Interior Decor: చేటలో ప్లాంట్‌.. బాల్కనీకి పల్లె సొగసు.. వెదురు అందం!

Interior Decor: Bamboo Baskets On Wall Beautiful Look DIY - Sakshi

సహజంగా దొరికేవన్నీ ఆరోగ్యాన్ని, అందాన్ని ఇనుమడింపజేసేవే.. ఒంటికైనా.. ఇంటికైనా!  ఆ జాబితాలోనిదే వెదురు కూడా. ఇప్పుడు గృహాలంకరణలో భాగమై ఇంటి అందాన్ని పెంచుతోంది. ఎలాగో చూద్దాం.. 

బాల్కనీకి పల్లె సొగసు
ఆత్మీయులు.. సన్నిహితులు ఎవరైనా ఈ వేసవి సీజన్‌లో మామిడి పండ్లనో.. లేక ఈ కాలంలో దొరికే ఇంకే పళ్లనో వెదురు బుట్టలో పెట్టి కానుకగా పంపింస్తుంటారు కదా! ఖాళీ అయిన ఆ బుట్టను మూలన పడేయకుండా ఇలా వాల్‌ డెకార్‌కి వాడుకోవచ్చు. బాల్కనీలోకి పల్లె ఇంటి ఆవరణను తీసుకురావచ్చు. 

చేటలో ప్లాంట్‌ 
ప్లాస్టిక్‌ చేటలతో గడిపేస్తున్న కాలం ఇది. వెదురుతో అల్లిన చేట నిరుపయోగంగా కనిపిస్తుంటే ఇదిగో ఇలా ఓ మొక్కతో దాన్ని గోడ మీదకు చేర్చండి. ఆ గోడకు క్లాసీ లుక్‌నే కాదు.. ఇంటికొచ్చే అతిథులకూ మీ రిచ్‌ టేస్ట్‌ను చూపిస్తుంది. 

వేస్ట్‌ బుట్ట బెస్ట్‌
విడిచిన బట్టలు వేయడానికి, ఇంట్లో చెత్తను గుమ్మరించడానికి ప్లాస్టిక్‌ బాస్కెట్‌లనే ఎక్కువగా ఉపయోగిస్తున్న ఉన్నాం. అవి విరిగినా, రంగు వెలసినా స్క్రాప్‌ షాప్‌కి వెళ్లిపోతుంటాయి. అలా వేస్ట్‌ అనుకున్న ప్లాస్టిక్, ఐరన్‌ బాస్కెట్‌లను నార తాడుతో చుట్టి, లేదా గ్లూతో అతికించి అలంకరణ వస్తువుగా మార్చేసుకోవచ్చు.

వీటిలో ఇండోర్‌ప్లాంట్స్‌ పెడితే నిండే పచ్చదనం.. ఇంటిని చల్లగా ఆహ్లాదకరంగా ఉంచుతుంది. అంటే వేస్ట్‌ను కూడా బెస్ట్‌గా మార్చి వ్యర్థాలు పెరగకుండా ప్రకృతిని కాపాడవచ్చన్నమాట. 

కాదేదీ అలంకరణకు అనర్హం అన్నట్టుగా ఇలా ఈ వెదురు బుట్టలు, చేటలతో ఇంటికి ప్రకృతిని ఆహ్వానించ వచ్చు.. పచ్చదనాన్ని పదిలం చేసుకోవచ్చు. లేదంటే రంగుల కళతోనూ వెలుగులు నింపచ్చు.  

చదవండి: Miniature Garden: టీ కప్పులో వనాలు పెంచండిలా!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top