ఆఫీస్‌బాయ్‌ నుంచి ఏకంగా ఐటీ కంపెనీ సీఈఓ రేంజ్‌కి..! | Ojas innovative technologies ceo phaniraj success story | Sakshi
Sakshi News home page

ఆఫీస్‌బాయ్‌ నుంచి ఏకంగా ఐటీ కంపెనీ సీఈఓ రేంజ్‌కి..!

Jun 13 2026 6:22 AM | Updated on Jun 13 2026 10:42 AM

Ojas innovative technologies ceo phaniraj success story

‘హి’..స్టోరీ 

ఫణిరాజ్‌

‘అక్కడే ఆగిపోకు... ముందుకు వెళ్లి చూడు’ అనేది వ్యక్తిత్వ వికాస పాఠాల్లో ఒకటి. ఆఫీస్‌ బాయ్‌గా పనిచేసిన ఫణిరాజ్‌ అక్కడే ఆగిపోలేదు. చకచకా షార్ట్‌హ్యాండ్‌ నేర్చుకొని క్లర్క్‌ ఉద్యోగం సాధించాడు. అక్కడే ఆగిపోతే...కోట్ల రూపాయల టర్నోవర్‌ కలిగిన ఐటీ కంపెనీకీ అధిపతి అయ్యేవాడు కాదు. ‘సాధించాలి అనే గట్టి పట్టుదల ఉంటే అసాధ్యం అనేది లేదు’ అంటున్న తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లికి చెందిన ఫణిరాజ్‌ జలిగామ స్ఫూర్తిదాయకమైన సక్సెస్‌ స్టోరీ...

చిన్న వయసు నుంచే ఫణిరాజ్‌ను ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. పదో తరగతిలో మంచి మార్కులు సాధించినా, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నత చదువులు చదివే అవకాశం దక్కలేదు. కుటుంబానికి ఆసరాగా నిలవడానికి పాన్ షాప్‌లో పని చేశాడు. వారపత్రిక ఏజెంట్‌గా, ఎలక్ట్రీషియన్ గా, డ్రైవర్‌గా ఎన్నో చిన్న చిన్న ఉద్యోగాలు చేశాడు. ఎన్ని పనులు చేసినప్పటికీ చదువుపై ఆసక్తి దూరం కాలేదు. ఐటీఐ, ఇంటర్మీడియట్‌ పూర్తి చేశాడు. తర్వాత కరీంనగర్‌ జిల్లా కోర్టులో ఆఫీస్‌ బాయ్‌గా ఉద్యోగంలో చేరాడు.

ఆత్మవిశ్వాసమే శక్తిగా...
కరీంనగర్‌ జిల్లా కోర్టులో ఆఫీస్‌ బాయ్‌గా చేరడం ఫణిరాజ్‌ జీవితంలో కీలక మలుపు. కోర్టులో పనిచేస్తున్న క్లర్కులను చూసి ‘నేను కూడా ఏదో ఒకటి సాధించాలి’ అనుకున్నాడు. షార్ట్‌హ్యాండ్‌లో శిక్షణ తీసుకుని నిమిషానికి 225 పదాలు టైప్‌ చేసే స్థాయికి చేరుకున్నాడు. దీంతో స్టెనోగ్రాఫర్‌గా పదోన్నతి పొంది కెరీర్‌లో మరో మెట్టు ఎక్కాడు. తనలో ఆత్మవిశ్వాసం మరింతగా పెరిగింది. ఇంకా ఏదైనా సాధించాలనే తపన పెరిగింది. స్టెన్‌గ్రాఫర్‌ ఉద్యోగాన్ని వదిలి ఐటీ రంగంలోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయం తన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.
  
ఆమె ఆయన బలం
ఎంసీఏ పట్టభద్రురాలైన జీవిత భాగస్వామి శ్రీలలిత రాకతో ఫణిరాజ్‌ ప్రయాణం కొత్త మలుపు తిరిగింది. ఆమె ఇచ్చిన ధైర్యం, ప్రోత్సాహంతో కంప్యూటర్‌ కోర్సుల్లో చేరాడు. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి, రూ.15,000 జీతంతో పుణెలోని ఐటీ సంస్థలో చేరాడు.  ‘బంగారంలాంటి ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి రిస్క్‌ చేస్తున్నావు’ అన్నారు కొందరు.

రిస్క్‌ చేస్తేనే కదా...  ఘన విజయాలు దక్కేవి! 
ఈ విషయం తెలిసిన ఫణిరాజ్‌ ‘నేను రిస్క్‌ చేస్తున్నాను’ అనుకోలేదు. ‘మరో మంచి ప్రయత్నం చేస్తున్నాను’ అని మాత్రమే అనుకున్నాడు.  ఐటీ కంపెనీలో పనిచేస్తూనే ఎంబీఏ పూర్తి చేసి, క్రమంగా సీనియర్‌ మేనేజర్‌ నుండి అసోసియేట్‌ డైరెక్టర్‌ స్థాయికి ఎదిగాడు.

పాజిటివ్‌ ఎనర్జీతో.. .పద ముందుకు...
ఐటీ కంపెనీలో పనిచేయాలనే కలను సాకారం చేసుకున్న ఫణిరాజ్‌ మరో పెద్ద కల కన్నాడు. అది అంత సులువైన పని కాదని ఫణిరాజ్‌కు తెలియనిది కాదు. అయినా సరే, ముందుకు వెళ్లాడు.

తన స్నేహితుడు అరుణ్‌ కుమార్‌తో కలిసి ‘ఓజాస్‌ ఇన్నోవేటివ్‌ టెక్నాలజీస్‌‘ అనే ఐటీ కంపెనీ స్థాపించాడు, ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా, భార్య తన బంగారు నగలను అమ్మి అండగా నిలబడింది. 

ప్రారంభ కష్టాలు ప్రారంభంలోనే ఉంటాయి. మంచి రోజులు తప్పకుండా వస్తాయి’ అనుకున్న ఫణిరాజ్‌ ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ‘పాజిటివ్‌ ఎనర్జీ’తో ముందుకు వెళ్లాడు. తాను ఆశించినట్లే కంపెనీ లాబాల బాట పట్టింది. దేశ, విదేశాల్లో ఎన్నో ప్రాజెక్టులతో 100 కోట్ల రూపాయల టర్నోవర్‌ని సాధించి, 900 మందికి పైగా ఉపాధి కల్పిస్తోంది.

గెలుపు అంటే...ఇతరులను గెలిపించడం కూడా!
‘ఎలాగైనా గెలవాలి. మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలనుకున్నాను’ ఒకప్పుడు. ఇప్పుడు మాత్రం... నాలాగే గ్రామీణ నేపథ్యం నుండి వచ్చే విద్యార్థులకు, ఐటీ రంగంలోకి రావాలని కోరుకునే నిరుద్యోగులకు శిక్షణ ఇస్తూ వారి భవిష్యత్తుకు బాటలు వేయాలనుకుంటున్నాను. బీఏ, బీకాం చదివిన వారికి కూడా ఐటీ  రంగంలో అవకాశాలు ఎలా దక్కించుకోవాలో నేర్పిస్తూ, వారి జీవితాల్లో వెలుగులు నింపడమే నా ముందున్న లక్ష్యం.
– ఫణిరాజ్, సీఈవో, ఓజాస్‌ ఇన్నోవేటివ్‌ టెక్నాలజీస్‌

– గుడ్ల శ్రీనివాస్, సాక్షి, పెద్దపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement