
దీపావళి పేరిట ఏపీకే ఫైల్స్ పంపుతున్న సైబర్ కేటుగాళ్లు
అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయవద్దని సూచిస్తున్న సైబర్ భద్రతా నిపుణులు
సాక్షి, హైదరాబాద్: దీపావళి పండుగ సందర్భంగా ఒకరికొకరు శుభాకాంక్షల సందేశాలు పంపుకోవడం అత్యంత సాధారణం. ఇటీవల వాట్సాప్‌లో ఇలాంటి సందేశాలు ట్రెండీగా మారాయి. తమ బంధువులు, స్నేహితులకు వినూత్నంగా శుభాకాంక్షలు చెప్పాలన్న తొందరలో కొందరు సైబర్ భద్రతా మరుస్తున్నారు. పండుగ శుభాకాంక్షల పేరిట సైబర్ నేరగాళ్లు ఏపీకే (ఆండ్రాయిడ్ ప్యాకేజీ కిట్) ఫైల్స్ పంపుతున్నట్టు సైబర్ భద్రత నిపుణులు హెచ్చరి స్తున్నారు. దీపావళి ఆఫర్లు, గిఫ్ట్ కూపన్లతోపాటు ఇప్పుడు శుభాకాంక్షలకు సంబంధించిన మోసపూ రిత లింక్‌లు పంపుతున్నట్టుగా వారు చెపుతున్నారు.
ఏదైనా కంపెనీ తరఫున మీకు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టుగా పంపే ఈ లింక్‌లలో ‘మీ పేరు, ఫొటోతో మీకు తెలిసిన వారికి శుభాకాంక్షలు వినూత్నంగా చెప్పండి’అనే సందేశాన్ని జోడిస్తున్న ట్టు తెలిపారు. ఇలాంటి లింక్‌లపై క్లిక్ చేయగానే మన మొబైల్ ఫోన్ సైబర్ నేరగాళ్ల అధీనంలోకి వెళ్లడంతోపాటు వారు మన ఫోన్‌లో మాల్వేర్ యాప్‌లు ఇన్‌స్టాల్ చేసి ఆన్‌లైన్ బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు కొల్లగొట్టే ప్రమాదం ఉందని సైబర్ భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీ సీఎస్‌బీ) సమాచా రం ప్రకారం అక్టోబర్ 1 నుంచి ఈనెల 16 వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 390 మంది బాధితులు ఈ తరహా నకిలీ లింక్‌లపై క్లిక్ చేయడం ద్వారా రూ.8.5 లక్షలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో తెలియనివారి వాట్సాప్ నంబర్ల నుంచి వచ్చే సందేశాల్లోని లింకులపై క్లిక్ చేయవద్దని, ఏపీకే ఫైళ్లను డౌన్‌లోడ్ చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు.