
కలలను సాకారం చేసుకోవాలంటే..కలలు కంటూ కూర్చుంటే సరిపోదు.. నాకేదీ కలసి రావడం లేదంటూ నిట్టూరిస్తే కుదరదు. కష్టాలను, కన్నీటి సుడిగుండాలను దాటాలి. అడ్డంకులెన్నెదురైనా ఛేదించాలి, అవరోధాలను అధిగమించాలి, ఆలోచనలకు పదునుపెట్టాలి. అదే విజయానికి బాటలు వేస్తోంది. ఆటో డ్రైవర్ నుండి రూ.800 కోట్ల వ్యాపారవేత్త వరకూ ఎదిగిన సత్యశంకర్ స్ఫూర్తిదాయక కథ గురించి తెలిస్తే.. ఎలాంటి వారికైనా ఉత్సాహ రాకమానదు.దృఢ సంకల్పం, అంకితభావం ఉంటే అత్యంత అసాధ్యమైన కలలను కూడా నిజం చేసుకోవచ్చు అనడానికి ఒక చక్కని ఉదాహరణ.
కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని బెల్లారేలో ఒక పేద గ్రామ పూజారి నలుగురు కుమారులలో మూడవవాడు సత్య శంకర్. పేదరికం కారణంగా 12వ తరగతి తర్వాత చదువు మానేయాల్సి వచ్చింది. డ్రైవింగ్ లైసెన్స్ చేతిలో ఉండటంతో, కేంద్ర ప్రభుత్వ స్వయం ఉపాధి పథకం కింద రుణం తీసుకుని ఆటోరిక్షా కొన్నాడు. ఆటో-రిక్షా డ్రైవర్‌గా టెక్ సిటీ ఉత్సాహం సత్యాన్ని కూడా ఆవిరించిందో ఏమో గానీ వ్యాపారవేత్తగా మారాలన్న ఆలోచనకు మరింత పదును పెరిగింది. 1980లలో ఆటో-రిక్షా డ్రైవర్‌గా బెంగళూరులోని ట్రాఫిక్ సాగరంలో మునిగి తేలుతూ వీధుల్లో పయనించేవాడు. కష్టపడి ఆటో అప్పు తీర్చేశాడు. దానిని అమ్మి అంబాసిడర్ కారు కొన్నాడు. ఈ ఉత్సాహంతో జీవితాన్ని మెరుగు పరచు కోవాలనే కల సాకారం వైపు అడుగులు వేశాడు.
తరువాత కొన్ని రోజులు ఆటోమోటివ్ గ్యారేజ్ వ్యాపారంలోకి ప్రవేశించి టైర్లు అమ్మడం ప్రారంభించాడు. ఆటోమొబైల్ దుకాణాన్ని నడుపు తున్నప్పుడు అతను ఫైనాన్స్ నిర్వహణలోసూక్ష్మ నైపుణ్యాలను నేర్చుకున్నాడు. కస్టమర్లు విడిభాగాలను అప్పుకింద కొనుగోలు చేసి, తరువాత వాయిదాలలో చెల్లించేవారు. అతను ఆ అనుభవాన్ని ఉపయోగించి ఆటోమొబైల్ ఫైనాన్స్ కంపెనీని ప్రారంభించాడు. 1994లో, అతను ప్రవీణ్ క్యాపిటల్‌ను ప్రారంభించి, తక్కువ వడ్డీకి డబ్బు అప్పుగా ఇచ్చాడు. ప్రవీణ్ క్యాపిటల్‌ను ప్రత్యేకంగా నిలిపిన విషయం ఏమిటంటే, అది కొత్త వాహనాలను మాత్రమే కాకుండా, సెకండ్ హ్యాండ్ వాహనాలను కొనుగోలు చేయడానికి రుణాలు అందించింది.
ఆ తరువాత మరో సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. 2000లో పుత్తూరు సమీపంలోని నరిమోగేరులో ‘బిందు’ పేరుతో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ కంపెనీని ప్రారంభించాడు. గ్రామీణులకు ఉద్యాగాల కల్పన, శుభ్రమైన నీరు అందించడమే లక్ష్యం. రెండేళ్లకు శంకర్ ఒక ప్రత్యేకమైన రుచితో కార్బోనేటేడ్ డ్రింక్‌తో వ్యాపారంలోకి దిగాడు. స్నేహితులతో ఉత్తర భారతదేశ పర్యటనలో అతను చూసిన సోడా అమ్మే దుకాణమే దీనికి నాంది. జీరా, ఉప్పు మిశ్రమంతో సోడా కలిపితే మంచి ప్రొడక్ట్ అవుతుంది, లాభాలొస్తాయని ఊహించాడు. అంతే 2002లో తన సొంత కంపెనీ ఎస్‌జీ కార్పొరేట్స్‌ను స్థాపించాడు. తొలుత “బిందు జీర మసాలా సోడా”ను మార్కెట్లోకి వదిలాడు. కాలం గడిచే కొద్దీ, బిందు జీర మసాలా సోడా ప్రజాదరణ పొందింది. ఇలా ఎస్‌జీ కంపెనీ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ , స్నాక్స్ 55 ఉత్పత్తులను విక్రయిస్తుంది. బెంగళూరు దాటి కర్ణాటక అంతటా, అంతకు మించి వినియోగదారులను ఆకర్షించింది. వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందింది. ఇక వెనుదిరిగి చూసింది లేదు. దాదాపు 20 ఏళ్ల కష్టం సత్యానికి గొప్ప సక్సెస్‌ను అందించింది.
ఇదీ చదవండి: భగవద్గీత శ్లోకం, బ్లాక్ వెల్వెట్ గౌను : ఐశ్వర్య సెకండ్ లుక్‌పై ప్రశంసలు
ఈ విజయం అంత తేలిగ్గా రాలేదు. సత్యశంకర్ కె స్థాపించిన ఎస్‌జీ గ్రూప్ బహుళ రంగాల వ్యాపారంగా ఎదిగింది. ఆహారం, పానీయాలు, ఆటోమొబైల్ విడిభాగాలు, ఆటో ఫైనాన్స్, సేంద్రీయ వ్యవసాయం,పండ్ల ప్రాసెసింగ్ లాంటి రంగాల్లో విలువైన సేవలు అందించింది. ఫలితంగా ఎస్‌జీ గ్రూపు వార్షిక టర్నోవర్ దాదాపు రూ. 800 కోట్లు.
ఇదీ చదవండి : కాన్స్‌లో వివాదాల బ్యూటీ ఊర్వశి : ఈ సారి రూ. 5లక్షల డైమండ్ బ్యాగ్‌తో
అంతేనా ఆటో రిక్షాతో ప్రారంభమైన సత్య జీవితం ఇప్పుడు రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIIIదాకా చేరింది. దీని ధర రూ. 11 కోట్లకు పై మాటే. మరో విశేషం ఏమిటంటే సత్యశంకర్ కోసంప్రత్యేకంగా తయారు చేయబడిందన్న ఘనతను కూడా దక్కించుకున్నాడు. బెంగళూరు వీధుల్లో ఆటో నడపడం నుండి రోల్స్ రాయిస్ వరకు, అతని కథ నిజంగా ఆశ, ధైర్యం ,విజయంతో కూడుకున్నది. ఆలోచనలకు, ఆవిష్కరణ హద్దులు లేవన్న స్ఫూర్తికి నిదర్శనం.