సైబర్‌ క్రైమ్‌: ఫోన్‌లో గూఢచర్యం..

Spying on the phone: someone is spying on your cell phone - Sakshi

ఊరు నుంచి వచ్చాక అల్మారా తెరిచి చూసిన సుమిత్ర(పేరుమార్చడమైనది) షాక్‌ అయ్యింది. తను భద్రంగా ఉంచిన బంగారం కనిపించలేదు. అల్మరా తాళాలు ఎక్కడ పెట్టిందో తనకు మాత్రమే తెలుసు. అవి ఎక్కడ ఉంచిందో అక్కడే జాగ్రత్తగా ఉన్నాయి కూడా. ఇంట్లో కొడుకు కోడలిని అడిగితే తమకేమీ తెలియదని, పెద్ద కోడలికి ఇచ్చారేమో అంటూ నిష్టూరంగా మాట్లాడారు. సుమిత్రకు ముగ్గురు కొడుకులు, ఒక కూతురు. అందరి పెళ్లిళ్లు అయ్యాయి.

భర్త సంపాదించినది, తన దగ్గర ఉన్న బంగారం ఇంకా పిల్లలకు పంచలేదు. ఇద్దరు కొడుకులు ఉద్యోగ రీత్యా మంచి స్థాయిలో ఉండటంతో వారు సొంతిళ్లు కట్టుకుని ఉంటున్నారు. చిన్నకొడుకు ఆర్థికంగా స్థిరపడకపోవడంతో తల్లిదండ్రులతోనే కలిసి ఉంటున్నాడు. చిన్న చిన్న మనస్పర్థలు వచ్చినా సుమిత్ర, ఆమె భర్త రఘునాథం సర్దుకుపోయేవారు. కానీ, ఈ మధ్య ఆస్తి వ్యవహారంలో కొడుకుల మధ్య తరచూ గొడవలు వస్తున్నాయి. కోడలు ప్రవర్తన మరింత విచిత్రంగా ఉంది. బంగారం పోవడంతో పోలీసులను సంప్రదించారు సుమిత్ర, ఆమె భర్త.

ఫోన్‌ సంభాషణతో చౌర్యం
ఇంటి పరిస్థితి కనుక్కుంటే కొన్ని నెలలుగా తమ కొడుకు, కోడలు తమపై గూఢచర్యం చేస్తున్నారని, తమ పిల్లలతోనూ, బంధువులతోనూ తాము ఫోన్‌లో మాట్లాడుకున్న విషయాలు కూడా వారికి తెలిసిపోతున్నాయని, ఇంట్లో ప్రశాంతత కోల్పోయామని చెప్పుకున్నారు సుమిత్ర దంపతులు. వారి దగ్గర ఉన్న ఫోన్‌ చెక్‌ చేసి చూస్తే అందులో చిన్న కోడలు స్పై యాప్‌ని ఇన్‌స్టాల్‌ చేసి, రికార్డర్‌ వాయిస్‌ను తన ఈ మెయిల్‌కు లింక్‌ చేసినట్టుగా గుర్తించారు.

దీని ద్వారా కుటుంబంలో మిగతావారితో జరిగే ఫోన్‌ సంభాషణ అంతా కొడుకు, కోడలు వినేవారని తెలిసింది. అందులో భాగంగా సుమిత్ర తన కూతురి తో ఫోన్‌లో మాట్లాడినప్పుడు అల్మరాలో ఉంచిన బంగారం, రహస్యంగా ఉంచిన తాళాల గురించి చెప్పింది. అది తెలుసుకున్న కొడుకు కోడలు ఆ బంగారాన్ని దొంగతనం చేసి, తమకేమీ తెలియదని, మిగతా కొడుకులకు, కూతురుకు ఇచ్చి ఉంటారని దురుసుగా మాట్లాడారు.

ఇదో మానసిక జాడ్యం
కుటుంబ సంబంధాలలో అనుమానాలు ఉంటేనే ఇలాంటివి జరుగుతుంటాయి అనుకుంటే పొరబాటే. బయటి వారు కూడా ఇతరులను ఇరకాటంలో పెట్టడానికి ఇలాంటి చర్యలకు పూనుకోవచ్చు. వారిలో అత్యంత సన్నిహితులు అనదగిన వారు కూడా ఉండవచ్చు. సాధారణంగా ఎన్‌ఆర్‌ఐ మ్యారేజీ విషయాల్లో కాబోయే భాగస్వామి పట్ల అనుమానంతో ఇలాంటి గూఢచర్యం చేస్తుంటారు. భార్యాభర్తల సంబంధం విషయంలోనూ అనుమానం వల్లే ఇలాంటి స్పైవేర్‌లు పుట్టుకు వస్తాయి. ఫోన్‌ సర్వీస్‌ పాయింట్లలోనూ ఇలాంటి స్పై కెమరా యాప్‌లు ఇన్‌స్టాల్‌ చేసి, వాటి ద్వారా అమ్మాయిల వ్యక్తిగత సమాచారాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త అవసరం.

యాంటీ స్పై వేర్‌...
ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు మన ఫోన్‌ ఇవ్వకుండా ఉండటం మొదటగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్త.  
► మాల్వేర్‌ లేదా స్పై వేర్‌ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసినట్టుగా కొన్ని సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు.
► ఫోన్‌ బ్యాటరీ ఛార్జింగ్‌ త్వరగా ఖాళీ అవుతుంటుంది.
► పాప్‌ అప్‌ యాడ్స్‌ నిరంతరం వస్తూ ఉంటాయి.
► డేటా వినియోగం పెరిగినట్టుగా చూపుతుంది.
► ఇతర పాప్‌ అప్‌ యాప్‌ నోటిఫికేషన్స్‌ విరివిగా వస్తుంటాయి.
► మాల్వేర్‌ లేదా స్పై వేర్‌ ఉందని అనుమానించినట్లయితే యాంటీ వైరస్, యాంటీ మాల్వేర్‌ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్‌ చేయాలి. ఫోన్‌ని స్కాన్‌ చేయాలి. అవసరం లేని యాప్స్‌ను తొలగించాలి.


అనీల్‌ రాచమల్ల, డిజిటల్‌ వెల్‌బీయింగ్‌ ఎక్స్‌పర్ట్, ఎండ్‌ నౌ ఫౌండేషన్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top