక స్థోమత ఉన్నవారు రూ.లక్షలు చెల్లించి ఫంక్షన్ హాల్‌కు వెళ్లిపోతున్నారు. మరికొంత మంది భారీ ఎత్తున పూల తోరణాలు, సెట్టింగులతో ముస్తాబు చేసి, స్టేటస్ చూపిస్తున్నారు. పేదల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. కల్యాణ మండపం ఖర్చులు పెట్టుకోలేని పేదలకు అండగా నిలిచేందుకు త్యాగరాయ గానసభ ముందుకొస్తోంది.
పేద కుటుంబాల వివాహాలకు ఉచితంగా ఫంక్షన్ హాల్, పెళ్లి కుమార్తెకు బంగారు తాళిబొట్టు, చీర, కాలి మెట్టెలు ఇస్తున్నారు. 150 మంది వరకు బందువులకు ఉచితంగా శాఖాహార భోజనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అయితే వివాహం అనేది పెద్దలు కుదుర్చిన సంబంధాలకు మాత్రమే ఇక్కడ అనుమతిస్తారు. ప్రేమ వివాహాలు వంటి వాటికి ఇక్కడ స్థానం లేదని నిర్వాహకులు చెబుతున్నారు.
ఇప్పటి వరకు 97 వివాహాలు
త్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 97 వివాహాలకు ఉచితంగా ఫంక్షన్ హాల్ అందించారు. తెల్ల రేషన్ కార్డు ఉండి, ఫంక్షన్ హాల్‌కు వెళ్లే ఆర్థిక స్థోమత లేని పేద కుటుంబాలకు ఇక్కడ ఆసరా లభిస్తోంది. ఈ సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఫైలెట్ ప్రాజెక్టుగా త్యాగరాయ గానసభలో వివాహం చేసుకున్న కుటుంబాలకు కల్యాణ లక్ష్మి పథకంలో త్వరితగతిన ప్రోత్సాహకాలను అందిస్తోంది. వివరాలకు ఫోన్: 93999 20008.
(చదవండి: ఇల్లే గ్రంథాలయం..! హోమ్ లైబ్రరీ కోసం..)