‘‘ఒకప్పుడు రామాయణం వినాలంటే అమ్మమ్మ దగ్గర కూర్చునేవారు. మహాభారతం తెలుసుకోవాలంటే తాతయ్య చెప్పే కథలు వింటూ ఊ కొట్టేవారు. ఆ తర్వాత ఎన్నో వేదికలు మారాయి. ఇప్పుడు ఆ కథా గుచ్చాల్ని డిజిటల్ రూపంలో అందిస్తున్నాం’’ అని తెలిపారు ‘లిపి ఎపిక్’ డిజిటల్ నిర్వాహకులు విద్యాసాగర్ అనిసింగరాజు.
గతంతో పోల్చితే నేటి తరానిది ఓ కొత్త సమస్య. ఇతిహాసాల మీద తీసిన సీరియళ్లు, సినిమాలు, వచ్చిన అనేకానేక పుస్తకాలు .. కథల కల్పితాలతో ఎన్నో సందేహాలు తలెత్తుతుంటాయి. ‘దీనిని గమనించి ఒక తరం విస్మరించిన వాస్తవాల మూలాలకు వెళ్లి మరీ తీసుకువచ్చే ప్రయత్నం చేశాం’ అని తెలిపారు లిపి డైరెక్టర్ చాగంటి ప్రసాద్.
‘దాదాపు రెండేళ్ల΄పాటు దీనిని వెలుగులోకి తీసుకురావడానికి అనుభవజ్ఞులతో కలిసి కసరత్తు చేశాం. సుమారు 500 మందితో నేరుగా మాట్లాడాం. వారిలో చాలామందికి రామాయణ, భారత, భాగవతాల గురించి తెలుసుకోవాలని ఉంది. కానీ చదవడానికి, నేర్చుకోవడానికి సమయం, ఓపిక ఉండట్లే దు. దాంతో నిమిషంలోనే ఇతిహాసాలతో కనెక్ట్ అయ్యే మార్గం కనుక్కున్నాం.
అదే దీనికి మొదటి మెట్టు’ అంటారు వైస్ప్రెసిడెంట్ అపర్ణ. తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, ఉత్తర భారతదేశంలో మూడు వేల మంది స్కూల్ పిల్లలకు ఉచితంగా డిజిటల్ రూపంలో చేరువయ్యే ప్రయత్నం చేశామని తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని స్కూళ్లకు తమ కృషిని అందించనున్నామని, లక్ష యూజర్లకు చేరువవుతున్నామని వివరించారు.
చూడచ్చు.. ఆడచ్చు ... డిజిటల్ రూపంలో ఉన్న ఈ కథనాలను ఒకేసారి చదవచ్చు, వినచ్చు, చూడచ్చు. ఆడచ్చు. పాత్రల చుట్టూ ఉన్న బంధాల గురించి, ఆ మేధస్సు గురించి తెలుసుకోవచ్చు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలలో రామాయణ మహాభారతాలను దశలవారీగా తెలుసుకునే అవకాశం ఉంది. చిన్న కథలు రోజువారీగా నేర్చుకునేందుకు, వివరణాత్మక కథలు మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు, ఆడియో కథలు వినేందుకు ఉపయోగపడతాయి. క్విజ్ల ద్వారా నేర్చుకున్న విషయాలను పరీక్షించుకోవచ్చు.
ఒకే వేదిక... పిల్లలు మొబైల్ స్క్రీన్లలో తలలు దూర్చి గంటల తరబడి వీడియో గేమ్స్ ఆడుతుంటారని పేరెంట్స్ కంప్లైంట్. అందువల్లే చదువు మీద ఆసక్తి పోయిందని టీచర్లూ చెబుతుంటారు. అదే వారి మొబైల్లో ఈ గేమ్ డౌన్ లోడ్ చేసుకుంటే రామాయణ, మహాభారతాలను గేమ్స్ ద్వారా తెలుసుకుంటూ మేధోవికాసం దవచ్చు.
ఒక విద్యార్థికి క్విజ్గానూ, మరోవ్యక్తికి కథ రూపంలోనూ ఒకే వేదిక ద్వారా భిన్నరూపాలలో ఇతిహాసాల గురించి తెలుసుకునే అవకాశం ఉంది. తల్లిదండ్రులు ఆడియో కథలను పిల్లలకు వినిపించవచ్చు. ఉపాధ్యాయులు సాంస్కృతిక అంశాలను చర్చకు తీసుకురావచ్చు. పెద్దలు తమకు తెలిసిన కథలను గుర్తుచేసుకోవచ్చు. ఈ విధంగా లిపి కుటుంబంలో తరాల మధ్య కథలకు వారధిగా మారుతుంది.
– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
అనుభవజ్ఞులు, ఇతిహాసాల మూలాలు
తెలిసిన పండితుల నుంచి మూలాల్లో ఉన్న వాస్తవ కథనాలను పొందుపరిచాం. జీవితపు విలువలను, మేధోశక్తికి కావల్సిన పరిజ్ఞానపు భాండాగారాన్ని అందిస్తున్నాం.
– చాగంటి ప్రసాద్, డైరెక్టర్, లిపి ఎపిక్స్


