Jaipur Literature Festival 2023: స్త్రీలు– పని: నా డబ్బులు తీసుకో అనొద్దు

Jaipur Literature Festival 2023: Feature Women Of Substance And Their Exemplary Work - Sakshi

‘ఉద్యోగం ఎందుకు చేయాలనుకుంటున్నావు?’ ‘ఇప్పుడు ఏం అవసరం వచ్చింది?’ ‘డబ్బులు కావాలా?’ ఈ ప్రశ్నలు స్త్రీలను పురుషులు అడుగుతారు. ‘డబ్బులు కావాలంటే నా డబ్బులు తీసుకో’ అని భార్యతో భర్త, కూతురితో తండ్రి, తల్లితో కొడుకు, చెల్లితో అన్న అంటారు. ‘నేను సంపాదించుకున్న నా డబ్బులు నాకు కావాలి’ అని స్త్రీలు చెప్తే వీరు తెల్లముఖం వేస్తారు.

స్త్రీల ఇంటి పని (కేర్‌ వర్క్‌)కి విలువ ఇవ్వక, స్త్రీలు బయట పని చేస్తామంటే పట్టించుకోక పోవడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా స్త్రీ, పురుషుల మధ్య ఆర్థిక తారతమ్యాలు తొలగడానికి ఐక్యరాజ్య సమితి అధ్యయనం ప్రకారం 120 ఏళ్లు పట్టనుందని శనివారం ‘జైపూర్‌ లిటరేచర్‌ ఫెస్టివల్‌’లో పాల్గొన్న రచయిత్రులు అన్నారు. భవిష్యత్తులో ‘కేర్‌ వర్క్‌’ పెద్ద ఉపాధి రంగం కానుందని తెలిపారు.

‘వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ ఒక అధ్యయనం చేసింది. రాబోయే రోజుల్లో ఎటువంటి పనులు గిరాకీ కోల్పోయి ఎటువంటి పనులు గిరాకీలోకి వచ్చి ఉపాధిని ఏర్పరుస్తాయి అనేదే ఆ అధ్యయనం. అందులో దినదిన ప్రవర్థమానమయ్యే పని రంగంగా సంరక్షణా రంగం (కేర్‌ వర్క్‌) వచ్చింది. ఇంటి సంరక్షణ, పిల్లల సంరక్షణ, వృద్ధుల సంరక్షణ, ఇంటి శుభ్రత, ఇంటి ఆరోగ్యం... ఇవన్నీ కేర్‌ వర్క్‌ కింద వస్తాయి. ఈ కేర్‌ వర్క్‌ తరాలుగా  స్త్రీలు చేస్తున్నారు. అసంఘటిత రంగంలో ఉన్న స్త్రీల చేత లెక్కా జమా లేని అతి తక్కువ వేతనాలకు చేయిస్తున్నారు. ఇంటిలో పని చేసే గృహిణుల కేర్‌ వర్క్‌కు విలువ కట్టడం లేదు.

కేర్‌ వర్క్‌ను ప్రభుత్వ, ప్రయివేటు రంగాలు ఒక ఉపాధి రంగంగా అభివృద్ధి చేస్తే తప్ప కేర్‌ ఎకానమీ స్వరూపం, ఉనికి, ఉపయోగం అర్థం కాదు. మగవాడు ఇంటి బయట జీతానికి చేసే పని ఒక్కటే పని కాదు. ఇంటి లోపల జీతం లేకుండా స్త్రీలు చేసే పని కూడా పనే’ అని జైపూర్‌ లిటరేచర్‌ ఫెస్టివల్‌లో శనివారం జరిగిన ‘విమెన్‌ అండ్‌ వర్క్‌’ అనే సెషన్‌లో పాల్గొన్న రచయిత్రులు అన్నారు. వీరిలో ‘సిస్టర్‌హుడ్‌ ఎకానమి’ పుస్తకం రాసిన శైలి చోప్రా, ఇస్రో మహిళా శాస్త్రవేత్తల మీద ‘దోజ్‌ మేగ్నిఫీషియెంట్‌ విమెన్‌ అండ్‌ దెయిర్‌ ఫ్లయింగ్‌ మెషిన్స్‌’ పుస్తకం రాసిన మిన్ని వైద్, ఐక్యరాజ్యసమితి మాజీ అసిస్టెంట్‌ సెక్రెటరీ జనరల్‌ లక్ష్మి పురి ఉన్నారు.

‘స్త్రీలు ఉండదగ్గ చోటు ఇల్లు అనడమే పెద్ద అవరోధం. అన్ని చోట్లు స్త్రీలు ఉండదగ్గ చోట్లే. కాని ఇంట్లో ఉండటం వల్ల, బిడ్డను కనే శారీరక ధర్మం ఆమెకే ఉండటం వల్ల ప్రేమ, బాధ్యత అనే మాటల్లో ఆమెను పెట్టి ఇంటి పని చేయిస్తున్నారు. అంతులేని ఈ ఇంటి చాకిరికి విలువ ఉంటుందని స్త్రీ ఎప్పుడూ అనుకోదు. విలువ సంగతి అటుంచితే... అంత పని స్త్రీ నెత్తిన ఉండటం గురించి కూడా మాట్లాడరు. గ్లోబల్‌గా చూస్తే పురుషుల కంటే స్త్రీలు 2.9 శాతం ఎక్కువ పని చేస్తున్నారు. భారతదేశంలో ఇది పది శాతమైనా ఉంటుంది. స్త్రీ, పురుషుల శరీర నిర్మాణంలో భేదం ఉంది. కాని ఈ భేదం భేదభావంగా వివక్షగా మారడం ఏ మాత్రం సరి కాదు’ అని లక్ష్మి పురి అన్నారు.

‘స్త్రీలు పని చేస్తామంటే పురుషులు అడ్డంకులు వేస్తూనే ఉంటారు. ఎందుకు పని చేయడమంటే అది స్త్రీల లక్ష్యం కావచ్చు. ఎంపిక కావచ్చు. ఇష్టం కావచ్చు. ఆర్థిక స్వావలంబన కోసం కావచ్చు. నా డబ్బు తీసుకో ఉంది కదా అని భర్త, తండ్రి, కొడుకు అంటూ ఉంటారు. ఎందుకు తీసుకోవాలి. తాము సంపాదించుకున్న డబ్బు కావాలి అనుకోవచ్చు స్త్రీలు. భారతదేశంలో స్త్రీల జనాభా జపాన్‌ దేశపు జనాభాకు ఎనిమిది అంతలు ఉంటుంది. అంతటి జనాభా ఉన్నప్పటికీ మన దేశ స్త్రీల అభిప్రాయాలను, భావాలను పరిగణనలోకి తీసుకోరు. దీనిని ఎలా అర్థం చేసుకోవాలి’ అని శైలి చోప్రా అన్నారు. ‘మగవారి మధ్య బ్రదర్‌హుడ్‌ ఉంటుంది.

స్త్రీల మధ్య సిస్టర్‌హుడ్‌ బలపడితే అన్నింటిని మార్చగలం. అందుకే నా పుస్తకానికి సిస్టర్‌హుడ్‌ ఎకానమీ అని పేరు పెట్టాను’ అన్నారామె. ‘ఇస్రో మహిళా శాస్త్రవేత్తల మీద నేను పుస్తకం రాశాను. వాళ్ల నుంచి విన్న మొదటి మాట మహిళా అనొద్దు... మేమూ శాస్త్రవేత్తలమే... ప్రత్యేకంగా ఎంచడం వల్ల ఏదో ప్రోత్సహిస్తున్న భావన వస్తుంది అంటారు. చాలా బాగుంది. కాని ఇస్రోలో ఇప్పటికీ 16 శాతం మంది మాత్రమే మహిళలు ఉన్నారు. ఇప్పటి వరకు ఇస్రోకు మహిళా శాస్త్రవేత్త డైరెక్టర్‌ కాలేదు. ఎప్పటికి అవుతారో తెలియదు.

మంగళయాన్‌ వంటి మిషన్‌ను స్త్రీలు విజయవంతం చేసినా... నా కుటుంబం సపోర్ట్‌ చేయడం వల్లే చేశాను... నా భర్త సపోర్ట్‌ చేయడం వల్లే చేశాను... వారు చేయనివ్వడం వల్ల చేశాను అని చెప్పుకోవాల్సి వస్తోంది. ‘చేయనివ్వడం’ అనేది స్త్రీల విషయంలోనే జరుగుతుంది. ఎంత చదివినా, ఎంత పెద్ద ఉద్యోగంలో ఉన్నా భర్తో/కుటుంబమో వారిని ‘చేయనివ్వాలి’... ఈ స్థితి మహిళలకు ఎలాంటి మానసిక అవస్థను కలిగిస్తుందో మగవాళ్లకు తెలియదు. ఉద్యోగం చేస్తున్న స్త్రీ తారసపడితే ఆఫీసు, ఇల్లు ఎలా బేలెన్స్‌ చేసుకుంటున్నావు అని అడుగుతారు. మగవాడిని ఎందుకనో ఈ ప్రశ్న అడగరు’ అన్నారు మిన్ని వైద్‌.

‘కుటుంబ పరమైన, సామాజిక వొత్తిళ్ల వల్ల పిల్లలు కనే వయసులోని స్త్రీలు తమ వృత్తి, ఉపాధి నుంచి దూరమయ్యి పని చేయడం మానేస్తున్నారు. వారు తమ కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే పని చేసే, చేయగలిగే వాతావరణం పూర్తి స్థాయి ఏర్పడాలంటే మగవాళ్లు ఇంకా మారాల్సి ఉంది’ అని ఈ వక్తలు అభిప్రాయ పడ్డారు.
 

– జైపూర్‌ నుంచి సాక్షి ప్రతినిధి

మరిన్ని వార్తలు :

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top