మన ఫుడ్‌ అంతా కార్బోహైడ్రేట్స్‌ మయమా? అదే సుగర్‌కి కారణమా? | Sakshi
Sakshi News home page

మన ఫుడ్‌ అంతా కార్బోహైడ్రేట్స్‌ మయమా? అదే సుగర్‌కి కారణమా?

Published Fri, Jan 5 2024 12:10 PM

Is Indian food fill with carbohydrates that only Cause of Diabetes check with dr Srikanth - Sakshi

పెద్ద పెద్ద ఆహార నిపుణులని పిలవబడేవాళ్ళందరూ భారతీయ ఆహారంలో ప్రొటీన్లు లేవు, పిండిపదార్థాలే ఎక్కువ ఇవే మధుమేహానికి కారణం అని ఊదరగొట్టి భయపెడుతుంటారు. అది నిజం కాదు అంటూ ట్విటర్‌ ద్వారా కొన్ని  ఆసక్తికర విషయాలను పంచుకున్నారు  ప్రముఖ వైద్యులు శ్రీకాంత్‌ మిరియాల. ఆ వివరాలు మీకోసం యథాతథంగా .

 డా. శ్రీకాంత మిర్యాల ట్విటర్‌లో షేర్‌ చేసిన వివరాలు 
►ప్రొటీన్లు అనేవి మన శరీర నిర్మాణానికే కాకుండా దేహంలో ఎన్నో జీవక్రియలు చేస్తుంటాయి. ఈ ప్రొటీన్లు ఉన్నపళంగా ఆహారంలోనివి మన ఒంట్లోకి చేరుకోవు, చేరుకున్నా అవి మన ప్రోటీన్లు కావు కాబట్టి దానికి మన దేహం వాటికి ప్రతిచర్య చూపిస్తుందే కానీ వాడుకోవు దాన్ని. 

► ప్రొటీన్లు అనేవి అమైనో ఆమ్లాలతో తయారవుతాయి, ఇవేంటంటే గోడలో ఇటుకల్లా ఒక్కో అమైనో ఆమ్లం ఇంకో దాంతో జతచేరి అలా పొడవైన గొలుసులు ఏర్పడి, అ గొలుసులు మడతపడి గట్టి లేదా మెత్తటి ప్రొటీన్లు తయారవుతాయి. బాక్టీరియా, మొక్కలు, జంతువులు, మనిషి ఎవరైనా ఇదే పద్ధతి. ఇప్పుడు మనం ఈ ప్రోటీన్లని తిన్నప్పుడు మన జీర్ణాశయం వాటిని ముక్కలు చేసి, పేగుల్లో ఆ ప్రోటీన్లు జీర్ణం అయ్యి అమైనో ఆమ్లాలు విడుదలవుతాయి. ఇలా విడుదలైనవాటిని మనశరీరం శోషించుకుని వాడుకుని మనకి కావలసిన ప్రొటీన్లని తయారుచేసుకుంటుంది. 

► మొత్తంగా ఈ అమైనో ఆమ్లాలు ఇరవై ఉంటాయి. వీటిలో తొమ్మిది మాత్రమే ఆవశ్యకమైనవి. అంటే మిగతా 11 మనదేహం తయారుచేసుకుంటుంది. ఆ తొమ్మిది మాత్రం ఆహారంలోంచి తీసుకోవాలి. 

►  భారతీయ ఆహారం చాలా వైవిధ్యమైనది. ఇందులో మనకి కావాల్సిన అన్ని పోషకాలుంటాయి. కాకపోతే అవి తినే మోతాదు సరిచూసుకోవాలి. భారతదేశం ముఖ్యంగా వ్యవసాయాధారిత జనాభా కాబట్టి పనిచేసేందుకు చాలా శక్తి అవసరం అందుకోసం పిండిపదార్థాలు ఎక్కువ తీసుకునేవాళ్లు. ఇప్పుడు దాదాపు 30-40% జనాభా పట్టణాల్లో నగరాల్లో ఉంటున్నారు. వీరి రోజువారీ పనిలో శ్రమ వ్యవసాయమంత ఉండదు కానీ పాత మోతాదులోనే అన్నం, గోధుమలు తినడం వలన శక్తి ఖర్చవక ఊబకాయం వస్తోంది.

► పూర్వం నూనె ఖరీదైంది అందువలన భారతీయ వంటకాల్లో దాని వాడకం తక్కువ, కానీ ఇప్పుడు మెల్లిగా నూనె వాడకం ఎక్కువయ్యి ఉడికించిన కూరల బదులు వేపుళ్లు, అలాగే నూనెలో మునిగితేలి వేయించిన పిండి పదార్థాలు ఎక్కువయ్యాయి. ఐది కూడా ఊబకాయానికి దారి తీస్తోంది.

►  కాబట్టి పాత పద్ధతిలో సమతుల్య ఆహారం తింటూ వ్యాయామం ద్వారా ఎక్కువ శ్రమ చెయ్యగలిగితే భారతీయ ఆహారం, అది యే రాష్ట్రానిదైనా మంచిదే. 

Advertisement
 
Advertisement
 
Advertisement