Anusha Shetty: లక్షల జీతం వచ్చే ఐటీ ఉద్యోగాలు వదిలేసి.. భార్యాభర్తలిద్దరూ..

Karnataka: Anusha Shetty Left IT Job For Dance Social Media Influencer - Sakshi

డ్యాన్స్‌ కోసం డ్యాన్స్‌

సాధారణంగా చాలామంది కెరీర్‌లో ఎదిగేందుకు చేస్తోన్న ఉద్యోగాన్ని వదిలేసి...  స్టార్టప్‌ పెట్టడమో, ట్రెండ్‌కు తగ్గట్టుగా సేంద్రియ వ్యవసాయాన్ని ఎంచుకోవడం వంటిదో చేస్తుంటారు. అయితే కర్ణాటకకు చెందిన అనుషాశెట్టి మాత్రం వీటన్నింటికి భిన్నం. తనకు నచ్చిన డ్యాన్స్‌ కోసం బంగారంలాంటి ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేసి, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా రాణిస్తూ యువతరానికి ప్రేరణగా నిలుస్తోంది. 

ఉడిపి జిల్లాలోని కుందాపూర్‌ అనే చిన్న గ్రామంలో ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది అనుషాశెట్టి. అనుష తల్లి ప్రభుత్వ ఉద్యోగి, తండ్రి వ్యాపార రీత్యా బెంగళూరులో ఉండేవారు. తల్లి ఉద్యోగం గ్రామంలో కావడంతో అనుష అమ్మ దగ్గర ఉంటూ చక్కగా చదువుకునేది. చిన్నప్పటినుంచి ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్‌లోనూ, క్రీడల్లోనూ చాలా చురుకుగా ఉండేది. దీంతో తల్లిదండ్రులు ఆమెను ప్రోత్సహిస్తుండేవారు.

ఇంటర్మీడియట్‌ అయ్యాక సెట్‌ ఎంట్రన్స్‌ పరీక్షలో మంచి ర్యాంక్‌ రావడంతో బెంగళూరులోనే టాప్‌–2 కాలేజీలో ఇంజినీరింగ్‌ సీటు వచ్చింది. దురదృష్టవశాత్తూ తండ్రికి వ్యాపారంలో నష్టాలు రావడంతో ఆమెను చదివించలేక గ్రామానికి దగ్గరల్లోని కాలేజీలో చేరమన్నారు. అయినా అనుష ఏ మాత్రం వెనక్కు తగ్గకుండా ధైర్యంగా ముందుకు సాగింది. కష్టపడి చదివి ఇంజినీరింగ్‌ పూర్తి చేసి, క్యాంపస్‌ సెలక్షన్స్‌లో మంచి ఐటీ ఉద్యోగాన్ని సంపాదించింది. 

ఉద్యోగం వదిలేసి..
కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ తన ప్రతిభాపాటవాలతో ఐటీ ఉద్యోగిగా ఎదిగిన అనుషకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్‌ అంటే ఎంతో మక్కువ. టీవీ, స్టేజిషోల మీద జరిగే డ్యాన్స్‌ కార్యక్రమాన్ని చూసి డ్యాన్స్‌ నేర్చుకునేది. డ్యాన్స్‌పై ఉన్న ఆసక్తి రోజురోజుకి పెరగడంతో డ్యాన్స్‌ సాధన మరింతగా చేయాలనుకున్నప్పటికీ, ఉద్యోగరీత్యా డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ చేసే తీరిక ఉండేది కాదు.

మరోపక్క కుటుంబ అవసరాలకు ఆర్థికంగా అండగా ఉండాల్సిన పరిస్థితి. దీంతో కొన్నిరోజులు డ్యాన్స్‌ను పక్కన పెట్టింది. 2015లో ఓ ప్రోగ్రామ్‌లో సౌరభ్‌ పరిచయమయ్యాడు. సౌరభ్‌ ఐటీ ఉద్యోగిగా పనిచేస్తూనే డ్యాన్స్‌ టీచర్‌గా చేసేవాడు. అభిరుచులు ఒకటే కావడంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి, పెళ్లితో ఒకటయ్యారు. తర్వాత ఇద్దరూ కలిసి 2020లో ‘జోడీ అనురాభ్‌’ పేరుతో యూట్యూబ్‌ చానల్‌ను ప్రారంభించారు.

వారాంతాల్లో ఇద్దరూ వివిధ రకాల డ్యాన్స్‌ చేసి, వీడియోలను పోస్టు చేసేవారు. వీటికి వీక్షకుల నుంచి మంచి స్పందన లభించేది. ఇలా కొంతకాలంపాటు చేశాక ఇద్దరూ తమ తమ ఉద్యోగాలను వదిలేసి పూర్తి సమయాన్ని డ్యాన్స్‌కు కేటాయించారు. వీరి నిర్ణయాన్ని కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు.

అయినా వెనక్కి తగ్గలేదు. తమ నిర్ణయానికి కట్టుబడి డ్యాన్స్‌ వీడియోలు పోస్టు చేస్తూ నాలుగు లక్షలమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. రకరకాల డ్యాన్స్‌ స్టెప్పులతో లక్షల వ్యూస్, అభిమానులతో ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా రాణిస్తున్నారు. లక్షల జీతం లేకపోయినప్పటికీ తమను అభిమానించే వారు లక్షల్లో ఉన్నారని ఈ జోడీ తెగ సంతోష పడిపోతోంది.  

చదవండి: Paranoia: రోజూ రాగానే ఇల్లంతా వెతకడం.. వాడిని ఎక్కడ దాచావ్‌ అంటూ భార్యను తిట్టడం! ఈ పెనుభూతం వల్ల..

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top