Saloni Gaur: కాలుష్యంపై కామెడీ.. కంగనాను అనుకరిస్తూ ‘రన్‌ అవుట్‌’... 17 లక్షల మంది సబ్‌స్క్రైబర్స్!

Saloni Gaur Successful Youtuber 17 Lakh Subscribers Inspiring Journey - Sakshi

రన్‌ అవుట్‌ సలోని!

Saloni Gaur Story In Telugu: ఆమెకు చిన్నప్పటినుంచి రోజూ న్యూస్‌ పేపర్‌లు చదవడం అలవాటు. వీటితోపాటు కథల పుస్తకాలు, నవలలు కూడా చదివేది. అలాగని పాఠ్యపుస్తకాలంటే పడదని కాదు...పాఠాలు కూడా శ్రద్ధగానే చదివేది. ఇలా బాల్యం నుంచి అనేక అంశాలపై పట్టుపెంచుకుని వాటి మీద కామెడీ చేసేది. అప్పట్లో సరదాగా చేసిన ఆ కామెడీనే ఇప్పుడామెని డిజిటల్‌ స్టార్‌ను చేసింది. ఆమే సలోని. 

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌ జిల్లాలో మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన సలోని గౌర్‌ అక్కడే స్కూలు చదువు పూర్తిచేసింది. తర్వాత ఢిల్లీ యూనివర్సిటీ లో పొలిటికల్‌ సైన్స్, ఎకనామిక్స్‌లో డిగ్రీ చేసింది. చిన్నప్పటి నుంచి కరెంట్‌ ఈవెంట్స్‌ను ఫాలో అవుతూ అన్నింటిలోనూ చురుకుగా ఉండేది. దేశంలో జరిగే అనేక సమకాలీన అంశాలపై హాస్యాన్ని జోడించి తనదైన శైలిలో అందరినీ అనుకరించేది.

ఆమె అనుకరణకు స్నేహితులు బాగా నవ్వుకునేవారు. దాంతో తను చేసే కామెడీని తన ఫోన్‌లో వీడియోలు తీసుకునేది. తర్వాత వాటిని తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్లో పోస్టు చేసేది. ఈ వీడియోలకు మంచి స్పందన లభించడంతో వీడియోలను మరింత మెరుగ్గా పోస్ట్‌ చేసేందుకు ప్రయత్నించేది. 

కాలుష్యంపై కామెడీ.. 
చిన్న చిన్న కామెడీ వీడియోలు పోస్టుచేస్తోన్న సలోనీ.. 2019 నవంబర్‌లో తన పేరు మీదనే ఓ యూట్యూబ్‌ చానల్‌ను ప్రారంభించింది. ఢిల్లీలోని కాలుష్యంపై ‘నజ్మా ఆపీ’ పేరిట వీడియో పోస్టు చేసింది. ఢిల్లీ కాలుష్యంపై చేసిన ఈ వీడియో సంచలనంగా మారింది. అతి తక్కువ కాలంలో దాదాపు పదిలక్షల వ్యూస్‌ వచ్చాయి. ఈ వీడియో బాగా వైరల్‌ అయ్యింది. నజ్మా అంటే.. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన మధ్యతరగతి ముస్లిం మహిళ.

తన సాధక బాధలు, రాజకీయ, సామాజిక అంశాలను తోటివారితో ఎలా చర్చిస్తుందో తెలిపే ఫన్నీవీడియోలు నజ్మా ఆపీలో కనిపిస్తాయి. ఈ క్యారెక్టరేగాక దేశంలోని ట్రెండింగ్‌లో ఉన్న వార్షిక బడ్జెట్, ఉల్లిపాయ ధరలు, సీఏఏ, ఢిల్లీలో ఎముకలు కొరికే చలి, పాకిస్థాన్‌ రచయిత ఫైజ్‌ అహ్మద్‌ వివాదాస్పద రచనలు, కరోనా, లాక్‌డౌన్, నిరసన లు, ఇండియన్‌ మామ్స్, డే టు డే లైఫ్, దేశంలో నిరసనలు, హక్కుల పోరాట ఉద్యమాలు, బాలీవుడ్‌ నటీనటులపై కామెడీ, మిమిక్రీ వీడియోలను పోస్టు చేసేది. వీటికి మంచి స్పందన ఉండేది. 

రన్‌–అవుట్‌ 
టిక్‌టాక్, కరోనా వైరస్, ఢిల్లీ ఎన్నికలు, అప్పటి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ భారత పర్యటన వంటి సలోని కామెడీ వీడియోలకు మంచి ఆదరణ లభించింది. కామెడీతోపాటు.. అనుకరణ కూడా చేసేది. ప్రముఖ బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ స్వరాన్ని బాగా అనుకరిస్తుంది. కంగనా మీడియా వేదికగా ఏది మాట్లాడినా, దానిని నవ్వించే విధంగా ‘రన్‌–అవుట్‌’ పేరిట వీడియోలు పోస్ట్‌ చేసేది.

ఈ వీడియోలు నెటిజనులను బాగా ఆకట్టుకునేవి. ఆ మధ్యకాలంలో కమేడియన్‌ కునాల్‌ కమరా, న్యూస్‌ యాంకర్‌ అర్నాబ్‌ గోస్వామిపై కంగన స్పందనను అనుకరించిన వీడియోలకు యాభై లక్షలకుపైగా వ్యూస్‌ వచ్చాయి. అంతేగాక నజ్మా ఆపీ క్యారెక్టర్‌తో వందకుపైగా వీడియోలు చేసింది. వీటన్నింటికీ లక్షల్లో వ్యూస్‌ వచ్చేవి. ఆదర్శ బహు, ట్యూమర్‌ భరద్వాజ్, సాసు మా వంటి క్యారెక్టర్‌లు కూడా మంచి పేరు తెచ్చాయి. ఇప్పుడు సలోనీ యూట్యూబ్‌ చానల్‌కు దాదాపు 17 లక్షలమంది సబ్‌స్క్రైబర్స్, ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌కు ఆరు లక్షలకు పైగా ఫాలోవర్స్‌ ఉన్నారు.   

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top