
అధిక దిగుబడినివ్వటంతో పాటు 2 నెలల ముందే కాపునిచ్చే హైబ్రిడ్ సీతాఫలం
అక్టోబర్‌లో ప్రూనింగ్ చేస్తే 8–9 వారాల ముందే కాపు
అన్ని విధాలా మెరుగైన ఫలితాలనిస్తోందంటున్న ఐఐహెచ్‌ఆర్
వర్షాకాలపు అద్భుత ఫలాల్లో సీతాఫలం ముఖ్యమైనది. వర్షాధారపు సేద్య భూములు, బంజరు భూముల్లో సీతాఫలం విరివిగా పండుతుంది. సాధారణంగా ఆగస్టు–సెప్టెంబర్ నెలల్లో శీతాఫలాలు మార్కెట్‌లోకి వస్తుంటాయి. అయితే, ప్రూనింగ్ చేయటం ద్వారా జూన్ నెలలోనే సీతాఫలాల కాపు చేతికి తెచ్చుకోవచ్చంటున్నారు బెంగళూరులోని భారతీయ ఉద్యాన పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్ – ఐఐహెచ్‌ఆర్) శాస్త్రవేత్తలు.
ఆరేడేళ్ల క్రితమే ఐఐహెచ్‌ఆర్ రూపొందించిన ఈ ఇంప్రూవ్‌డ్ హైబ్రిడ్ రకాన్ని ఉద్యాన రైతు మరిబసవయ్య గత ఆరేళ్లుగా సాగు చేస్తూ చక్కని ఫలితాలు సాధిస్తున్నారు. సౌత్ బెంగళూరు తాలూకాలోని సులివర గ్రామంలో ఆయన అర్క సహన్ రకం సీతాఫలం తోటను సాగు చేస్తున్నారు.
ఐఐహెచ్‌ఆర్ ఈ తోట సందర్శన కార్యక్రమాన్ని జూలై 31న నిర్వహించింది. రైతులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు పెద్దసంఖ్యలో పాల్గొని అర్క సహన్ సీతాఫల క్షేత్ర విశేషాలను తెలుసుకున్నారు. అర్క సహన్ సాగు చేసే అభ్యుదయ రైతులు బెల్గావికి చెందిన మహంతేశ్, మహేంద్ర మాట్లాడుతూ స్థానిక మార్కెట్లతో పాటు దూర ప్రాంత మార్కెట్లలో కూడా అర్క సహన్ రకం పండ్లకు మంచి ధర వచ్చిందని చెప్పారు. కరువు పీడిత ప్రాంతాల రైతులు కూడా ఈ వంగడం పనితీరుపై సంతోషాన్ని వ్యక్తం చేశారని ఐఐహెచ్‌ఆర్ ఫల విభాగం అధిపతి డాక్టర్ ఎం. శంకరన్ తెలిపారు.
అక్టోబర్‌లో ప్రూనింగ్.. జూన్‌లో దిగుబడి..
ఇసుక, రాళ్ల, గ్రావెల్ కలిసిన తేలిక నేలలతో పాటు బరువైన నేలలు కూడా ఈ రకానికి అనుకూలమే. అయితే, నీరు నిల్వ ఉండకుండా చూసుకోవటం చాలా ముఖ్యం. 6–7.5 మధ్య ఉదజని సూచిక ఉన్న నేలలు అనుకూలమని ఐఐహెచ్‌ఆర్ చెబుతోంది. సాధారణ సీతాఫలం రకాల చెట్లు వర్షాలు కురిసే ఆగస్టు–సెప్టెంబర్ నెలల్లో సీతాఫలాలు కోతకు వస్తాయి. వర్షాల కారణంగా ఆంత్రాక్నోజ్, పండీగ తదితర చీడపీడల బెడద ఎక్కువగా ఉంటున్నది. అయితే, అర్క సహన్ చెట్లకు అక్టోబర్ నెలలో కొమ్మ కత్తిరింపులు (ప్రూనింగ్) చెయ్యాలి. గత ఏడాది చెట్టు పెరిగిన దాంట్లో 75% మేరకు ప్రూనింగ్ చెయ్యాలి. దీని కారణంగా, పూత, కాత 8–9 వారాల ముందే వస్తుంది. జూన్‌లో పండ్లు కోతకు వస్తాయని, పండు నాణ్యతతో పాటు ముందుగానే మార్కెట్‌లోకి రావటం వల్ల రైతుకు మంచి ఆదాయం వస్తున్నదని ఐఐహెచ్‌ఆర్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఏపీ, తెలంగాణకూ అనువైనదే!
అర్క సహన్ సీతాఫలం హైబ్రిడ్ రకం కర్ణాటకతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని వర్షాధార ప్రాంతాల్లో సాగుకు కూడా అనువైనదే.
ఈ రకం సీతాఫలాలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. పండ్ల సైజు పెద్దగా, గింజలు తక్కువ, గుజ్జు ఎక్కువగా, తియ్యగానూ ఉంటుంది. సాధారణ రకాలతో పోల్చితే అర్క సహన్ హైబ్రిడ్ సాగు మెరుగైన ఫలితాలనిస్తున్నదనటానికి దీనిపై పెరుగుతున్న ఆసక్తే నిదర్శనం.
ఎకరానికి 160 మొక్కలు వేసుకోవాలి. మొక్క ధర రూ. 70. బెంగళూరులోని ఐఐహెచ్‌ఆర్ నర్సరీలో మొక్కలు దొరుకుతాయి.
మొబైల్: 70192 30983.
– డాక్టర్ టి. శక్తివేల్, ప్రధాన శాస్త్రవేత్త, ఐఐహెచ్‌ఆర్, బెంగళూరు
అర్క సహన్ రైతులకు వరం!
అర్క సహన్ సీతాఫలం మెరుగైన హైబ్రిడ్ రకం చిన్న సన్నకారు రైతులకు, ముఖ్యంగా వర్షాధార వ్యవసాయం చేసే రైతులకు వరంలాంటిది. వాతావరణ ఒడిదుడుకుల్ని దీటుగా తట్టుకుంటూ గ్రామీణుల జీవనోపాధులను పెంపొందించే క్లైమెట్ స్మార్ట్ పండ్ల రకాల్లో ఇది కూడా ఒకటి. చిన్న సన్నకారు రైతుల తలరాతను మార్చే శక్తి అర్క సహన్‌కు ఉంది. ఏ వాతావరణానికైనా ఇట్టే నప్పుతుంది. పండు నాణ్యత అద్భుతంగా ఉంది. వినియోగదారుల మన్ననలు కూడా చూరగొనటం వల్ల అర్క సహన్ సీతాఫలం తోటల ద్వారా రైతులకు దీర్ఘకాలంలో స్థిరమైన ఆదాయం చేకూరుతుందని చెప్పగలను.
– డా. తుసార్ కాంతి బెహెర, సంచాలకులు, భారతీయ ఉద్యాన పరిశోధనా సంస్థ (ఐఐహెచ్‌ఆర్), బెంగళూరు