'నారీ శక్తిమతి' రాధికా మెనన్‌

Meet Radhika Menon: Who Is She To Recive Nari Shakhti Puraskar - Sakshi

అంతర్జాతీయ ఇంటర్నేషనల్‌ ఉమెన్స్‌ డే సందర్భంగా భారత రాష్ట్రపతి భవనం వేడుకలకు వేదికైంది. వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన మహిళలను రాష్ట్రపతి స్వయంగా ‘నారీశక్తి పురస్కారం’తో సత్కరిస్తున్నారు. వారిలో రాధికా మెనన్‌ కూడా ఉన్నారు. తుపానులో నడి సముద్రంలో చిక్కుకుపోయిన మత్స్యకారులను రక్షించిన ధీర ఆమె.

కెప్టెన్‌గా తొలి మహిళ
రాధికామెనన్‌ పుట్టింది కేరళలోని కోదుంగళ్లూర్‌లో. కొచ్చిలోని ‘ఆల్‌ ఇండియా మెరైన్‌ కాలేజ్‌’లో కోర్సు పూర్తయిన తర్వాత షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో రేడియో ఆఫీసర్‌గా కెరీర్‌ మొదలు పెట్టారు. ఆ తర్వాత 2012లో ఇండియన్‌ మర్చంట్‌ నేవీలో కెప్టెన్‌ అయ్యారు. మర్చంట్‌ నేవీలో ఒక మహిళ కెప్టెన్‌ కావడం ఆమెతోనే మొదలు. మెనన్‌ అదే ఏడాది దాదాపుగా 22 వేల టన్నుల అత్యంత కీలకమైన ఆయిల్‌ ట్యాంకర్‌ ‘సువర్ణ స్వరాజ్య’ నిర్వహణ బాధ్యతలను చేపట్టారు. ఆమె ధైర్యసాహసాల గురించి తెలుసుకోవాలంటే ఏడేళ్లు వెనక్కి వెళ్లాలి.

లంగరు తెగిపోయింది
అది 2015, జూన్‌ నెల. బంగాళాఖాతంలో పెను తుపాను. సముద్రం అల్లకల్లోలంగా సుడులు తిరుగుతోంది. అలలు 15 అడుగుల ఎత్తు ఎగిసిపడుతున్నాయి. చేపల వేటకు వెళ్లిన జాలర్ల పడవ ‘దుర్గమ్మ’ ఆ సుడుల్లో చిక్కుకుపోయింది. లంగరు తెగిపోవడంతో పడవ గమ్యం లేకుండా అలల తాకిడికి అల్లల్లాడుతూ కొట్టుకుపోతోంది. ఆహారపదార్థాలు, తాగునీరు ఉప్పునీటి పాలయ్యాయి. పడవలో ఉన్న ఏడుగురు జాలర్లు ప్రాణాలను చిక్కబట్టుకుని తీరం చేరే దారి కోసం చూస్తున్నారు. వారి ఇళ్లలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. రోజులు గడుస్తున్నాయి. సముద్రంలోకి వెళ్లిన వాళ్ల జాడలేకపోవడంతో ఆశలు కూడా వదులుకున్నారు.

ఆచూకీ దొరకని జాలర్లు పదిహేనేళ్ల నుంచి యాభై ఏళ్ల మధ్య వయసు వాళ్లు. అన్ని ఇళ్లలో తల్లులు, భార్యాపిల్లలు తమ తమవాళ్ల కోసం ఆశగా ఎదురు చూసి చూసి ఇక ఆశ చంపుకుని మనసు చిక్కబట్టుకుని అంత్యక్రియలకు సన్నద్ధమవుతున్నారు. ఆ సమయంలో సముద్రంలో రాధికా మెనన్‌ తన టీమ్‌తో ఈ మత్స్యకారులను రక్షించడంలో మునిగిపోయి ఉన్నారు. పడవలో చిక్కుకున్న వాళ్లకు లైఫ్‌జాకెట్లు అందచేసి, పైలట్‌ ల్యాడర్‌ సహాయంతో దుర్గమ్మ పడవలో నుంచి ఒక్కొక్కరిని షిప్‌ మీదకు చేర్చారామె. అలా అందరూ ప్రాణాలతో తమవాళ్లను చేరుకున్నారు.

తుపాను సమయంలో నడిసముద్రంలో అంతటి సాహసోపేతంగా విధులు నిర్వర్తించినందుకు గాను 2016 సంవత్సరానికి గాను ఆమె అత్యున్నత ధైర్యసాహసాలు ప్రదర్శించిన వారికి ప్రదానం చేసే ‘ఇంటర్నేషనల్‌ మారిటైమ్‌ ఆర్గనైజేషన్‌ అవార్డు’ను, ఐఎమ్‌వో బ్రేవరీ అవార్డును అందుకున్నారు. షిప్‌ కమాండర్‌గా ఇవన్నీ విధుల్లో భాగమేనంటారు రాధిక. తోటి మహిళా నావల్‌ అధికారులు సునీతి బాల, శర్వాణి మిశ్రాలతో కలిసి ముంబయి కేంద్రంగా ‘ఇంటర్నేషనల్‌ ఉమెన్‌ సీ ఫారర్స్‌ ఫౌండేషన్‌ స్థాపించి యువతులను ఈ రంగంలోకి ప్రోత్సహిస్తున్నారామె. అలాగే ఢిల్లీ నుంచి వెలువడుతున్న మ్యారిటైమ్‌ మ్యాగజైన్‌ ‘సీ అండ్‌ కోస్ట్‌’ కు సలహామండలి సభ్యురాలు కూడా. ఇవన్నీ తెలిసే కొద్దీ రాధికామెనన్‌ నారీశక్తి పురస్కారానికి అచ్చంగా మూర్తీభవించిన రూపం అనిపిస్తుంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top