Non Communicable Disease: ఎన్‌సీడీ సమస్య?.. 35 ఏళ్లు నిండినవారికి అనారోగ్యం తప్పదా? ఎందుకిలా?

Most Of Indians Facing Non Communicable Diseases, What Are They - Sakshi

ఎన్‌సీడీ.. సందేహం వద్దు. ఓసీడీ కాదు, ఇది ఎన్‌సీడీ. అంటే...నాన్‌ కమ్యూనికబుల్‌ డిసీజ్‌ (ఎన్‌సీడీ). ఆధునిక జీవనశైలిలో మన చుట్టూ పొంచి ఉన్న అనారోగ్యాల సమూహం ఇది. ఒకరి నుంచి ఒకరికి సంక్రమించదు, కానీ ఒక దగ్గర, ఒక వాతావరణంలో పనిచేసే వారికి ఏకకాలంలో ఈ సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. 35 సంవత్సరాలు నిండితే చాలు... నేనున్నానంటూ ఈ సమూహంలోని ఏదో ఒక అనారోగ్యం తొలుత పలకరిస్తుంది. ఆ తర్వాత మరిన్ని అనారోగ్యాలకు మార్గాలను సుగమం చేస్తుంది. మనదేశంలో ఏడాది కిందట ‘ఇల్‌నెస్‌ టూ వెల్‌నెస్‌’ ప్రచారంలో భాగంగా నిర్వహించిన సర్వేలో వెల్లడైన వాస్తవాలు ఇలా ఉన్నాయి.

ముప్పై ఐదేళ్లు నిండిన వారిని ఏదో ఒక ఎన్‌సీడీ అనారోగ్యం వేధిస్తోంది. వాటిలో హైపర్‌ టెన్షన్, డైజెస్టివ్‌ డిసీజెస్, డయాబెటిస్‌ సమస్యలు ప్రధానంగా ఉంటున్నాయి. క్యాన్సర్‌ కూడా ఈ ఎన్‌సీడీల్లో ఉంటోంది. కానీ దాని శాతం అత్యంత తక్కువగానే ఉన్నట్లు ‘ఇల్‌నెస్‌ టూ వెల్‌నెస్‌’ నివేదిక సమాచారం. అసోసియేటెడ్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ఆఫ్‌ ఇండియా (అసోచామ్‌), థాట్‌ ఆర్బిట్రేజ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (టారి) సంయుక్తంగా నిర్వహించిన ‘ఇల్‌నెల్‌ టూ వెల్‌నెస్‌’ సర్వేలో 21 రాష్ట్రాల్లో రెండు లక్షల ముప్పై వేల మందికి పైగా వ్యక్తులను సంప్రదించారు. సమతుల్యత లోపించిన ఆహారం, ఆల్కహాల్‌ సేవనం, ధూమపానం ప్రత్యక్ష కారణాలవుతున్నాయి.

వీటికి దారితీస్తున్న పరోక్ష కారణాల మీద కూడా దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు వైద్యులు. వృత్తి ఉద్యోగాల్లో ఎదురయ్యే మానసిక ఒత్తిడి నుంచి బయటపడడానికి, తక్షణ ఉపశమనం కోసం కొంతమంది విపరీతంగా ఆహారం తీసుకుంటున్నారు. అంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎక్కువ మోతాదులో తీసుకోవడం కాదు. జిహ్వకు రుచి కోసం, మెదడుకు సంతృప్త భావన కోసం ప్రాసెస్‌డ్‌ షుగర్స్‌తో చేసిన జంక్‌ఫుడ్‌ ఎక్కువగా తీసుకుంటున్నారు. కొద్ది నెలల్లోనే దేహం సెంట్రల్‌ ఒబేసిటీ (నాభి వలయం చుట్టు కొలత పెరగడం) కి లోనవడం జంక్‌ఫుడ్‌ వల్లనేనంటారు నిపుణులు. దీనికి తోడు వ్యాయామం తగ్గిపోవడం కూడా కారణమే. ఇక వర్క్‌ షెడ్యూళ్లు, పని వాతావరణాలు మెదడు, నాడీ వ్యవస్థ, ఎండోక్రైన్‌ సిస్టమ్‌ మీద ఒత్తిడిని పెంచుతున్నాయి. ఇవి హైపర్‌టెన్షన్, డయాబెటిస్‌కు దారి తీస్తున్నాయి. 

యాభై ఏళ్ల కిందట
ఎన్‌సీడీ సమస్యలు ఇప్పటికిప్పుడు ఊడిపడిన అనారోగ్యాలు కాదు, కానీ ఇప్పుడు వాటి శాతం ఏడాదికేడాదికీ గణనీయంగా పెరుగుతోంది. 1970 దశకంలో రెండు శాతం ఉంటే ఇప్పుడు 35 నుంచి 40 శాతంగా ఉంది. ఇది ఇలా ఉంటే... స్ట్రోక్‌ (పక్షవాతం) కేసులు గడచిన ముప్పై ఏళ్లలో గణనీయంగా పెరుగుతున్నాయని న్యూఢిల్లీలోని ‘లేడీ హార్డింగ్‌ మెడికల్‌ కాలేజ్‌’ న్యూరాలజీ హెవోడీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ రాజిందర్‌ కె ధమిజ తెలియచేశారు. వృత్తిఉద్యోగవ్యాపారాల్లో రోజుకు ఎంత ఉత్పాదకతను సాధించామనే గణనతోపాటు రోజుకు ఎంత ఆహారం తింటున్నాం, ఎన్ని కేలరీలు తీసుకుంటున్నామోననే స్పృహ కలిగి ఉండడం, అలాగే ఎంత వ్యాయామం చేశామనే ఆలోచన కూడా ఉండాలి. ఎన్‌సీడీ సమస్యలతో ఎదురయ్యే తదనంతర పరిణామాలను నివారించాలంటే ముప్పైలలోనే ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలి. ఒత్తిడి నుంచి బయటపడడానికి ధూమపానం, ఆల్కహాల్‌కు బదులుగా రోజూ జిమ్‌ లేదా ఇతర ఫిజికల్‌ యాక్టివిటీ, బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌లను ఆశ్రయించడం ఆరోగ్యకరం.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top