
మీ ఫోన్‌లో దూరి మిమ్మల్ని గమనిస్తూ ఉంటాడు
మీ రహస్యాల్ని, రాకపోకల్ని ట్రాక్ చేస్తుంటాడు
కొత్త యాప్‌లు ఎక్కిస్తాడు, పాస్‌వర్డ్‌లు కొట్టేస్తాడు
అతడి పేరు స్పైవేర్ – మారువేషపు మహా చోర్
అకస్మాత్తుగా మీ ఫోన్ దానంతటదే బ్లింక్ అవుతుంది. ఏదో మెసేజ్! తెరిచి చూస్తే అంకెలు, అక్షరాలు ఉంటాయి. అవేమిటో అర్థం కాదు. హఠాత్తుగా మీ ఫోన్ బ్యాటరీ 20 శాతానికి పడిపోయి ఉంటుంది. నిజానికి అప్పటికి గంట క్రితమే మీరు మీ ఫోన్‌ని పూర్తిగా చార్జి చేసి ఉంటారు. మీ ఫోన్‌ని మీరు ఉపయోగించకుండానే వేడెక్కిపోతుంటుంది. ఏదో సాంకేతిక సమస్య అని మీరు పట్టించుకోక పోవచ్చు. కానీ అవన్నీ... స్పైయింగ్ సాఫ్ట్‌వేర్ లేదా స్పైవేర్ మీ ఫోన్‌లో చొరబడి ఉండొచ్చనే దానికి సంకేతాలు కావచ్చునని అంటున్నారు నిపుణులు. మరోవైపు – స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా నిఘా, గూఢచర్యం, సైబర్‌క్రైమ్‌లు పెరగటం పట్ల కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆందోళన వ్యక్తం చేసింది. – సాక్షి, స్పెషల్ డెస్క్
స్మార్ట్‌ఫోన్ లో మన వ్యక్తిగత వివరాలన్నీ నిక్షిప్తమై ఉంటాయి. మనం వాడే అనేక యాప్‌లు.. మనకు సంబంధించిన కాంటాక్ట్‌లు, లొకేషన్ హిస్టరీ, ఫొటోలు.. ఇలా అన్నింటి యాక్సెస్ తీసేసుకుంటున్నాయి. అందువల్ల స్మార్ట్‌ఫోన్‌లో మన జీవితం తెరిచిన పుస్తకం అయిపోయింది. ఎంతో అమూల్యమైన ఆ సమాచారాన్ని ఎవరో, ఎక్కడి నుంచో రహస్యంగా వెతుకుతూ ఉంటే? చూస్తూ ఉంటే? మనకు తెలియకుండా వేరెవరికో ఇచ్చేస్తే? సర్వం పోగొట్టుకున్నట్లే. జీవితమే తలకిందులైపోవచ్చు కూడా. అందుకే స్పైవేర్ సంకేతాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
‘స్పైవేర్’ అనేది మన ఫోన్‌లోని విలువైన సమాచారాన్నంతా రాబట్టేందుకు రూపొందిన హానికరమైన సాఫ్ట్‌వేర్. మనకు తెలియకుండానే అది మన పాస్‌వర్డ్‌లన్నీ కనిపెట్టేస్తుంది. మన కదలికలన్నిటినీ గమనిస్తుంటుంది. మనం చేసిన కాల్స్‌నీ, మనకు వచ్చిన కాల్స్‌నీ రికార్డ్ చేస్తుంటుంది. మనకు తెలియకుండానే మన మైక్రోఫోన్, కెమెరాలను కూడా పని చేయించటం మొదలుపెట్టేస్తుంది.
మనకెలా తెలుస్తుంది?..: మీ ఫోన్‌లో స్పైవేర్ చొరబడి మిమ్మల్ని గమనిస్తున్న విషయాన్ని కొన్ని సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు. అవి :
ఫోన్ పనితీరులో ఆకస్మిక సమస్యలు: యాప్‌లు పని చేయటం మానేస్తాయి లేదా ఫోన్ బాగా స్లో అయిపోతుంది.
బ్యాటరీ త్వరగా డౌన్ అయిపోవటం: స్పైవేర్ అన్నది ఇరవై నాలుగు గంటలూ పని చేస్తుంటుంది. ఫోన్ బ్యాటరీ మొత్తాన్ని తాగేస్తుంది.
అంతుచిక్కని డేటా వినియోగం: మీ మొబైల్ డేటా బిల్లు మీ వాడకానికి మించి అమాంతం పెరిగిపోయిందీ అంటే స్పైవేర్ మీ డేటాను వేరొకరికి బదిలీ చేస్తోందని అర్థం!
వేడెక్కడం: మీ ఫోన్ వాడకంలో లేనప్పుడు కూడా వేడెక్కుతూ ఉంటే వెనుక ఏదో స్పయింగ్ పని నడుస్తూ ఉండొచ్చు.
వింత సందేశాలు: వింత అక్షరాలు లేదా లింక్‌లతో కూడిన టెక్స్ట్ మెసేజ్‌లు వస్తుంటే అవి మీ ఫోన్‌లోని స్పైవేర్‌కు అందుతున్న ఆదేశాలు / సందేశాలు కావచ్చు.
స్పైవేర్‌ను వేటాడటం ఎలా?
మీ ఫోన్‌లో స్పైవేర్ సంకేతాలు కనిపిస్తే కనుక మీరు దానిని వేటాడి మట్టుపెట్టాల్సిన సమయం ఆసన్నమైందని అర్థం. అయితే ఆ వేట మీది ఏ రకం ఫోన్ అనే దాన్ని బట్టి ఉంటుంది.
మీది ఆండ్రాయిడ్ అయితే
» మొదట సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. అక్కడి నుంచి యాప్స్‌లోకి వెళ్లండి. అక్కడ మీకేమైనా తెలియని యాప్‌లు కనిపిస్తున్నాయేమో చూడండి.
» డివైజ్ అడ్మిన్ యాప్స్‌ని చెక్ చేసి, అక్కడ ఏయే పర్మిషన్‌లు హైలైట్ అయి ఉన్నాయో గమనించండి.
» మాల్వేర్‌బైట్స్, లేదా అవస్త్ వంటి పేరున్న యాంటీ స్పైవేర్ యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకోండి.
» ఆ తర్వాత వైరస్‌ల కోసం పూర్తిగా స్కాన్ చెయ్యండి. కొత్త ఫైల్స్ ఏమైనా వచ్చి చేరాయా అని తెలుసుకోవటం కోసం డౌన్‌లోడ్ ఫోల్డర్స్ చెక్ చేయండి.
» గూగుల్ ప్లే ప్రొటెక్షన్ ఆన్‌లో పెట్టుకోండి.
మీది ఐఫోన్ అయితే
» మొదట సెట్టింగ్స్‌లోకి వెళ్లి.. అక్కడి నుంచి ప్రైవసీ అండ్ సెక్యూరిటీలోకి యాప్స్ పర్మిషన్స్ పరిశీలించాలి.
» అక్కడి వి.పి.ఎన్. అండ్ డివైజ్ మేనేజ్‌మెంట్ ఆప్షన్‌లో అపరిచిత ఫైల్స్ ఉన్నాయేమో చూడాలి.
» ముఖ్యంగా ఐఓస్‌ను అప్‌డేటెడ్‌గా ఉంచుకోవాలి. చాలావరకు స్పైవేర్‌లు సాంకేతిక లోపాలను ఉపయోగించుకుని లోనికి ప్రవేశిస్తాయి.
» సాధారణంగా యాపిల్‌లోని ‘వాల్డ్ గార్డెన్’ రక్షణ వ్యవస్థ ఉండటం వల్ల స్పైవేర్ అంత ఈజీగా చొరబడలేదు. అలాగని స్పైవేర్ అటాక్ అసాధ్యం అని చెప్పలేం. ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై వినియోగదారులకు పూర్తి నియంత్రణను, అధికారిక యాప్ స్టోర్ వెలుపల ఉన్న యాప్‌లను ఇన్ స్టాల్ చేసే సామర్థ్యాన్ని అందించడానికి ఫోన్ తయారీదారు విధించిన సాఫ్ట్‌వేర్ పరిమితులను తొలగించే ‘జైల్‌బ్రేక్’ మార్గాన్ని స్పైవేర్ ఉపయోగించుకోవచ్చు. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి.
నివారణే ఉత్తమ పరిష్కారం
స్పైవేర్‌ను గుర్తించడం కాస్త కష్టమే అయినప్పటికీ, దాన్ని నివారించడం మాత్రం సులభమే. అధికారిక యాప్ స్టోర్‌ల నుంచి మాత్రమే యాప్‌లను ఇన్ స్టాల్ చేసుకోండి. ఎస్.ఎం.ఎస్., వాట్సాప్, లేదా ఈమెయిల్ నుంచి వచ్చే అనుమానాస్పద లింకులను తెరవకూడదు. ఫోన్ ఆపరేటింగ్ సిస్టంలోని ‘జైల్‌బ్రేక్’ చేయకూడదు. అలా చేస్తే కీలకమైన భద్రతా కవచాలు తొలగిపోతాయి. అలాగే పటిష్టమైన, ఎవ్వరికీ ఊహకు కూడా అందని పాస్‌వర్డ్‌లను ఉపయోగించండి.
సాధ్యమైన రెండంచెల భద్రతను ఏర్పాటు చేసుకోండి. పబ్లిక్ వై–ఫైలు ఫ్రీగా వస్తున్నాయి కదా అని ఓ ఫోన్‌ని తెరిచి పెట్టుకోకండి. ఫైళ్లు, సినిమాలు వంటి డౌన్లోడ్ చేయడం చేశారో.. మీ పని అయిపోయినట్టే. ఇక మీ ఫోన్ హ్యాక్ అయిందని అనుమానం వస్తే ఫ్యాక్టరీ సెట్టింగ్స్‌ని తొలగించి, ఆపరేటింగ్ సిస్టమ్‌ను తిరిగి ఇన్ స్టాల్ చేయడం స్పైవేర్‌ను తొలగించడానికి మిగిలిన ఏకైక, ఉత్తమమైన మార్గం.
కేంద్ర ప్రభుత్వ ఆందోళన
డిజిటల్ గూఢచర్యానికి స్మార్ట్‌ఫోన్‌లు, ఇతర డివైజ్‌లను సోషల్ మీడియా ఉపయోగిస్తున్న ధోరణిపై కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆందోళన వ్యక్తం చేసింది. వ్యక్తులకు రాజ్యాంగ హక్కులు ఉన్నట్టే సోషల్ మీడియా సంస్థలకూ ఉండాలని కర్ణాటక హైకోర్టులో ‘ట్విట్టర్’ చేసిన వాదనలకు స్పందిస్తూ, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహ్‌తా డిజిటల్ గూఢచర్యం అంశాన్ని ప్రస్తావనకు తెచ్చారు. సెలబ్రిటీలు తమ కోసం వచ్చే సందర్శకులను ఫోన్‌లు బయటే పెట్టి రమ్మని విజ్ఞప్తి చేయవలసిన పరిస్థితి నేడు నెలకొని ఉందని ఆయన వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.