
చేతిలో ఐఫోన్, ముంజేతికి రోలెక్స్ వాచ్ ఉన్న వాడు కాదు రిచ్‌కిడ్ అంటే, ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్ట్‌లో బర్గర్ తిన్నవాడే నిజమైన రిచ్‌కిడ్. ఎందుకంటే, ఈ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విమాశ్రయాల్లో ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్ట్ ఒకటి. అక్కడి తినుబండారాల ధరలు ఏకంగా అంతరిక్షాన్నే దాటేస్తున్నాయి. ఒక లాసాగ్నే (ఇటాలియన్ వంటకం) రూ. 2,180.
అదిపెద్ద డిన్నరేం కాదు, ఈ వంటకంలోని చిన్న ముక్క మాత్రమే సర్వ్ చేస్తారంతే! ఇక చిన్న బర్గర్ ధర అయితే రూ. 2,245, నాలుగు చికెన్ వింగ్ ఫ్రైస్ రూ.1,560. బయట దొరికే బీరు బాటిల్ రూ.రెండువందలైతే, ఇక్కడ బీరు ధర రూ. 1,915. అది కూడా పూర్తిగా బాటిల్ ఇవ్వరు, కేవలం వంద మిల్లీలీటర్లే! వీటి ధరలన్నీ తెలిసి తలనొప్పి వస్తుందని ఒక కప్పు కాఫీ అడిగారో మరో రూ. 700 ఖర్చు చేయాలి.
అదీ తెలిసి, బీపీ పెరిగిందని కనీసం అరటిపండు కొనాలనుకుంటే రూ.535 ఖర్చు చేయాలి. చివరికి మంచినీళ్లు అయినా తాగి గొంతు తడుపుకుందాం అనుకుంటే లీటరు వాటర్ బాటిల్ రూ. 300. ఏదేమైతేనేం, బ్యాంకులో పర్సనల్ లోన్ తీసుకొని అయినా, అంత ఖర్చు చేసి, బాగా తిని రిలాక్స్ అయ్యారనుకోండి, మీ బ్యాగ్ జాగ్రత్త!
ఎందుకంటే, ప్రపంచంలోనే చోర భయం ఎక్కువగా ఉండే ఎయిర్‌పోర్టుల్లో ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్టు నంబర్ వన్ అని తాజా అధ్యయనంలో తేలింది. ఈ ఎయిర్ పోర్టులో ఫ్లైట్ కంటే ముందే బ్యాగు, పర్సు రెండూ టేకాఫ్ అయిపోతున్నాయని ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్టు బాధితులు సోషల్ మీడియాలో లబోదిబో మంటున్నారు.
(చదవండి: బలమైన ఎముకలకు బెస్ట్ ఇండియన్ గైడ్ ఇదే..! ఆ నాలుగింటిని మాత్రం..)