Kerala: 14 జిల్లాల్లో పదింటికి మహిళా కలెక్టర్లే.. ఆమె డాక్టర్‌, నటి, సింగర్‌ కూడా!

Kerala: Women Collectors For 10 Districts Out Of 14 Intresting Facts - Sakshi

కేరళ కలెక్టరమ్మలు 

మహిళ చదువు దేశానికి వెలుగు ఎలా అవుతుందో చూడాలనుకుంటే ఓసారి కేరళవైపు దృష్టి సారించాల్సిందే. భూతల స్వర్గంగా పేరున్న కేరళ రాష్ట్రంలో 14 జిల్లాలు ఉన్నాయి. వీటిలో 10 జిల్లాల కలెక్టర్లు మహిళలే కావడం గమనార్హం. రాజకీయాలు, రక్షణ, అనేక ఇతర కీలకరంగాలలో పురుషులతో పోలిస్తే మహిళా ప్రాతినిధ్యం తక్కువ ఉన్న ఈ దేశంలో ఇది అరుదైన ఘనతగా అంతా పేర్కొంటున్నారు. 

ప్రజాసేవ చేయడానికి పరిపాలనలో భాగంగా ఉన్నతాధికారులలో మెజారిటీ సంఖ్య ఇప్పటివరకు పురుషులదే. కానీ, కేరళలో మాత్రం ఆ సంఖ్య మహిళలదయ్యింది. డాక్టర్‌ రేణు రాజ్‌ అలప్పుళ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టబోతుండటంతో కేరళలో ఇప్పుడీ మహిళా కలెక్టర్ల సంఖ్య పదికి చేరింది. 

మూడింట రెండొంతులు
రాష్ట్ర పరిపాలనలో దాదాపు మూడింట రెండొంతుల మంది మహిళలే నాయకత్వం వహిస్తున్నారు. రాష్ట్ర అసెంబ్లీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఉండగా, ఇప్పుడు కేరళలో పరిపాలనా సేవల్లో మహిళా కలెక్టర్లు 71.4 శాతం ఉన్నారు.

కేరళలోని ఇతర జిల్లా మహిళా కలెక్టర్లలో హరిత.వి.కుమార్‌ (త్రిసూర్‌), దివ్య ఎస్‌ అయ్యర్‌ (పథనం తిట్ట), అఫ్సానా పర్వీన్‌ (కొల్లం), షీబా జార్జ్‌ (ఇడుక్కి), డాక్టర్‌ పికె జయశ్రీ (కొట్టాయం), భండారి స్వాగత్‌ రణవీర్‌ చంద్‌ (కాసర్‌ గోడ్‌), నవజోత్‌ ఖోసా (తిరువనంతపురం), మృణ్మయీ జోషి (పాలక్కాడ్‌), డాక్టర్‌ ఎ.గీత (వాయనాడ్‌)లు ఉన్నారు.

వీరిలో రేణురాజ్, దివ్య.ఎస్‌.అయ్యర్, హరిత వి.కుమార్, పి.కె.జయశ్రీ, షీబా జార్జ్, గీత కేరళ వాసులే. 35 ఏళ్ల డాక్టర్‌ రేణురాజ్‌ మార్చి 2న అలప్పుళ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. వృత్తిరీత్యా రేణు వైద్యురాలు. 2015లో యుపిఎస్‌సి పరీక్షలో మొదటి ప్రయత్నంలోనే రెండవ ర్యాంక్‌ సాధించారు. జిల్లా కలెక్టర్‌గా ఆమెకు ఇదే తొలి పోస్టింగ్‌. 

భిన్నరంగాలలోనూ ప్రతిభ
గృహిణిగా కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ కలెక్టర్‌గా విధులను చేపట్టిన ఈ కలెక్టరమ్మల్లో వివధ రంగాల్లో ప్రతిభను కనబరుస్తున్న వారున్నారు. వారిలో పథానంతిట్ట జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ దివ్యా ఎస్‌ అయ్యర్‌ ఒకరు. డాక్టర్, ఎడిటర్, రైటర్, యాక్టర్, సింగర్‌గా కూడా దివ్య పేరొందారు. మలయాళీ వెండితెర మీద క్రిస్మస్‌ ప్రధాన అంశం గల సినిమాలోనూ నటించారు.

గతంలో మహాత్మాగాంధీ నేషనల్‌ రూరల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ గ్యారంటీ స్కీమ్‌లో డాక్టర్‌గా విధులను నిర్వర్తించారు. ఆ తర్వాతి జాబితాలో త్రిసూర్‌ జిల్లా కలెక్టర్‌ హరిత వి.కుమార్‌ చేరుతారు. 2012లో కేరళలో సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌లో టాపర్‌గా నిలిచారీమె. ఎలక్ట్రానిక్స్‌ విభాగం లో ఇంజినీరింగ్‌ డిగ్రీ చేసిన హరిత ‘విజయం అనేది ఒక వస్తువు కాదు, ఒక రోజు కష్టంలో రాదు’ అంటారు.

మలయాలీ సినిమాలంటే ఇష్టపడే హరిత మోహినీయాట్టం, భరతనాట్యం, కర్ణాటక సంగతంలోనూ ప్రావీణ్యురాలు. పాలక్కాడ్‌ జిల్లా కలెక్టర్‌ మృణ్మయి జోషి కలెక్టర్‌ అవడానికి ముందు ఫ్రీ లాన్స్‌ జర్నలిస్ట్‌. పుణేవాసి. ముంబయ్‌ హై కోర్టు మాజీ జడ్జి షాలినీ ఫన్సల్కర్‌ జోషి కూతురు. తల్లి లాగే న్యాయవాద చదువును పూర్తి చేశారు. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ నుంచి పబ్లిక్‌ పాలిసీలో మాస్టర్స్‌ చేశారు.

తిరువనంతపురం జిల్లా కలెక్టర్‌ నవ్‌జోత్‌ ఖోసా అమృతసర్‌ గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజీ నుంచి బీడీఎస్‌ చేశారు. యూనివర్శిటీ టాపర్, గోల్డ్‌ మెడలిస్ట్‌. ‘ఐఎఎస్‌ ముందు నా తండ్రి కల. అదే నా లక్ష్యం అయ్యింది’ అంటారీమె. రాష్ట్ర పరిపాలన విభాగంలో ఉన్నతాధికారులుగానే కాదు 2020 కేరళ స్థానిక ఎన్నికల్లో మహిళలు 50 శాతానికి పైగా సీట్లను కైవసం చేసుకుని విజయం సాధించారు. పితృస్వామ్య సమాజంలో ఇది అంత తక్కువ విషయమేమీ కాదు. దేశ మహిళలందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.  

చదవండి: Mystery- Lansa Flight 508: 10 వేల అడుగుల పైనుంచి ఆమె కూర్చున్న కుర్చీ కిందపడింది.. చుట్టూ విషసర్పాలు.. అయినా

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top