
కర్నాటక విద్యార్థిని రితుపర్ణకు దిగ్గజ సంస్థ రోల్స్ రాయిస్
72 లక్షల ప్రీ ప్లేస్‌మెంట్ ఇచ్చి భారీ జీతం పొందిన అండర్ గ్రాడ్యుయేట్‌గా వార్తల్లో నిలిపింది. సహ్యాద్రి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో రోబొటిక్స్ అండ్ ఆటోమేషన్ చదువుతున్న రితుపర్ణ గతంలో చేసిన ప్లేస్‌మెంట్ ప్రయత్నాలు విఫలమైనా పట్టుదలతో ఇంత భారీ అవకాశాన్ని పొందగలిగింది. ఈ కాలపు యువతకు స్ఫూర్తిని ఇవ్వదగ్గ రితుపర్ణ పరిచయం...
రితుపర్ణ కథ అచ్చు సినిమా కథలాగే మలుపులతో ఉంటుంది. సామాన్యమైన అమ్మాయని అందరూ అంచనా వేస్తే అసామాన్యురాలిగా కనిపించి, నిరూపించి నివ్వెర పరిచింది. అర్హతలున్నాయా అని ప్రశ్నించిన చోటే ఆశ్చర్య పోయే అంగీకారం పొందింది. మరి ప్రఖ్యాత రోల్స్ రాయిస్ సంస్థ నుంచి ఏడాదికి రూ.73.3 లక్షల ప్రీ–ప్లేస్‌మెంట్ ఆఫర్ పొందడం అంటే మాటలా? దేశంలో ఈ అవకాశాన్ని పొందిన అతి కొద్దిమంది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులలో ఒకరు కె.ఎస్. రితుపర్ణ.
డాక్టర్ కాబోయి...
కర్నాటకలోని తీర్థహళ్లి తాలూకా కోడూరుకు చెందిన కె.ఎన్.సరేష్, గీత దంపతుల కుమార్తె రితుపర్ణ. ఆమె చెల్లెలు రిత్విక. రితుపర్ణ పీయూసీ పూర్తి చేసిన తర్వాత మెడిసిన్ చదవాలని అనుకుంది. ఆ తర్వాత యూపీఎస్సీ రాసి సివిల్ సర్వీసెస్‌లో చేరాలన్నది ఆమె కల. ఇందుకోసం 2002లో నీట్ రాసింది. అయితే ఆమెకు ప్రభుత్వ సీటు రాలేదు. ప్రైవేటులో చదివేంత స్థోమత లేదు. ఆ సమయంలో ఇంజినీరింగ్‌లో చేరమని ఆమె తండ్రి సలహా ఇచ్చారు.
ఇంజినీరింగ్ చదివితే ప్రభుత్వ ఉద్యోగం పొందవచ్చని సలహా ఇచ్చారు. అలా సీఈటీ కౌన్సెలింగ్‌లో ప్రభుత్వ సీటు సం పాదించి సహ్యాద్రి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్‌లో రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ ఇంజినీరింగ్‌లో చేరింది రితుపర్ణ. మొదట్లో బి.టెక్ పట్ల అంత ఆసక్తి చూపక పోయినా రాను రాను ఆసక్తి పెంచుకొని ఉన్నతి సాధించింది. రోబొటిక్స్ కోర్సు ఆసక్తికరంగా అనిపించి కొత్తగా ఆలోచించడం, కొత్త మార్గాలు అన్వేషించడం ఆమెకు ఉత్సాహాన్ని ఇచ్చింది.
ఆమె ఆవిష్కరణ
దేశానికి వెన్నెముకగా నిలిచే రైతు వ్యవసాయంలో ఇంకా శ్రమపడుతూ ఉన్నాడు. అతని శ్రమను తగ్గించే క్రమంలో ఏదైనా కొత్తగా కనుక్కుంటే బాగుంటుందని ఆమె భావించింది. ప్రధానంగా వక్కలు పండించడం చాలా శ్రమతో కూడుకున్న పని అని ఆమె గమనించింది. ఆ శ్రమను తగ్గించేందుకు తన బృందంతో కలిసి రోబోటిక్ హార్వెస్టర్ స్ప్రేయర్ మోడల్‌ను అభివృద్ధి చేసింది.
ఈ ఆవిష్కరణ గోవా ఐనెక్స్ పోటీలో బంగారు, వెండి పతకాలను గెలుచుకుంది. ఇది ఆమె తొలి విజయం. తరువాత ఎన్‌ఐటీకే సూరత్కల్‌లోని పరిశోధనా బృందంలో రితుపర్ణ చేరింది. అక్కడ ఆమె ప్రాజెక్టులు ప్రయోగశాలకే పరిమితం కాలేదు. డిప్యూటీ కమిషనర్ ముల్లై ముహిలన్‌ను కలిసింది. ఘన వ్యర్థాల నిర్వహణ కోసం ఒక యాప్ అభివృద్ధికి కృషి చేసింది. అందరూ తన ప్రతిభను మెచ్చుకుంటున్నా రితుపర్ణ దృష్టి మాత్రం అంతర్జాతీయ గుర్తింపుపైనే ఉంది.
ఇదీ చదవండి: Vidya Balan మైండ్ బ్లోయింగ్.. గ్లామ్ అవతార్, అభిమానులు ఫిదా!
రోల్స్ రాయిస్ సందేహం
తన ప్రతిభకు తగిన గుర్తింపు కోసం ఇంటర్న్‌షిప్ కోరుతూ రోల్స్ రాయిస్‌ను సంప్రదించింది రితుపర్ణ. అయితే అక్కడి నుంచి ఆమెకు విచిత్రమైన సమాధానం వచ్చింది. ‘మీరు మా సంస్థలో భాగం కావడానికి అర్హతలున్నాయా?‘ అని మొదలుపెట్టి, ‘ఒక నెలలో మేం చెప్పే పనుల్లో ఒక్కటి కూడా మీరు పూర్తి చేయలేరని‘ అని వాళ్లు సమాధానం ఇచ్చారు.
దీంతో కంపెనీ తన అర్హతను ప్రశ్నిస్తోందని ఆమె అర్థం చేసుకుంది. అయినా నిరుత్సాహపడకుండా ధైర్యంగా తనను తాను నిరూపించుకోవడానికి అవకాశం కోరింది. కంపెనీ అంగీకరించి ఒక నెల గడువు తో కూడిన పనిని అప్పగించింది. దీక్ష, పట్టుదల, సంకల్పంతో నెల రోజుల గడువున్న ఆ పనిని ఆమె వారంలోనే పూర్తి చేసింది. ఆమె వేగం, కచ్చితత్వం, పట్టుదలకు రోల్స్ రాయిస్ యాజమాన్యం ఆశ్చర్య పోయింది.
ఆమెపై నమ్మకంతో మరిన్ని పనులు అప్పగించారు. అలా ఎనిమిది నెలల పాటు ఒక పక్క కళాశాలకు వెళ్తూనే మరోవైపు వారిచ్చిన పనులన్నీ సకాలంలో పూర్తిచేసింది. గతేడాది డిసెంబర్‌లో రోల్స్ రాయిస్ ఆమెకు వారి జెట్ ఇంజిన్ తయారీ విభాగంలో ప్రీ–ప్లేస్‌మెంట్ అవకాశాన్ని అందించింది. దీంతో అర్ధరాత్రి నుంచి ఉదయం 6 గంటల మధ్య ఆ కంపెనీలో పనిచేస్తూ, ఉదయం కాలేజీకి వెళ్లి వచ్చేది రితుపర్ణ.
ఆమె పనితీరు గమనించి తన ప్రారంభ ప్యాకేజీని సంవత్సరానికి రూ.39.6 లక్షల నుండి రూ.72.3 లక్షలకు పెంచింది కంపెనీ. ఏడో సెమిస్టర్ పూర్తి చేసిన తర్వాత, రితుపర్ణ అధికారికంగా అమెరికాలోని టెక్సాస్ యూనిట్‌లో చేరనుంది.
‘ఈ విజయం మీకెలా ఉంది’ అని రితుపర్ణని అడిగితే, ‘ప్రముఖ సంస్థలు కేవలం పట్టణం, నగరంలో చదివే విద్యార్థులకు మాత్రమే అవకాశాలు ఇస్తాయని చాలామంది అనుకుంటారు. అది అబద్ధమని నిరూపించడం ఆనందంగా ఉందని’ పేర్కొంది. ప్రభుత్వ సీటు పొందిన స్థాయి నుండి రోల్స్ రాయిస్‌లో ఉద్యోగిగా ఎదగడం వరకూ ప్రోత్సహించిన తన అమ్మానాన్నలు, కుటుంబసభ్యులు, అధ్యాపకులు, మిత్రులకు
కృతజ్ఞతలు తెలిపింది.