
నిలబడలేకపోతున్న పశువులకు చికిత్స చేయించటం చాలా కష్టంతో కూడిన పని. సాధారణంగా పశువు ప్రసవించిన తర్వాత, కండరాల సమస్య వల్ల, సోలిపోయి పైకి లేవలేక పోవటం జరుగుతూ ఉంటుంది. దీన్నే ‘డౌనర్ కౌ సిండ్రోమ్’ అంటారు. అలాంటి కష్టం వచ్చినప్పుడు ఏడెనిమిది మంది మనుషులు పట్టుకొని పశువును లేపి నిలబెట్టే ప్రయత్నం చేస్తుంటారు. ఇది పాడి రైతులకు, గోశాలల నిర్వాహకులకు, బాధిత పశువులకు కూడా చాలా బాధాకరమైన అనుభవం.
ఈ గడ్డు సమస్యను సులువుగా అధిగమించేందుకు ఉపయోగపడే ‘పోర్టబుల్ కౌ లిఫ్ట్’ అనే పరికరం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఐఐటీ బాంబేలోని రూరల్ టెక్నాలజీ యాక్షన్ గ్రూప్ (రుటాగ్)కు చెందిన మెకానికల్ ఇంజ నీరింగ్ ప్రొఫెసర్ తన్మయ్ కె భండార్కర్ ఈ సాంకేతికతను రూపొందించారు. సెంటర్ ఫర్ టెక్నాలజీ ఆల్టర్నేటివ్స్ ఫర్ రూరల్ ఏరియాస్ (సీటీఏఆర్‌ఏ)కు చెందిన ప్రొ. విశాల్ ఆర్. సర్దేశ్ పాండే ఈ డిజైన్‌కు మెరుగులు దిద్దారు.
పశువును ప్రత్యేకంగా కుట్టిన జాకెట్‌ను పశువుకు చుట్టి, రెండు వైపుల నుంచి కొసలను పైకి తీసి, ఇరువైపులా నిలువుగా పది అడుగుల ఎత్తున ఉన్న ఇనుప చట్రం పైభాగంలో అమర్చిన గిలక ద్వారా గొలుసును సులువుగా లాగుతూ పశువును నిలబెట్టడానికి ఈ పరికరం ఉపయోగ పడుతుంది. డౌన్ కౌ సిండ్రోమ్ చికిత్సకు అనేక రోజుల సమయం పడుతుంది.
అప్పుడు పశువును నిలబెట్టడానికి, ఒక చోటు నుంచి మరో చోటుకు నడిపించడానికి కూడా ఈ పరికరం ఉపయోగపడుతుంది. 500–600 కిలోల బరువు గల పశువును ఇది నిలబెట్టగలదు. ఇప్పటికే అనేక గోశాలల్లో దీన్ని వాడి పరిశీలించి మెరుగు పరిచారు. ఐఐటీ బాంబే అనుమతితో ఈ పోర్టబుల్ కౌ లిఫ్ట్‌ను రుటాగ్ అనుమతితో జి.ఎన్. మంజునాథ తయారు చేసి రూ. 50 వేలకు విక్రయిస్తున్నారు. మొబైల్: 87226 49074.
manju.genasinakuni@gmail.com