మురికి వాడ నుంచి ఏఐ ఎక్స్‌పర్ట్‌ రేంజ్‌కి..! | Shahina Attarwala's Life Atory As An AI Expert | Sakshi
Sakshi News home page

మురికి వాడ నుంచి ఏఐ ఎక్స్‌పర్ట్‌ రేంజ్‌కి..! పేదింటి అమ్మాయి విజయగాథ

May 27 2026 11:17 AM | Updated on May 27 2026 11:28 AM

Shahina Attarwala's Life Atory As An AI Expert

జీవితం ఎలాంటిదంటే... ‘ఏమీ లేదు’ అని నిరాశతో అనుకుంటే... ఏమీ ఉండదు! ‘చాలా ఉంది’ అని ఆశాభావంతో అనుకుంటే... చాలా ఉంటుంది!!  పగవాడికి కూడా ఇలాంటి పేదరికం వద్దు అనుకునే కటిక పేదరికంలో పుట్టిన షహీనా అత్తర్‌వాలా ఎప్పుడూ ఆశాభావంతో ఉండేది. ఆ ఆశాభావమే ఆమెకు కొత్త జీవితాన్ని ఇచ్చింది. మురికివాడ నుంచి ప్రసిద్ధ కంపెనీలలో ఏఐ ఎక్స్‌పర్ట్‌గా పనిచేసే స్థాయికి తీసుకెళ్లింది. పేదింటి అమ్మాయిల చదువు కోసం వివిధ రూపాల్లో తన వంతుగా కృషి చేస్తోంది.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఒక మారుమూల గ్రామంలో జన్మించింది షహీనా అత్తర్‌వాలా. ఆమె కుటుంబం బతుకుదెరువు కోసం ముంబైకి వచ్చింది. షహీనా తండ్రి చదువుకోలేదు. చిన్నాచితకా పనులు చేస్తూ బతుకుబండిని నడిపేవాడు. షహీన కుటుంబం ముంబైలోని దర్గా గల్లీ మురికి వాడలోని ఒక గుడిసెలో నివసించేది. దురదృష్టవశాత్తు ఆ గుడిసె కొన్నిరోజులకు అగ్ని ప్రమాదానికి గురైంది. సామాన్లు, ఉన్న కాస్తో కూస్తో డబ్బూ బూడిదయ్యాయి. ఆ తరువాత షన కుటుంబం ఒకచోటు నుంచి మరోచోటుకు మారుతూ ఇతరుల దయాదాక్షిణ్యాల మీద బతికేది.

ఒక కల అలా మొదలైంది...
పేదరికం ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా కుమార్తె చదువు విషయంలో తండ్రి నిర్లక్ష్యం వహించేవాడు కాదు. షహీనాను సెయింట్‌ జోసెఫ్‌ కాన్వెంట్‌లో చేర్పించాడు. పదవ తరగతి వరకు అక్కడే చదువుకుంది. తన ఇంటి చుట్టుపక్కల ఎంతోమంది మహిళలు నిస్సహాయంగా పురుషులపై ఆధారపడడాన్ని షన గమనించేది. ఆమె దృష్టిలో వారు బతుకుతున్నారు. అంతే! వారిలా తాను ఇతరులపై ఆధారపడకుండా స్వంత కాళ్లపై నిలబడాలంటే బాగా చదువుకోవాలనుకుంది.

అప్పు చేసి కంప్యూటర్‌ కోర్స్‌లో...
సెయింట్‌ జోసెఫ్‌లో నీడిల్‌ వర్క్‌ లేదా కంప్యూటర్‌ ఆప్షన్‌ ఉండేది. షహీనాకు కంప్యూటర్‌లపై ఆసక్తి. అయితే తగిన మార్కులు లేకపోవడంతో ఆమె దరఖాస్తు తిరస్కరణకు గురైంది. ఆ నిరాశలో... ‘ఇంటర్మీడియెట్‌ తరువాత కంప్యూటర్‌ కోర్స్‌లో చేరవచ్చా?’ అని ఎవరినో అడిగితే... ‘చేరవచ్చు’ అన్నారు. ‘అప్పటి వరకు ఓపిక పట్టాలి. తప్పదు’ అని తనకు తాను చెప్పుకుంది.

షహీనాను కంప్యూటర్‌ కోర్సులో చేర్పించడానికి తండ్రి అప్పు చేశాడు. కంప్యూటర్‌ కోర్స్‌ పూర్తి చేసిన తరువాత ఆ ఇన్‌స్టిట్యూట్‌లోనే ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేసింది షన. ఆ తరువాత... బుక్‌మై షో, షాదీ.కామ్, విగ్జో, జూమ్‌కార్‌లలో పనిచేసింది. 2020 సంవత్సరం షన ఉద్యోగ జీవితంలో కీలక మలుపు. ఆ సంవత్సరం మైక్రోసాఫ్ట్‌ డిజైన్‌ టీమ్‌లో చేరింది. డిజైన్‌ మేనేజర్‌ స్థాయికి చేరింది. డిజైన్‌ మేనేజర్‌గా ఎమర్జింగ్‌ మార్కెట్‌ టీమ్‌ కోసం డిజైన్‌ అండ్‌ రీసెర్చ్‌కు నాయకత్వం వహించింది. కొంత కాలం తరువాత ‘సేల్స్‌ఫోర్స్‌’లో ప్రిన్సిపల్‌ డిజైనర్‌గా చేరింది. సేల్స్‌ క్లౌడ్‌ కోసం జెన్‌–ఏఐప్రాజెక్ట్‌లకు నాయకత్వం వహించింది. అలా పని చేస్తూనే కామర్స్‌లో డిగ్రీ చేసింది. ఆ తరువాత లా చేసింది.

మురికివాడ వదిలి...
2021లో ముంబైలో తాను ఉంటున్న మురికివాడను వదిలి సొంత అపార్ట్‌మెంట్‌లోకి మారింది షన. నెట్‌ఫ్లిక్స్‌ సిరీస్‌ ‘బ్యాడ్‌ బాయ్‌ బిలియనీర్స్‌ ఇండియా’లో తాను చాలాకాలం పాటు నివసించిన దర్గా గల్లీ మురికి వాడను చూసింది. ఆ సిరీస్‌లో చూపించిన ఇళ్లలో ఒకటి తనదేనని సోషల్‌ మీడియాలో ΄ోస్ట్‌ చేసింది. తాము అక్కడ నివసించే రోజుల్లో పబ్లిక్‌ టాయిలెట్లు అత్యంత మురికిగా ఉండేవని, ఆ అపరిశుభ్రమైన టాయిలెట్లకు వెళ్లకుండా ఉండేందుకు చెత్తకుప్పలను బహిరంగ మలవిసర్జన కోసం ఉపయోగించేవారని, ఈ మురికివాడ నుంచి సౌకర్యవంతమైన జీవితంలోకి రావడానికి తన కఠిన శ్రమ, పట్టుదల కారణం అయ్యా యంటూ తన ΄ోస్ట్‌లో తెలియజేసింది.        

తన గెలుపు పాఠమే... వారికి పాఠం
‘కష్టపడ్డాను. జీవితంలో పైకి వచ్చాను. ఇక చాలు’ అనుకోలేదు షన. పేద పిల్లలు ఎంతోమంది ఉన్నారు. వారికి నా వంతుగా ఏదైనా చేయాలనుకుంది. నిరుపేద బాలికలకు చదువుప్రాముఖ్యతను తెలియజేస్తోంది. తన గెలుపు పాఠాన్నే వారికి పాఠంలా చెబుతోంది. సాంకేతిక విషయాలపై వారికి శిక్షణ ఇస్తోంది. బాలికల విద్యకు సంబంధించి స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తోంది. బెంగళూరుకు చెందిన ఒక బాలిక చదువు కోసం క్రౌడ్‌ఫండింగ్‌ ద్వారా సహాయం చేసింది. ఆమె సహాయం చేసిన బాలిక ఇప్పుడు ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ చదువుతోంది.

ఇప్పటికీ భయంగా, బాధగా ఉంటుంది!
ముంబై మురికివాడలో మేము నివసించిన పరిస్థితులను గుర్తు తెచ్చుకుంటే ఇప్పటికీ భయంగా, బాధగా ఉంటుంది. అది అత్యంత కఠినమైన జీవితం. లింగ వివక్ష నుంచి లైంగిక వేధింపుల వరకు ఎన్నో చూశాను. ఈ నేపథ్యంలో నేను ఒక కొత్తజీవితం కోసం కల కన్నాను. ఆ కలను నిజం చేసుకోవడానికి కష్టపడ్డాను. అడుగడుగునా తల్లిదండ్రులు నాకు అండగా నిలవడం నా అదృష్టం. – షహీనా అత్తర్‌వాలా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement