Poonam Dhanwatey: పులికి ఫ్రెండు

International Tiger Day: Wildlife activist Poonam Dhanwatey honoured with global award 2022 - Sakshi

నేడు అంతర్జాతీయ పులుల దినోత్సవం

ఆసియాలో ఒకప్పుడు లక్ష పులులు ఉండేవట. ఇప్పుడు నాలుగు వేలు మాత్రమే ఉన్నాయి. అందులో 2000 పులులు మన దేశంలో ఉన్నాయి. వేట, గ్రామీణుల ప్రతీకారం, కరెంటు కంచెలు... ఇవన్నీ పులిని చంపుతున్నాయి. మరి బతికిస్తున్నది? పూనమ్‌ ధన్వతే వంటి వన్యప్రాణి ప్రేమికులు. ప్రభుత్వంతో కలిసి పని చేసే ఇలాంటి వాళ్ల వల్లే పులుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

వివిధ సామాజిక రంగాల్లో పని చేసే మహిళలకు పారిస్‌లో ప్రతిష్ఠాత్మకంగా ఇచ్చే ‘ఈవ్‌ రోచర్‌ ఫౌండేషన్‌’ గ్లోబల్‌ అవార్డ్‌ 2022 సంవత్సరానికి పూనమ్‌ ధన్వతేకు దక్కింది. ఇటీవల ఆమె పారిస్‌లో ఆ అవార్డును అందుకున్నారు. పులులను కాపాడటానికి ఆమె చేసిన సేవకు ఇది ఒక గొప్ప గుర్తింపు. 2001 లో అడవిలో కెమెరాలు బిగించడం ద్వారా పులుల సంఖ్యను తెలుసుకునే విధానాన్ని మొదటగా ప్రవేశపెట్టిన వ్యక్తి పూనమ్‌. ఇప్పుడు ఆ విధానం చాలా చోట్ల అటవీ శాఖ ఉపయోగిస్తున్నది.

500 పులుల కాపలాదారు
ఒకప్పుడు ఇంటీరియర్‌గా పని చేసిన పూనమ్‌ ధన్వతే వన్యప్రాణులు ముఖ్యంగా పులుల పట్ల తనకు ఉన్న ప్రేమ వల్ల ఆ రంగాన్ని వదిలిపెట్టి 2001లో ‘టైగర్‌ రీసెర్చ్‌ అండ్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ టైగర్స్‌’ (ట్రాక్ట్‌) అనే సంస్థను స్థాపించింది. ఈ సంస్థ కింద వన్యప్రాణుల కోసం ‘బోర్న్‌ ఫ్రీ’ అనే పర్యావరణ ఉద్యమాన్ని ఆమె నడుపుతోంది. స్వేచ్ఛగా ఉండాల్సిన వన్యప్రాణులతో మనుషులు కలిసి మెలిసి ఉండేలా చూడటమే ఈ ఉద్యమం లక్ష్యం. మన దేశంలో ఉన్న దాదాపు 2000 పులులలో 500 పులులు మధ్య భారతంలో (మహరాష్ట్ర– మధ్యప్రదేశ్‌ సరిహద్దులు) ఉన్న పంచ్, తాడోబా, సాత్పురా టైగర్‌ రిజర్వ్‌లలో ఉన్నాయి. ఈ టైగర్‌ రిజర్వ్‌లను కాపాడే ప్రభుత్వ అటవీ శాఖతో పాటు కలిసి పని చేస్తూ ప్రజలకు అటవీ శాఖకు మధ్య వారధిగా ఉంటూ పులులకు మనుషులకు మధ్య సయోధ్య కుదిర్చే జటిలమైన పనిని గత రెండు దశాబ్దాలుగా తన భర్త హర్షవర్థన్‌తో కలిసి చేస్తోంది. తాడోబా టైగర్‌ రిజర్వ్‌ ప్రాంతంలో  ఇల్లు కట్టుకుని అక్కడే ఉండిపోయిన పూనమ్‌ పులులకే తన జీవితం అంకితం అంటుంది.

పులుల మీద పుట్ర
‘అడవి పచ్చగా ఉంటే ఎరలు తిరుగాడుతాయి. పులి నోటికి ఎర చిక్కితే దానికి ఎటువంటి ప్రమాదం ఉండదు. ఎర దొరక్కపోతేనే అది ఆకలితో ఊళ్ల సమీపానికి వస్తుంది. గ్రామస్తులు దానిని కొట్టి చంపుతారు’ అంటుంది పూనమ్‌ ధన్వతే. అడవుల్లో కుంటలు నీటితో ఉండేలా, గ్రామస్తులు వంట చెరుకు కోసం చెట్లు కొట్టకుండా, వేట జరక్కుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పూనమ్‌ పని మొదలయ్యింది. టైగర్‌ రిజర్వ్‌లలో పులి ఉంటే పర్యాటకం అభివృద్ధి చెందుతుందని, దానివల్ల ఆదాయం వచ్చి ఆ ప్రాంతానికి మేలు జరుగుతుందని ఆమె గ్రామస్తులకు నేరుగా చూపించింది.

స్థానికులను భాగస్తులను చేసి
కెన్యాలో అభయారణ్యాలు స్థానికుల భాగస్వామ్యం వల్ల సురక్షితంగా ఉన్నాయని నిపుణులు అంటారు. అదే మోడల్‌ను పూనమ్‌ ధన్వతే తాడోబా, సాత్పురా టైగర్‌ రిజర్వ్‌లలో ప్రవేశపెట్టింది. అటవీ శాఖ కింద పని చేస్తున్న 500 మంది సిబ్బందితో పాటు రిజర్వ్‌ అంచున ఉన్న పల్లెల్లో స్త్రీ, పురుషులను ‘టైగర్‌ అంబాసిడర్లు’గా ఎంపిక చేసి వారిలో చైతన్యం కలిగించింది. 1300 మంది యువత 195 గ్రామాల నుంచి ధన్వతే కింద పులుల కోసం పని చేస్తున్నారు. ‘వీరంతా ప్రతి రోజూ అడవిలోకి వెళతారు. నేల మీద పులి, చిరుతపులి, ఎలుగుబంటి, అడవి కుక్కల పాద ముద్రలను గుర్తిస్తారు. అవి పల్లెలవైపు వచ్చేలా ఉంటే గ్రామస్తులను అలెర్ట్‌ చేస్తారు. పులి వల్ల గ్రామస్తులకు నష్టం... గ్రామస్తుల వల్ల పులికి నష్టం రాకుండా చూస్తారు’ అంటుంది పూనమ్‌.

అందుతున్న ఫలాలు
తాడోబా, సాత్పురా టైగర్‌ రిజర్వ్‌లు టూరిస్ట్‌ అట్రాక్షన్‌లుగా మారాయి. దాని వల్ల ఆ రిజర్వ్‌లకు ఆదాయం పెరిగింది. ఆ ఆదాయం పల్లెలకే దక్కేటట్టుగా ప్రభుత్వంతో కలిసి సోలార్‌ దీపాలు, టాయిలెట్లు కట్టించింది. ప్రతి ఇంటికి సబ్సిడీలో గ్యాస్‌ కనెక్షన్లు ఇప్పించింది. దాంతో గ్రామస్తులు చాలా మటుకు సంతోషంగా ఉన్నారు. వారికి పులి ఉంటేనే జీవనం అని అర్థమైంది. అయితే పులులు మనుషుల్ని చంపడం జరుగుతూనే ఉంటుంది. పులి మనిషిని చంపిన చోట పులి విగ్రహం పెట్టి ఆ చనిపోయిన మనిషి కోసం నివాళి అర్పించడం గ్రామస్తులు నేర్చుకున్నారు. ఎంతో ప్రమాదం వస్తే తప్ప పులి జోలికి వెళ్లరు. టైగర్‌ రిజర్వ్‌ చుట్టూ కంచె వేయడం ద్వారా పులులను కాపాడాలని ప్రభుత్వం భావిస్తుంది. ‘కాని మనుషులే కంచెగా మారి పులులను కాపాడాలి. అప్పుడే పులి బతగ్గలుగుతుంది’ అంటుంది పూనమ్‌.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top