
ఇంట్లో ఒక ప్రశాంతమైన ప్రదేశం ఎంచుకుంటున్నారు. అక్కడ ఒక పుస్తకాల రాజ్యం ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో నగరవాసులు తమ సొంతింట్లో ఇలాంటి హోమ్ లైబ్రరీల ఏర్పాటుపై విశేషమైన ఆసక్తి కనబరుస్తున్నారు. కరోనా తర్వాత ఇంటి వద్ద ఎక్కువ సమయం గడిపే అలవాటు పెరగడంతో జీవనశైలిలో వచ్చిన మార్పుల్లో ఒకటిగా హోమ్ లైబ్రరీని చెప్పొచ్చు.
నిజానికి పఠనాసక్తిని తగ్గించే కారణాల్లో ఒకటైన సోషల్ మీడియా మరోవైపు దాని పెరుగుదలకూ దోహదం చేస్తోంది. తరచూ పుస్తకాల రివ్యూలతో పాటు తాము చదివిన పుస్తకాల విశేషాలను అనేక మంది పంచుకుంటుండటంతో అది ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తోంది.
అంతేకాకుండా నగరంలో తరచూ ఏర్పాటవుతున్న పుస్తక ప్రదర్శనలు కూడా కొని తెచ్చుకుని ఇంట్లో ఉంచుకోవాల్సిన పుస్తకాలను పెద్ద సంఖ్యలో అందుబాటులోకి తెస్తున్నాయి. ఇలాంటి అనేకానేక కారణాలతో హోమ్ లైబ్రరీల అవసరాన్ని నగరవాసులు గుర్తిస్తున్నారు.
నా ఇల్లే.. నా లైబ్రరీ..
పఠనాసక్తి ఉన్న నగరవాసులు తమ ఇంట్లో ఎవరి స్థాయిలో వారు పుస్తకాల కోసం ప్రత్యేక స్థలం కేటాయిస్తున్నారు. ఆయా ఇళ్లలో అందుబాటులో ఉన్న స్థలాన్ని బట్టి ‘రీడింగ్ కార్నర్’ అనో, లేక ‘బుక్ నుక్’, లేదా ‘పర్సనల్ లైబ్రరీ’.. తదితర పేర్లతో పలు రూపాల్లో ప్రత్యేక స్థలాన్ని ఇంటి డిజైన్‌లో భాగంగా చేర్చడం ఓ కొత్త ట్రెండ్ అయింది.
ఐటీ ఉద్యోగులు, కంటెంట్ క్రియేటర్లు, ప్రొఫెషనల్స్ మాత్రమే కాకుండా హౌస్‌వైఫ్‌లు, స్టూడెంట్లు కూడా తమ అభిరుచులు, అవసరాల మేరకు పుస్తకాలను చదువుకోడానికి ఓ ప్రశాంతమైన ప్రదేశాన్ని ఇంట్లోనే ఏర్పాటు చేసుకుంటుండటం కనిపిస్తోంది.
వ్యక్తిగత అవసరాలపై ఆధారపడి హోమ్ లైబ్రరీ ఏర్పాటుకు నగరవాసులు ఖర్చు చేస్తున్నారు. సాధారణంగా ఒక మోస్తరు స్థలంలో తగిన వసతులతో హోమ్ లైబ్రరీ ఏర్పాటుకు రూ.30 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు ఖర్చవుతోందని ఇంటీరియర్ డిజైనర్స్ చెబుతున్నారు.
వీటిలో ఉండే పుస్తకాల బుక్ షెల్వ్‌లు, చదువుకునేందుకు టేబుల్, సౌకర్యవంతమైన కురీ్చలు, మంచి లైటింగ్, వాల్ డెకార్ ఇవన్నీ కలిపి హోమ్ లైబ్రరీని ఆహ్లాదకరంగా మారుస్తున్నాయి. ఇక ఖరీదైన విల్లాలలో, అపార్ట్‌మెంట్స్‌లో అయితే రూ.3 లక్షల వరకు ఖర్చుతో లగ్జరీ లైబ్రరీలు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు.
మొబైల్‌కి బై చెప్పేస్తూ..
పుస్తకాల పట్ల అమిత ప్రేమ కలిగిన వారు మాత్రమే కాకుండా చిన్నారుల్లో స్మార్ట్ ఫోన్ వినియోగాన్ని దూరం చేయడం కోసం పలువురు తల్లిదండ్రులు దీనిని ఒక తెలివైన మార్గంగా మార్చుకుంటున్నారు. పిల్లలలో చదువు పట్ల ఆసక్తి పెంపొందించేందుకు తమస్థాయిలో తాము హోమ్ లైబ్రరీల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కొందరు బిల్డర్లు ఇప్పుడు కొత్త అపార్ట్‌మెంట్ ప్రాజెక్టుల్లో కామన్ లైబ్రరీలను కూడా తమ ప్లాన్స్‌లో భాగం చేస్తున్న సంగతి గమనార్హం.
ప్రశాంతత కోసం..
ఇంటర్నెట్, ఈ–బుక్స్ విస్తృతంగా ఉన్నా, ఫిజికల్ బుక్స్‌తో గడిపే అనుభూతి అపూర్వం అనే అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు. గతంలో పుస్తకం అంటే జ్ఞానం పెంచుకోవడానికి మార్గంగా ఉంటే ఇప్పుడు ఆ స్థానాన్ని ఇంటర్నెట్ ఆక్రమించింది. దాంతో.. పుస్తకం ఇప్పుడో సైకలాజికల్ థెరపీగా మారిపోయింది. ‘ప్రపంచ జ్ఞానం కోసం కాకుండా, ప్రశాంతత కోసం చదువు’ అనే ఆలోచనలతో హోమ్ లైబ్రరీ ట్రెండ్ ఊపందుకుంటోంది.
రూ.వేల నుంచి రూ.3 లక్షల దాకా ఖర్చుచదవడం పట్ల పెరుగుతున్న ఆసక్తి ఇళ్లలో వ్యక్తిగతీకరించిన, మేధోపరమైన స్థలాలను సృష్టిస్తోంది. చిన్న అపార్ట్‌మెంట్లలో కూడా లైబ్రరీలను నిర్మించడానికి మెట్ల కింద ప్రాంతాలు, లివింగ్ రూమ్ మూలలు, టీవీ యూనిట్లు వంటి ప్రదేశాలను వ్యూహాత్మకంగా ఉపయోగిస్తున్నారు. అధునాతన స్టైల్స్‌కు నిదర్శనంగా.. ముదురు రంగులు, క్లాసిక్ నమూనాలు కాలాతీత పుస్తక సేకరణలను కలిగి ఉన్న ప్రసిద్ధ డిజైన్ ట్రెండ్‌ను డార్క్ అకాడెమియా అని పిలుస్తున్నారు.
లైబ్రరీలను లివింగ్ రూమ్‌లు లేదా హోమ్ ఆఫీస్‌ల వంటి ఇతర గదులతో కలిపి కుట్టేస్తూ ద్వంద్వ–ప్రయోజన ప్రదేశాలను ఆవిష్కరిస్తున్నారు.
సౌకర్యవంతమైన సీటింగ్, మంచి లైటింగ్, అలంకార వస్తువులు వంటివి మేళవించి స్టైలిష్ రీడింగ్ నూక్స్‌ను డిజైన్ చేస్తున్నారు.
అధునాతన స్టైల్స్‌కు నిదర్శనంగా.. ముదురు రంగులు, క్లాసిక్ నమూనాలు కాలాతీత పుస్తక సేకరణలను కలిగి ఉన్న ప్రసిద్ధ డిజైన్ ట్రెండ్‌ను డార్క్ అకాడెమియా అని పిలుస్తున్నారు.
(చదవండి: ఈ ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాను!)