దివికేగిన లలిత గానం; కుమారి లలిత 

Lalitha Of Hyderabad Sisters, Dies At Age Of 70 - Sakshi

జంటకవుల సాహిత్యం, సంగీతం చెవికి వినసొంపుగా ఉంటాయి. తిరుపతి వేంకటకవుల జంట అవధానం గురించి తెలిసిందే. లలిత, హరిప్రియల జంట కూడా అదేవిధంగా సంగీత ప్రియులను అలరించింది. నిజానికి వీరు కన్నడ దేశస్థులు. కాని హైదరాబాద్‌లోనే పుట్టి పెరగటం వల్ల, హైదరాబాద్‌ సిస్టర్స్‌గా పేరు సంపాదించుకున్నారు. కుమారి లలిత, శ్రీమతి హరిప్రియ.. ఈ జంటలో కుమారి లలిత హైదరాబాద్‌లోని స్వగృహంలో మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆమెకు అక్షర నివాళిగా...

హైదరాబాద్‌ సిస్టర్స్‌ పేరిట తమ అమృత గానంతో సంగీత ప్రపంచాన్ని ఓలలాడించారు లలిత, హరిప్రియ. సోదరీమణులు జంటగా గానం చేయటం అందరినీ ఆకర్షించింది. లలిత అక్టోబర్‌ 6, 1950 లో బి. సరోజ, బి. శివచంద్ర దంపతులకు జన్మించారు. తల్లిగారి దగ్గరే సంగీత శిక్షణ ప్రారంభించి, ఆ తరవాత టి. జి పద్మనాభన్‌ దగ్గర సంగీత శిక్షణ అందుకున్నారు. తొమ్మిదో ఏట హైదరాబాద్‌ నల్లకుంటలోని శంకరమఠంలో మొట్టమొదటి సంగీత కచేరీ చేశారు. వీరు అలత్తూరు సోదరుల సంగీత కచేరీలు విని ప్రభావితులయ్యారు. 

వీరికి సంగీత జ్ఞానం కంటె, సంగీతం విలువలు నేర్పారు గురువుగారు. ‘‘మా గురువు గారైన టి. జి. పద్మనాభన్‌ వల్ల మాకు సంగీతం మీద శ్రద్ధ కలిగింది. సంగీతాన్ని స్వయంగా అధ్యయనం చేయటం అలవాటు చేసుకున్నాం. ప్రతి కచేరీనీ మేం చాలెంజింగ్‌గా తీసుకుని, శిక్షణ తీసుకునేవాళ్లం’’ అనేవారు ఈ సోదరీమణులు. ఎన్‌. ఎస్‌. శ్రీనివాసన్‌ అనే ఫ్లూట్‌ విద్వాంసులు వీరిరువురికీ అపురూపమైన, అరుదైన త్యాగరాజ కీర్తనలు, తమిళ సంప్రదాయ కీర్తనలు నేర్పారు. వీటిని వీరు తమిళనాడులో పాడి వారి ప్రశంసలు అందుకున్నారు. రాగాలాపన, స్వరకల్పనలలో వారికి వారే సాటి అనిపించుకున్నారు. 

తమిళనాడులోని కృష్ణగానసభలో ప్రతి సంవత్సరం వీరి కచేరీ తప్పనిసరిగా ఉండేది. తమిళనాట తెలుగువారు అవార్డులు అందుకోవటం అందనిద్రాక్షగానే చెప్పుకుంటారు. అయితే ఈ సోదరీమణులు తమ అమృతగానంతో కృష్ణగాన సభ వారి ‘సంగీత చూడామణి’ బిరుదు అందుకున్నారు. లలిత, హరిప్రియ జంటకు కాంభోజి, ఖరహరప్రియ రాగాలంటే ఇష్టం. ఆ రాగాలలో ఎంతోసేపు స్వరప్రస్తారం చేసేవారు. కీర్తనను నేర్చుకున్నది నేర్చుకున్నట్లుగా ఇంపుగా పాడేవారు. వీరికి సంగీత జ్ఞానం సహజంగానే అలవడింది. వీరి కుటుంబంలోని ఎనిమిదిమంది సంతానమూ సంగీతజ్ఞులే. లలిత, హరిప్రియ సోదరీమణులకు సంగీతం అలవోకగా, అప్రయత్నంగానే అలవడింది. కచేరీలకే జీవితం అంకితం చేశారు. ఎంతోమంది శిష్యుల్ని తయారుచేశారు. శ్రద్ధ ఉన్నవారిని ఇంటికి పిలిపించి, దగ్గరుండి తర్ఫీదు ఇచ్చేవారు. ఇటువంటి వారు సంగీత ప్రపంచంలో చాలా అరుదు. 

పిట్స్‌బర్గ్‌ వెంకటేశ్వర దేవాలయంలో రెండు సంవత్సరాలు టీచింగ్‌ కాంట్రాక్ట్‌లో పాఠాలు చెప్పారు. హిందుస్థానీ సంగీతం పట్ల వీరికి అవగాహన ఉండటం వల్ల, కచేరీలు మరింత రక్తి కట్టేవి. ఈ  సోదరీమణులు తెలుగు రాష్ట్రాల నుంచి పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలలో కచేరీలు చేసి, అందరి ప్రశంసలు అందుకోవటమే కాదు, ఇలా జంటగా పాడిన మొట్టమొదటి సోదరీమణులు కూడా వీరే. కుమారి లలిత తన జీవితాన్ని సంగీతానికే అంకితం చేశారు. రామ్‌ కోఠీ సంగీత కళాశాలలో సంగీత అధ్యాపకురాలిగా పనిచేశారు. సహృదయులు. మృదుభాషి. పేరుకు తగ్గట్టే లలితంగా మాట్లాడేవారు. రెండు రోజుల క్రితం కూడా యూ ట్యూబ్‌ లో ప్రత్యక్ష కచేరీ చేశారు. 

‘‘వ్యక్తిగతంగా లలిత చాలా సౌమ్యురాలు. కళాకారుల్లో ఇంతమంచి లక్షణాలు ఉండటం చాలా అరుదు. స్నేహశీలి. వయసులో పెద్దవారి ని ఎంత గౌరవంగా చూసేవారో, చిన్నవారిని కూడా అంతే గౌరవంగా చూసేవారు. వారి వయసుకి కాకుండా, వారిలోని సరస్వతికి ప్రణమిల్లేవారు’’ అంటారు ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు మోదుమూడి సుధాకర్‌. ‘‘వీరు ఎంతోమందికి ఆదర్శం. నేను, మా అన్నయ్య మల్లాది శ్రీరామ్‌ ప్రసాద్‌ ఇద్దరం జంటగా పాడుతున్నామంటే అందుకు వీరే ఆదర్శం’’ అంటున్నారు మల్లాది సోదరులలో ఒకరైన మల్లాది రవి కుమార్‌. – డా. వైజయంతి పురాణపండ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top