మరొకరితో పారిపోయి, అతను మోసం చేసిన తర్వాత మరలా నాతో ఉంటాను అని వచ్చేసిన భార్యని నేను తిరస్కరించాను. డివోర్స్ కేసు వేశాను. అందుకు కక్ష సాధింపుగా నాపైన, వృద్ధులైన నా తల్లిదండ్రులపై కూడా తప్పుడు డీ.వీ.సీ – 498– ఎ (గృహ హింస) కింద కేసులు వేసింది. అందులో భాగంగా మెయింటెన్స్ కూడా వేసింది.. మా మీద సమాజంలో లేనిపోని ప్రచారాలు చేసి మమ్మల్ని క్షోభకు గురిచేయడమేగాక హైదరాబాద్ లో మా నాన్నగారు స్వార్జితంతో సంపాదించిన ఇంట్లో అద్దెకు ఉంటున్నవారిని బలవంతంగా ఖాళీ చేయించి తాను దౌర్జన్యంగా ఆ ఇంట్లో ఉంటోంది. 7 సంవత్సరాల తర్వాత తను వేసిన కేసులు అన్నీ తప్పు అని కోర్టు కేసులు కొట్టివేసింది. డివోర్స్ వచ్చేసింది. పూర్తి జడ్జిమెంటు రావాల్సి ఉంది. నాకు జరిగిన అన్యాయానికి, మా మీద వేసిన తప్పుడు కేసులకు గాను నేను – నా తల్లిదండ్రులు పరువు నష్టం దావా వేయవచ్చా? మా నాన్నగారి ఇంట్లోనుంచి తనను ఎలా పంపించాలి?
– రాజగోపాల్, సూర్యాపేట
భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 498 ఎ (85 బిఎన్) వివాహిత మహిళపై గృహహింసకు పాల్పడిన భర్త, అతని కుటుంబ సభ్యులపై కఠినచర్యలు తీసుకునే ఉద్దేశంతో రూపొందించిన చట్టం. కానీ చాలామంది మహిళలు తమ వ్యక్తిగత కక్ష సాధింపులో భాగంగా ఈ చట్టాన్ని దుర్వినియోగపరుస్తున్నారని అనేక సందర్భాలలో పలు హైకోర్టులతో సహా సుప్రీంకోర్టు సైతం పేర్కొంది. అందుకని ఇలాంటి కేసులలో సాధారణంగా అరెస్ట్ కూడా చేయడానికి వీలులేదు అని ఎన్నో నిబంధనలను సుప్రీంకోర్టు సూచించింది.
వివాహ బంధాన్ని అంతం చేయాలి అనుకున్నప్పుడు స్త్రీలకు తగిన భరణం ఇవ్వకపోవడం, వారి హక్కులను గౌరవించకపోవడం వలన తప్పని పరిస్థితులలో చాలామంది స్త్రీలు రాజీ కుదుర్చుకోవడానికి (సెటిల్మెంట్) ఒక సాధనంగా ఈ చట్టాన్ని ఉపయోగించుకోవడం చాలా కేసులలో గమనిస్తున్నాము.
మీ కేసులో జడ్జిమెంట్ ఇంకా రాలేదని అన్నారు. జడ్జిమెంట్ రాకుండా కేవలం కేసు కొట్టేశారు కాబట్టి ఇది తప్పుడు కేసు అని అనుకోవడానికి వీలులేదు. సరైన సాక్ష్యాధారాలు లేనందువల్ల కేసు కొట్టేసి ఉంటే పరువు నష్టం వేయడానికి కుదరక పోవచ్చు. కానీ మీ భార్య ఉద్దేశపూర్వకంగా మీ మీద తప్పుడు కేసులు, అభియోగాలు మోపిందనే వ్యాఖ్యలు జడ్జిమెంట్‌లో ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా దావా వేయవచ్చు. ఇందుకు వీలుందా లేదా అనే విషయాన్ని జడ్జిమెంట్ వచ్చిన తర్వాత న్యాయనిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోండి.
మరో విషయం... మీ తండ్రిగారు సంపాదించిన ఇంటిలో మీ భార్య ఉండడానికి వీల్లేదు. అయితే డి.వి.సి చట్టం కింద తనకు గృహ వసతి (రెసిడెన్స్ ఆర్డర్స్) ఏమైనా ఉంటే మాత్రం మీ భార్య అలాంటి ఆర్డర్ అమలులో ఉన్నంతవరకు అక్కడ ఉండవచ్చు. అయితే మీ తల్లిదండ్రులు ఒకవేళ ‘తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల నిర్వహణ, సంక్షేమ చట్టం, 2007’ కింద కేసు వేసి తమ ఇంటిని తిరిగి కోరితే మీ మాజీ భార్యని బయటికి పంపవచ్చు.
అయితే మీరు తనకి ప్రత్యామ్నాయ వసతి కల్పించాల్సిందిగా కోర్టు మిమ్మల్ని ఆదేశించవచ్చు. ఏది ఏమైనా మీకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించాలి అంటే మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోవచ్చు. ఒకవేళ ఆమె మీ మీద మోపిన అభియోగాలలో కొంచెం నిజం వున్నా, మీరు కూడా కక్ష సాధింపులకి దిగటం అంత సమంజసం కాదేమో ఆలోచించుకోండి.
– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది
(మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు. )
(చదవండి: ఎప్పటికీ 'రియల్ హీరో'..! 61 ఏళ్ల వయసులో చలాకీగా పుష్ అప్‌లు..)


