
‘ఉద్యోగంలో నిలదొక్కుకోవాలి... ఆ తర్వాతే పెళ్లి గురించి ఆలోచించాలి... ‘సొంత ఇల్లు, బ్యాంకు బ్యాలెన్స్.. జీవితంలో స్థిరపడాలి ఆ తర్వాతే పిల్లల గురించి ఆలోచించాలి..’ ఇలా అనుకునేవారి శాతం ఈ రోజుల్లో బాగా పెరిగిపోయింది. వయసు మూడు పదులు దాటుతున్నా పెళ్లి, పిల్లలు అనే దశలను వాయిదా వేస్తూ ఉన్నారు. ఫలితంగా భవిష్యత్తులో పిల్లలు కలగరేమో అనే ఆందోళన కూడా ఉంటోంది. అందుకే, ముంబైలోని నవతరం అమ్మాయిల జీవనశైలి, వారి ఆలోచనా విధానంలో వినూత్న మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎక్కువ మంది యువతులు తమ అండాలను నిల్వ చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్టు ఒక సర్వే వెల్లడించింది. ఇది మారుతున్న సామాజిక ఎంపికలకు అద్దంలాంటిది. భవిష్యత్తులో మాతృత్వాన్ని పొందాలనుకునే మహిళలకు ఇది ఒక ఇన్సూరెన్స్ పాలసీ లాంటిది.
ఇటీవల జరిగిన సర్వేలో పాతికేళ్ల వయసున్న (జెన్‌జెడ్) దాదాపు 18 శాతం మంది యువతులు మారుతున్న జీవనశైలి వైపుగా కదులుతున్నారని, రెండింతల ఆదాయంవైపు మొగ్గుచూపుతూ పిల్లలు వద్దు అనే ఆలోచనలో ఉంటున్నారని తెలియజేసింది. మెరుగైన కెరీర్, వ్యక్తిగత ఉద్దేశాల కోసం వారు పిల్లలను కనకూడదని లేదా మాతృత్వాన్ని వాయిదా వేయాలని ఎంచుకుంటున్నారు.
ఎక్కువ మంది యువతులు విద్య, వృత్తిపరమైన అభివృద్ధిపై దృష్టి పెట్టడానికి పిల్లలను కనడాన్ని వాయిదా వేస్తున్నారు. అయితే వారిని ఎప్పుడూ హెచ్చరించే బయోలాజికల్ క్లాక్ ఒత్తిడి లేకుండా భవిష్యత్తు కోసం సంతానోత్పత్తిని కాపాడుకోవడానికి అండాలను నిల్వ చేసుకోవడం ఒక మార్గంగా కనిపిస్తోంది.
అయితే, సంతానోత్పత్తి ఇండికేటర్స్ గురించి అవగాహన లేకపోవడాన్ని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువగా అMఏ (యాంటీ–ముల్లెరియన్ హార్మోన్), ఇది స్త్రీ అండాశయ నిల్వలను అంచనా వేయడానికి సహాయపడుతుంది. సర్వే చేసిన 50 శాతం కంటే ఎక్కువ మంది మహిళలు, 35 సంవత్సరాల వయస్సు తర్వాత సంతానోత్పత్తి తగ్గుతుందని గ్రహించినప్పటికీ, వారిలో చాలామందికి వారి అండాలను నిల్వ చేసుకునే సమయం, కుటుంబ జీవనాన్ని మొదలపెట్టడానికి సరైన వయస్సు గురించి ఏ మాత్రం అవగాహన ఉండటం లేదని చెబుతున్నారు.
వైద్యులు కూడా అలా కోరుకునేవారికి భవిష్యత్తులో సంతానోత్పత్తి ప్రయోజనాలను అందుకోవచ్చుని సలహా ఇస్తున్నారు. వంధ్యత్వం సమస్య పురుషులు, మహిళలు ఇద్దరినీ బాధపెడుతుంది కాబట్టి, అండాలు నిల్వ చేసుకోవడానికి, సంబంధిత చికిత్సలకు సపోర్ట్ ఇవ్వడానికి కంపెనీలు కూడా ఆసక్తిచూపుతున్నాయి. దీనికి కారణం తమ ఉద్యోగుల ప్రతిభను ఆకర్షించడానికి, వారిని నిలుపుకోవడానికి మద్దతునివ్వడం ఒక కారణంగా ఉంటోంది.
ఈ మార్పు చాలా మెరుగైన పునరుత్పత్తి ఆరోగ్య విద్య అవసరాన్ని వివరిస్తుంది. బహిరంగంగా చర్చలు జరపడం ద్వారా, అందుబాటులో ఉన్న సమాచారాన్ని తెలియపరచడం ద్వారా, మహిళలు తమ సంతానోత్పత్తి, కెరీర్, భవిష్యత్తు కుటుంబ నియంత్రణ గురించి మరిన్ని విషయాల్లో అవగాహనతో పాటు నిర్ణయాలు తీసుకోవచ్చు. భారతదేశంలో ఎక్కువ మంది మహిళలు పిల్లలు కనడాన్ని వాయిదా వేసుకోవడాన్ని బట్టి చూస్తుంటే సంతానోత్పత్తి, వ్యక్తిగత ఎంపిక గురించి చర్చ ఇంకా పెరగాల్సి ఉందని స్పష్టం అవుతుంది.
మహిళల వయసు పెరుగుతున్న కొద్దీ అండాల సంఖ్య, నాణ్యత తగ్గిపోతుంది. 35 ఏళ్ల తర్వాత గర్భధారణ అవకాశాలు తగ్గుతాయి, జెనెటిక్ రిస్కులు పెరుగుతాయి. కెరీర్, ఎడ్యుకేషన్, వ్యక్తిగత పరిస్థితుల వల్ల తల్లి కావడం ఆలస్యమవుతుంటే, ఎగ్ ఫ్రీజింగ్ ఒక మంచి ఎంపిక. అయితే, 30 – 35 ఏళ్ల లోపు అండాల నాణ్యత బాగుంటుంది కాబట్టి ఈ వయసు అనుకూలం. హార్మోన్ ఇంజెక్షన్లతో అండాశయాల్లో ఒకేసారి ఎక్కువ అండాలు ఉత్పత్తి అయ్యేలా చేస్తారు.
అండాలను శస్త్రచికిత్స లేకుండా సులభమైన ప్రక్రియ (egg retrieval ) ద్వారా బయటకు తీస్తారు. వాటిని ప్రత్యేకమైన సాంకేతికతతో ఫ్రీజ్ చేస్తారు. భవిష్యత్తులో అవసరం ఉన్నప్పుడు ఐవిఎఫ్ పద్దతి ద్వారా అండాలను ఉపయోగిస్తారు. లేటు వయసులో కూడా తల్లి కావాలనుకుంటే ఈ పద్ధతి సురక్షితమైనది. క్యాన్సర్ వంటి సమస్యలు వచ్చి వైద్య చికిత్స జరిగినప్పుడు ఫెర్టిలిటీ సమస్య ఉత్పన్నం కావచ్చు.
అందుకని ముందే నిల్వ చేసుకున్న అండాశయాల ద్వారా బిడ్డలను పొందవచ్చు. అయితే వీటి విషయంలో వంద శాతం గ్యారంటీ అని చెప్పలేం. ఎందుకంటే నిల్వ చేసిన అండాలు విజయవంతంగా ఫలదీకరించలేకపోవచ్చు. ఖరీదైన ప్రక్రియ (లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది) కూడా. హార్మోన్ ట్రీట్‌మెంట్ వల్ల ఉబ్బరం, తలనొప్పి, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఎన్ని సంవత్సరాలు నిల్వ చేసినా, అండం నిల్వ సమయంలో ఉన్న వయసు ఆధారంగానే ఫలితం వస్తుంది. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై, పూణే, న్యూఢిల్లీ నగరాలలోని హాస్పిటళ్లు ఎగ్ ఫ్రీజింగ్ అవకాశాన్నీ అందిస్తున్నాయి.
– డా.శిరీష, గైనకాలజిస్ట్
(చదవండి: వాట్ పబ్లిక్ టాయిలెట్ టూరిస్ట్ స్పాటా..?! రీజన్ ఇదే..)