
రష్యా అధ్యక్షుడితో సమగ్ర చర్చ జరిగిందన్న మోదీ
ద్వైపాక్షిక ఎజెండా ప్రగతిని సమీక్షించిన ఇరువురు నేతలు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధినేత పుతిన్‌తో శుక్రవారం ఫోన్‌లో మాట్లాడారు. రష్యాతో ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి తాము కట్టుబడి ఉన్నట్లు పుతిన్ దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. తన మిత్రుడు పుతిన్‌తో చక్కటి, సమగ్రమైన సంభాషణ జరిగిందన్నారు. రష్యా నుంచి చమురు కొంటున్నందుకు ప్రతీకారంగా ఇండియా ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ 50 శాతం టారిఫ్‌లు విధించిన నేపథ్యంతో పుతిన్‌తో మోదీ చర్చించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
పుతిన్‌తో మాటామంతీ అనంతరం మోదీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఈ ఏడాది జరిగే 23వ ఇండియా–రష్యా వార్షిక సదస్సులో పుతిన్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు. ఉక్రెయిన్ విషయంలో తాజా పరిణామాలను తనతో పంచుకున్నందుకు పుతిన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారని చెప్పా రు.
భారత్–రష్యా ద్వైపాక్షిక ఎజెండా ప్రగతిని సమీక్షించామని వెల్లడించారు. ఉక్రెయిన్–రష్యా ఘర్షణ విషయంలో ఇండియా వైఖరి స్థిరంగా ఉన్నట్లు పుతిన్‌కు మోదీ తెలియజేశారని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. శాంతి చర్చలు ప్రారంభించాలని, ఘర్షణకు సాధ్యమైనంత ముగింపు పలకాలని ఉక్రెయిన్, రష్యాలను ఇండియా కోరుతున్న సంగతి తెలిసిందే. భారత భద్రతా సలహాదారు గురువారం రష్యాలో పర్యటించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ ఏడాది భారత్‌లో పర్యటించబోతున్నారని ఆయన నిర్ధారించారు.