
వాషింగ్టన్: అమెరికాలో సామాజిక మాధ్యమం టిక్‌టాక్ బాధ్యతలను ప్రముఖ టెక్ సంస్థ ఒరాకిల్ చేపట్టనుంది. అమెరికా వినియోగదారుల కోసం అవసరమైన అల్గారిథమ్‌ను త్వరలో టిక్‌టాక్ అందజేయనుంది. ఈ మేరకు అధ్యక్షుడు ట్రంప్ శుక్రవారం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ఫోన్ సంభాషణ సందర్భంగా ఒప్పందం కుదిరినట్లు ఓ అధికారి వెల్లడించారు.
చైనాకు చెందిన బైట్‌డ్యాన్స్ కంపెనీ యాజమాన్యంలో టిక్‌టాక్ పనిచేస్తోంది. తాజా ఒప్పందంతో అమెరికాలోని టిక్‌టాక్ వినియోగదారులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని చైనా కంపెనీ తారుమారు చేసేందుకు అవకాశం ఉందనే ఆందోళనలకు చెక్ పడుతుందని భావిస్తున్నారు.
ఈ ఒప్పందంలో సిల్వర్ లేక్ అనే ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కూడా భాగస్వామిగా ఉంటుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. టిక్‌టాక్‌ను అమెరికా కంపెనీకి అమ్మేయాలని లేదా నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుందని బైట్‌డ్యాన్స్‌ను హెచ్చరిస్తూ డెమోక్రాటిక్ పార్టీకి చెందిన గత అధ్యక్షుడు బైడెన్ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం బాధ్యతలు చేపట్టిన ట్రంప్..బైడెన్ విధించిన నిషేధం గడువును పలుమార్లు పొడిగించారు. టిక్‌టాక్‌తో చర్చలను సైతం కొనసాగించారు. తాజాగా, జిన్‌పింగ్‌తో ఫోన్ కాల్ సందర్భంగా దీనిపై ట్రంప్ ఒక అంగీకారానికి వచ్చారు.