కథ: పక్షపాతం.. మా అన్న మా ఇంటి యువరాజు

Sakshi Funday Magazine: Pakshapatham Telugu Story By Sri Padma

అవి వేసవి సెలవులు. స్కూల్లేదు కాబట్టి టైమ్‌ చూడాల్సిన పనేలేదు. ఇంటి ఆవరణ, వెనకాల దొడ్డి, ముందు వాముల దొడ్డి, దాని పక్కనున్న పొలాలు అంతా మేమే. మేమంటే మా పదకొండేండ్ల అన్న, ఏడేండ్ల అక్క, అయిదేళ్ల వయసున్న నేనే కాక అన్న వయసే ఉన్న మా మేనత్త కొడుకు, కొంచెం చిన్నదయిన మేనత్త కూతురు. అందరికీ మా అన్నే లీడర్‌. విల్లు, బాణాలు, గాలిపటాలు అన్న చేస్తుంటే, కావాల్సినయి అందించటమే మా పని.

మా అన్నంటే ఆషామాషీ తమాషా అనుకునేరు. తాను మా ఇంటి యువరాజు. మా నానమ్మకు లేకలేక పుట్టిన కొడుక్కు మళ్ళీ లేకలేక పుట్టిన ఒక్కగానొక్క కొడుకు. ఇంకా అర్థం కాలేదా! అయితే వైరాగ్యం తీసుకున్న మా నానమ్మ మాటలు వినండి. 

‘మా నాయన, మా బంగారు. వాడు పుట్టబట్టి సరిపోయింది. ఇంట్లో ఉన్నది ఖాళీ చెయ్యటానికి మీరు పుట్టుకొచ్చారు ఇద్దరు ఆడ దయ్యాలు. ఆస్తిపాస్తులు, బంగారం మూట కట్టుకొనిపోతారు’. అలవాటుగా వినే నానమ్మ మాటలు పూర్తవకుండానే కొత్తగా పుట్టిన కోడె దూడ చెంగు చెంగున దూకుతుంటే, ముసిముసినవ్వులతో అమ్మ దాని వెనుక. ‘రాత్రేపుట్టిందిది’ అంది. ‘పాలుతాగిందా?’ ఆరా తీసింది నానమ్మ. ‘ఎక్కడ దానికి ఆటలే సరిపోతున్నాయి’. దాని అమ్మను ఆవుల పాకలో నుంచి తెచ్చి బయట ఇంటి ఆవరణలో కట్టేశారు.

 ‘పాలు సరిగా ఉన్నాయో లేదో ఆవుకు మంచి తిండి పెట్టండి’ అన్నది నానమ్మ. అసలే కోడెదూడను పెట్టిందయ్యే మరి! మా నానమ్మ దృష్టి మళ్లటంతో, ఇదే అదనని నేను కోడెదూడను పట్టుకోడానికి ఉరికాను. మా నానమ్మ మాటలు గాలిలో తేలివచ్చాయి ‘ఆడపిల్లవి, నిమ్మళం’ అంటూ. 

కాసేపటికి మా అక్క కూడా నాతో చేరి ముందు కాళ్ళు బారజాపి గేట్‌ దగ్గర నెమరేస్తున్న కోడెదూడను ముద్దు చేయటానికి వచ్చింది.. ‘ఎంత బాగుందో! దాని కళ్ళు చూడు ఎట్లా తిప్పుతుందో!’ . దాన్ని చూసి ఒళ్ళు మరిచిపోయి పెద్దగా నవ్వటం మొదలుపెట్టాం. వైరాగ్యం తీసుకున్న మా నానమ్మ ఇంట్లో ఎక్కడా ఉండదు కానీ ఆవరణలో ఏమూల ఉందో చెప్పటం కష్టం. ఆమె చుట్టుపక్కల లేదనుకుంటే ఆడపిల్లలం పప్పులో కాలేసినట్లే. 

‘ఏమిటే కాకిగోల. మీ నాన్నగారొస్తున్నారు, కొంచెం గొంతులు తగ్గించండి’ ఏ మూల నుంచో నానమ్మగొంతు దూసుకు వచ్చింది. నాన్నగారికి కోపమొస్తుందో లేదో తెలియదు కానీ నానమ్మ మాటలు విని ఆయనంటే భయం మాత్రం పెరిగింది. నానమ్మకు దూరంగా వాముల దొడ్లో బాణాలు చేస్తున్న అన్నవైపు ఉరికాం.
∙∙ 
మధ్యాహ్నం నాలుగోఐదో గంటలవుతుందనుకుంటా. మా అన్న బుర్రలో ఒక ఆలోచన మెరిసింది.  ‘పెద్ద చెరువుకి షికారు పోదాం. కట్ట ఎంతకట్టారో చూద్దాం. పక్కనే ఉన్న గట్టు కూడా ఎక్కొచ్చు’ అన్నాడు అన్న. ‘భలే చెప్పావురా! పదపోదాం’ అన్నాడు బావ.

వదిన, అక్క, నేను వారి వెనుకే తయారు. అది మంచి అదను. నానమ్మ పుస్తకం చదువుతూ తన వయసువాళ్లతో ఉత్తరపు వాకిలి దగ్గర కూర్చొని వేదాంతం చెప్తోంది. అమ్మ ఇంటి వెనుక పనివాళ్ళతో హడావుడి పడుతోంది. నాన్నగారు మధ్యాహ్నం నుంచీ జాడేలేదు. ఏ పక్కూరో పోయుంటారు. ఇక మా అన్నదే రాజ్యం. మేము మా అన్నకు నమ్మిన బంటులం. మేము చల్లగా జారుకుని ఇంటి ముందున్న పొలాల్లో నుంచి అడ్డంపడి చెరువుగట్టు వైపు గంతులేసుకుంటూ జోరుగా పోయాం.

గట్టుకు చుట్టాలతో షికారు పోవటం అలవాటే. కానీ పెద్దవాళ్ళు లేకుండా ఎప్పుడు పోలేదు. చెరువు కట్ట దగ్గరకొచ్చే సరికి పొద్దు వాలింది. కానీ మాకు ఒళ్ళు తెలిస్తేగా. కట్ట చాల ఎత్తే ఉంది. దూరంగా లారీలు ఎర్రదుమ్ము రేపుకుంటూ తిరుగుతున్నాయి. పనివాళ్ళు మట్టి మోస్తూ లీలగా కనిపించారు. కట్టెక్కగానే, అన్న పక్కనున్న కొండ వైపు తిరిగి, ‘ముందు గట్టెక్కుదాం. తిరిగొచ్చాక కట్టెంత పోశారో చూడొచ్చు’ అన్నాడు.

మా బావ వెంటనే, ‘బావుందిరా, ఎక్కుదాం పద’ అని దారితీశాడు. వెనకే మేము. ముళ్ళ పొదలు, కంప కట్టెలలోను నుంచి దారి చూసుకొని కొండ పైకెక్కేసరికి మా కోసమేనన్నట్లు పడమటన ఎర్రగా ఇంత పెద్ద సూర్యుడు. కొయ్యల్లాగా నిలబడి ప్రొద్దుకుంగే దిశగా కళ్ళార్పకుండా చూస్తున్నామో లేదో పొద్దు పోనేపోయింది. 
అన్న అన్నాడు, ‘దిగండి, దిగండి. మళ్ళీ చీకటి పడుతుంది. ఇంకా కట్టచూడాలి.’ 

గబాగబా క్రిందకి దిగి కట్టమీదకు చేరాం. మసక వెలుతురులో ఇంకా ఒక లారీ ఆకారం దూరంగా కనిపించింది. కట్ట మీద సగందూరం నడిచేసరికి లారీ లైట్లు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇంతలో ఏదో చప్పుడు దగ్గర కొస్తున్నట్లనిపించింది. ఎలుగు బంటి, అడవి పంది గురించి విన్నవన్నీ గుర్తొచ్చి భయమేసింది.

‘ఆమ్మో ఎలుగుబంటేమో?’ అన్నా అక్కతో.  ‘మాట్లాడబాకు’ అన్నది అక్క.  నేను ఏడుపులంకించుకున్నాను. అన్న అన్నాడు.. ‘ఏయి, నీకేం కాదు ఏడుపాపు’ . నేను ఠక్కున నోరు మూశాను. ఏడుపు ఆగలా మరి. మళ్ళీ రాగం తీద్దామనుకునేసరికి, ఓ పెద్దాయన దగ్గర కొచ్చి అన్నను, మమ్మల్ని తిప్పి, తిప్పి చూసి, ‘మీరు నారాయణరావుగారి పిల్లలు కదూ?’ అన్నాడు.

అన్న వెంటనే ‘అవును’ అన్నాడు. ‘ఇంతపొద్దుపోయి ఇక్కడేం జేస్తున్నారు. పురుగు, పుట్రా ఉంటాయి. నా లారీలో పంపిస్తాను. ఇక్కడే ఉండండి’ అని కట్టదిగి మాయమయ్యాడు. చీకట్లో మేము  మెదలకుండా నుంచున్నామేమో.. ఏది కదిలినా భయం. కొండ మీద నుంచి వచ్చే గాలి ఈలతో నా గొంతులో ఏడుపు సుడులు తిరిగి వెక్కిళ్ళ కింద మొదలు పెట్టెసరికి, అక్క దగ్గరకొచ్చి గట్టిగా పట్టుకొంది.

అక్కకు నాకంటే ఎక్కువే భయమని నా కప్పుడు తెలీదు. మా అన్నకు కూడా భయమేసిందో ఏమో, ఏమీ మాట్లాడ లేదు. కాసేపటికి లారీ రావటం కనిపించింది. లారీ ఆగటం, మమ్మల్నెక్కించుకోవటం చకచకా జరిగింది. అమ్మయ్య అనుకోని పళ్ళు బయట పెట్టి ఇకిలించబోయి మా అన్న మెదలకుండా గాలి తీసేసిన బూరలాగ మూలకు ఒదిగి కూచోడం చూసి, ఆగిపోయా. బావ, ఒదిన, అక్క మొహాలు కూడా ముడుచుకొనే ఉన్నాయి.

ఏమిటబ్బా అని ఆలోచించుకునే లోపులో కుదుపుల మీద మా ఇల్లురానే వచ్చింది. అందర్నీ గేట్‌ దగ్గర దింపి లారీ దాని దారిన  పోయింది. లోపలికి ఒక్క ఉరుకులో పోయి అమ్మను కావలించుకుందామనుకున్న. కానీ చెయ్యడ్డంగా పెట్టిన అన్న మొహంలోకి చూశా. ఇంటి ఆవరణలోకి తొంగిచూస్తూ అన్న ‘ఎవరూ కదలొద్దు’ అన్నాడు. లోపల ఎవరి పనుల్లో వాళ్ళున్నారు.

రత్నం పశువుల మేత కోసం దంటుపుల్లలు నరుకుతున్నాడు. ధర్మా ఎడ్లను నిమురుకుంటూ దాణా తినిపిస్తున్నాడు. అమ్మ పాలు తీసుకొని ఇంట్లోకి పోయే పనిలో ఉంది. నాన్నగారు చుట్టు పక్కల లేరు. అన్న చెయ్యడ్డం తీసి, గుసగుసగా ‘మాట్లాడకుండా సందువైపు పొండి’ అన్నాడు. నాన్నగారు తలవాకిటిౖ వెపు ఉండొచ్చని అందరికీ అర్థమయ్యి, పిల్లుల్లాగా సందు వైపు నడిచాం.  

‘ఎవర్రా అక్కడ?’ కొష్టం వైపు నుంచి నానమ్మ గొంతు చీకటిని చీల్చుకుంటూ వచ్చింది. ఎక్కడివాళ్లమక్కడే మేకేసినట్లునిలబడ్డాం. అన్న అంటే నానమ్మకు మహాప్రాణం. అది ఇప్పుడు ఆసరా కొచ్చింది. అన్న తెచ్చిపెట్టుకున్న ధీమాతో  ‘మేమే నానమ్మా.. ఆట అయిపోయి ఇంటి కొస్తున్నాం’. ‘ఇంత పొద్దు పోయేదాకా ఆటలేంటిరా? చీకట్లో పురుగుపుట్రా ఉండవ్‌?’ 

‘ఇంటికొచ్చాంగా మరి’ అని అన్న నడవటం మొదలుపెట్టిందాకా ఒక్కళ్ళు కూడా కాలు కదపలేదు. అమ్మను కావలించుకునే మాట వదిలేసి, అందరితో బుద్ధిగా కాళ్ళు కడుక్కొని హాల్లో కూర్చున్నా. నాన్నగారి అలికిడి లేదు. ఆత్రం దాచుకోలేని అన్న అటుగా వస్తున్న అమ్మను ఆపి  ‘నాన్నగారింకా ఇంటికి రాలేదా?’ అమ్మ ఆరాగా మా వైపు తిరిగి

‘ఇంకా ఊరికి పోయి రాలేదు. ఎందుకురా.. నాన్నగారితో పనేమయినా ఉందా?’  తత్తరపాటును దాచుకొన్నాడన్న, ‘ఏంలేదు, ఏంలేదు, ఊరికే అడిగా’ . అమ్మ అటు తిరగగానే అందరూ గట్టిగా ఊపిరి పీల్చుకుంటుంటే నేను అంతే చేశాను. ఎవరి దారిన వాళ్ళం లేచిపోయేవాళ్ళమేమో కానీ, నాన్నగారి మాటలు బయట నుంచి వినిపించాయి.

నానమ్మతోను, పనివాళ్ళతో అంటున్న మాటలవి. వింటూ చప్పుడు లేకుండా కూర్చున్నాం.  చెవులు దోరగా పెట్టి నాన్నగారు అరుగుమెట్లెక్కడం, అమ్మ ఎదురెళ్లటం, మా గుండెచప్పుడ్లు వింటూ కూర్చున్నాం. నాన్నగారు అమ్మను చూడటం తడవు ఉరుమురిమి మంగలం మీద పడ్డట్టడగటం మొదలు పెట్టారు.. ‘పిల్లలెక్కడా?’  అధాటుగా చూసి అయోమయంగా అమ్మ, ‘ఎందుకడుగుతున్నారు? వాళ్ళు హాల్లో ఉన్నారు’

‘సాయంత్రమంతా ఎక్కడ తిరుగుతున్నారో నీకు తెలుసా?’ అమ్మ గొంతు చిన్నబోయింది ‘ఎక్కడకెళ్లారండీ?’ ‘నన్నడుగుతున్నావా? నువ్వు కాదు ఇంట్లో ఉంది? నా వైపు చూస్తావెందుకు? ఎక్కడెక్కడ తిరిగొచ్చారో వాళ్ళనే అడుగు?’ హాల్లో నుంచి కాళ్ళు కడుక్కోటానికి పోతూ కోపంగా చేయి మా వైపు విసిరారు నాన్నగారు.  

అమ్మ మా దగ్గరకు వచ్చి అన్న వైపు తిరిగి, ‘ఏమిట్రా నాన్న ఇదంతా?’ ఆమె గొంతు ఇంకా చిన్నగానే ఉంది. అమ్మ మీద కురిసిన వడగండ్ల వాన నుంచి ఇంకా తేరుకోని అన్న జవాబేమీ చెప్పలేదు. నాన్నగారు సందులోకి పోయి కాళ్ళు కడుక్కొని, మళ్ళీ హాల్లోకి వచ్చి బట్టలు మార్చుకుంటున్నా మాట్లాడటం మాత్రం ఆపలేదు. ‘నీకు చెప్తారా వాళ్ళు? భయంలేకే చెప్పకుండా తిరుగుతున్నది. ఆ కాంట్రాక్టర్‌ రాకపోతే నీ పిల్లలెక్కడుండే వాళ్ళో ఆలోచించు?’

అమ్మకు ఇదంతా గందరగోళంగా కనిపించింది. మా వైపు విచారంగా చూసి ఏంచెప్పాలో తెలీక అంతే అన్నట్లుగా తల ఊపింది. ఎవరి మాటలకు ఎదురుచూడని నాన్నగారు కోపం తగ్గేవరకు మాట్లాడి  స్నానానికి పోయారు. తిరిగి వచ్చిన అమ్మ జవాబు కోసం మా ముందు నిలబడింది. అన్నకి ఇక చెప్పక తప్పలా. క్షమించమన్నాడనుకున్నారా? అయితే మీరు కూడా పప్పులో కాలేశారన్నమాటే. మా నాన్నగారి స్టైల్లో మాట్లాడటం మొదలు పెట్టాడు. అంటే అమ్మ మీద అచ్చంగా నాన్నగారి లాగే అరవటం మొదలుపెట్టాడన్నమాట. మేము గుడ్లెళ్లబెట్టి చూస్తున్నాం.

‘ఏం చేయకుండా ఇంట్లో కూర్చోవాలా? ఇవి అసలు సెలవలేనా? కొంచెం సరదాగా ఉంటుంది కదాని చెరువు గట్టును చూద్దామనుకున్నాం. అది కూడా తప్పేనా?’  రోషంతో అన్న ముక్కెర్రబడింది.  అమ్మ నోటి మీద చేయివేసుకొని విన్నది. అయినా లేకలేక పుట్టిన కొడుకాయె మరి. అమ్మ మెత్తబడిపోయి ‘నాతో ఒకమాట చెప్పాలి కదా, నాన్నా?’ అన్నది.

మా అన్న ధాటి తగ్గిందనుకుంటున్నారేమో. అసలు తగ్గలా. ‘చెప్తే ఏమనేదానివి? నాన్నగారిని అడగమనే దానివి, అంతేనా? నాన్నగారు మమ్మల్ని పోనిస్తారనే అనుకుంటున్నావా?’ నాన్నగారి ప్రశ్నలకు జవాబులేనట్లే, అన్న ప్రశ్నలకు కూడా అమ్మ దగ్గర జవాబేమీ లేదు. ఇంగితజ్ఞానమే అమ్మబలం. ‘అది సరే మరి. మీకు తిరిగి రావటం కష్టమయిందా? ఈ కాంట్రాక్టరెవరు?’

కష్టమయిందని ఒప్పుకోవటం అన్నకు ఇష్టంలేదు. అన్న మాట్లాడకబోయేసరికి అక్క అందుకొంది. ‘అమ్మా! మేము చీకట్లో తిరగటం చూసి నాన్నగారికి తెలిసినాయన లారీలో ఎక్కించి తీసుకొచ్చాడు’ . అమ్మ మళ్ళీ నోటి మీద చేయి వేసుకుంది.. ‘మన రాత బాగుంది, ఆయన సమయానికి వచ్చాడు. అది ఎంత పెద్ద చెరువు కట్టా, ఏం కథా? దగ్గరా, దాపా, అక్కడెక్కడో అడవిలో ఉండే. పెద్దవాళ్ళు లేకుండా పోవచ్చా? పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్లంటారు’

మా అన్న వెంటనే, ‘ఏం చేస్తారేంటి?’ అని తల ఎగరేశాడు. అన్న వైపు చూపు నిలిపి అమ్మ, ‘అసలే కొత్త చెరువు కట్టయ్యే. ఏ ఘోరమైన జరగొచ్చు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. దేవుడు చల్లగా చూశాడు. అంతే చాలు’ అమ్మ పైకి చూసి దండం పెట్టుకుంది. అంతకుముందే వచ్చిన నానమ్మ.. అమ్మ వెనుక మమ్మల్ని చూస్తూ నిలబడింది. అమ్మ మీద ఎగిరిపడ్డ అన్న.. నానమ్మ చూపులకు ఇబ్బందిగా మొహం పెట్టాడు.  

ముగ్గురు పెద్దపిల్లల వైపు కర్ర ఆడిస్తూ నానమ్మ ‘పొద్దు వాలేదాకా ఇక్కడే ఆడుకుంటిరి. ఈ చిన్నవాళ్లకయితే తెలియదు. అంత పొద్దుపోయిందని మీకింగితం ఉండాలా?’. అన్నతో పాటు, బావ, ఒదిన కూడా తలొంచుకున్నారు. నాన్నగారి పని చూడటానికి పోతున్న అమ్మనాపి నానమ్మ అంది.. ‘చిన్నది భయపడుంటది. రాత్రికి పక్కలో పడుకోబెట్టుకో’ . అమ్మ నావైపు ఆరాగా చూసి తలాడించింది. ఒక్క గంతులో పోయి అమ్మను కావలించుకున్నా.
-శ్రీ పద్మ 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top