
రోగుల పట్ల అంకితభావంతో సేవలందిస్తున్న నర్సులను అపోలో హాస్పిటల్స్ గౌరవించింది. వారి సేవలు ఎంతో విలువైనవని ప్రశంసించింది. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ఆసుపత్రి ప్రాంగణం కృతజ్ఞతాభావంతో నిండిపోయింది. తమ ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్న ఈ వైద్య సిబ్బందికి అపోలో ఆసుపత్రులు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి అభినందనలు తెలిపింది.
ఈ వేడుకల్లో భాగంగా రూపొందించిన ‘కృతజ్ఞతా గోడ’ అందరి దృష్టిని ఆకర్షించింది. సహోద్యోగులు, రోగులు, వారి బంధువులు తమ నర్సింగ్ వీరుల పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ స్వయంగా రాసిన సందేశాలు, వేసిన చిత్రాలు, అతికించిన ఛాయాచిత్రాలతో ఆ గోడ నిండిపోయింది. ఎంతో ఆప్యాయంగా రాసిన ఆ మాటలు చదువుతుంటే నర్సుల కళ్లల్లో ఆనందం కనిపించింది.
వారే వెన్నెముక..
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్ – స్ట్రాటజీ, సిందూరి రెడ్డి మాట్లాడుతూ... “మా నర్సులు ఆరోగ్య వ్యవస్థకు వెన్నెముక వంటివారు. వారి సంక్షేమం మాకు అత్యంత ప్రాధాన్యమైనది. ప్రతి నర్సు భద్రమైన, ప్రోత్సాహకరమైన వాతావరణంలో ఎదగాలని, ప్రతి రోగికి అత్యుత్తమమైన వైద్యం అందాలని కోరుకుంటున్నాం.
‘ది పింక్ బుక్’ మా నర్సింగ్ సిబ్బంది కోసం సురక్షితమైన, సహాయక వాతావరణాన్ని అందించాలనే మా నిబద్ధతకు చిహ్నం” అని అన్నారు. అపోలో హాస్పిటల్స్ గ్రూప్ డైరెక్టర్ నర్సింగ్, కెప్టెన్ (డాక్టర్) ఉషా బెనర్జీ మాట్లాడుతూ.. “ఈ ఏడాది నినాదం ‘మన నర్సులు. మన భవిష్యత్తు. నర్సులను ఆదుకోవడం ఆర్థిక వ్యవస్థను బలపరుస్తుంది’. నర్సులు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు గుండె వంటివారు. వారి ఆరోగ్యం మాకు చాలా ముఖ్యం. వారి అసాధారణమైన కృషికి ఇవాళ గుర్తు చేసుకుంటున్నాం. వారికి నిరంతరంగా మద్దతునిస్తాం” అని అన్నారు.
వైద్యం మాత్రమే కాదు..
అపోలో హాస్పిటల్స్ తెలంగాణ రీజియన్ నర్సింగ్ డైరెక్టర్ సునీత డొమింగో మాట్లాడుతూ... "ఇవాళ మా నర్సుల గురించి చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ఇక్కడి వాతావరణం ఎంతో ఉత్సాహంగా ఉంది. నర్సులు నిత్యం రోగుల కోసం తమ శక్తి మేరకు కృషి చేస్తూనే ఉంటారు. వారి పనిని మనం తప్పకుండా గౌరవించాలి. పాటలు, నృత్యాలు, మంచి మాటలు - ఇవన్నీ మనం చేస్తున్న పని యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నాయి.
వారి సేవలను గుర్తించి, వారిని గౌరవించడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. నర్సులు అందిస్తున్న సేవ కేవలం వైద్యం మాత్రమే కాదు, మనమందరం కలిసి పనిచేయడానికి వారి సహకారం ఎంతో అవసరం అని మరోసారి గుర్తు చేసుకుంటున్నాం" అని పేర్కొన్నారు. నర్సుల దినోత్సవం సందర్భంగా అపోలో హాస్పిటల్స్ హైదరాబాద్ ప్రాంగణంలో, సిబ్బంది నివాస సముదాయాలలో సాంస్కృతిక కార్యక్రమాలు, వేడుక విందులు ఏర్పాటు చేశారు. నర్సులు స్వయంగా సంప్రదాయ నృత్యాలు, సంగీత ప్రదర్శనలు, చిన్న నాటకాలు ప్రదర్శించారు.
(చదవండి: Miss World 2025: సర్వాంగ సుందరంగా రామప్ప ఆలయం..)