
మానవుల ఆధ్యాత్మిక ప్రయాణంలో స్త్రీ పాత్ర అత్యంత కీలకమైనది. పురుషులు నిత్యజీవితంలో తమ చుట్టూ ఉండే స్త్రీలను గౌరవించడం ద్వారా తమ సూక్ష్మ శరీరం లోపల శక్తి కేంద్రాలను లేదా షట్చక్రాలను చైతన్యవంతం చేసుకోవచ్చు. తల్లిని గౌరవించినప్పుడు అతని లోపల శ్రీ గణేశుని సుగుణాలు స్థిరపడడం వలన మూలాధార చక్రము చైతన్య వంతం అవుతుంది. అలానే తల్లితో ఉండే అనుబంధం చక్కగా ఉన్నప్పుడు ఎడమవైపు హృదయ చక్రం చైతన్యవంతం అవుతుంది.
తన సోదరీమణులను గౌరవించినప్పుడు, ఎడమవైపు విశుద్ధి చక్రం చైతన్య వంతం అవుతుంది. తన భార్యను గౌరవించినప్పుడు ఆమె తన ఇంటికి గృహ లక్ష్మి కాబట్టి ఎడమవైపు నాభీ చక్రం చైతన్య వంతం అవుతుంది. అలానే భార్యతో అతని సంబంధం చక్కగా ఉన్నప్పుడు ఎడమవైపు హృదయ చక్రం చైతన్యవంతం అవుతుంది. పరస్త్రీలను తల్లి వలె లేదా సోదరి వలె గౌరవించినప్పుడు ఆజ్ఞా చక్రం చైతన్యవంతం అవుతుంది. కాబట్టి పురుషులు తమ ఆధ్యాత్మిక ఉన్నతి కోసం స్త్రీలను గౌరవించవలసిన ఆవశ్యకతను తెలుసుకొని తదనుగుణంగా నడుచుకోవాలి.
ఎప్పుడైతే ఒక స్త్రీ తన సంపూర్ణ శక్తులను ధరించి ఉపయోగిస్తుందో అప్పుడు ఆమె చాలా శక్తివంతమై భీకరంగా ఉంటుంది. అలా కాకుండా ఎప్పుడూ వాదిస్తూ, కొట్లాడుతూ, విమర్శిస్తూ, చౌకబారుగా ప్రవర్తిస్తుందో, అప్పుడు ఆమె శక్తులన్నీ వృధా అయిపోతాయి. ఆమె కావాలనుకుంటే పురుషులకంటే ఎక్కువగా పని చేయగలదు. అయితే మొట్టమొదటగా ఆమె ఎంతో నమ్రతతోను, అణకువతోనూ, హుందాతనంతోను, చక్కటి అవగాహనతోను, వాత్సల్యపూరితంగా ఉండి తనలోగల శక్తులను గౌరవించుకుంటూ, శాంతిని నెలకొల్పటం నేర్చుకోవాలి.
ఒక కవచం వలే రక్షణను కల్పించటం స్త్రీ యొక్క బాధ్యత. కవచం కత్తి యొక్క పనిని చేయలేదు. అలానే కత్తి కవచం చేసే పనిని చేయలేదు. అయితే ఆ రెండింటిలో ఏది గొప్ప? కవచమే గొప్ప. ఎందుచేతనంటే అది కత్తి యొక్క దెబ్బను తట్టుకోవాలి కాబట్టి. కత్తి విరుగుతుందేమో కానీ, కవచం మాత్రం విరగదు. అలా స్త్రీలు వారి శక్తులను గుర్తించి అందులో స్థిరపడాలి. నమ్రత అనేది ఆ శక్తికి ఒక గొప్ప ఇరుసు లాంటిది.
ఎంతో నమ్రతా భావంతో, విధేయతతో ఆ శక్తులను తమ లోనికి గ్రహించుకుని వారు అందులో స్థిరపడాలి. మనం రోజూ పేపర్లో కానీ టీవిలో కానీ సోషల్ మీడియాలో కానీ ఎన్నోహింసాత్మక, అనైతిక కార్యక్రమాలను చూస్తున్నాము. వాటి ప్రభావం చిన్న పిల్లల మీద, స్త్రీల మీద పడి సమాజం నాశనమవుతోంది. సహజయోగ మార్గాన్ని సరైన రీతిలో అర్థం చేసుకొని ఆచరించడం ద్వారా మహిళలు అటువంటి సమాజంలో పరివర్తన తీసుకు రాగలరు.
ప్రపంచ వ్యాప్తంగా సహజ యోగా ధ్యాన సాధన చేస్తున్న మహిళలు అందరూ శ్రీ మాతాజీ నిర్మలా దేవి అనుసరించిన, ప్రబోధించిన స్త్రీ ధర్మాలను ఆచరిస్తూ ఉత్తమ కుటుంబ సభ్యులుగా తమ తమ దైనందిన జీవితంలో ప్రశాంతమైన, సమతుల్య జీవనం గడుపుతున్నారు.
– డా. పి. రాకేష్ శ్రీ మాతాజీ నిర్మలాదేవి ప్రవచనాల ఆధారంగా