నిజాం క్లబ్‌ రికార్డు: ఫస్ట్‌ ఉమన్‌ @135

Hyderabad Nizam Club Vice President Karuna Dundoo, Kitchen Secrets of Telangana Book - Sakshi

గ్రేట్‌ జర్నీ

హైదరాబాద్‌లో నిజాం క్లబ్‌ను 1884లో స్థాపించారు. నగరంలోని ప్రముఖులు ఆ క్లబ్‌లో సభ్యత్వం ఉండడాన్ని ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు. అలాంటి క్లబ్‌లో ఓ మహిళ వైస్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలను నిర్వర్తించడం 135 ఏళ్ల నిజాం క్లబ్‌ చరిత్రలో తొలిసారి. వైస్‌ ప్రెసిడెంట్‌గా 2019 డిసెంబర్‌లో గెలిచారామె. ఆమె పేరు డాక్టర్‌ కరుణా ఏకాంబర్‌. ఓ మహిళ తన అభ్యుదయ ప్రయాణంలో వేసిన సాధికారపు అడుగు ఇది. మగవాళ్లు తమ సామ్రాజ్యంగా పరిధి విధించుకున్న క్లబ్‌ను ఫ్యామిలీ క్లబ్‌గా దిద్దడంలో కరుణది కీలకమైన పాత్ర. 

‘విరి’సిన అభిలాష
జంటనగరాల్లో ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన కరుణా ఏకాంబర్‌ వారసత్వంగా అందివచ్చిన హోటల్‌ ఇండస్ట్రీ నిర్వహణతోపాటు తన అభిరుచి మేరకు సొంతంగా బ్లూమింగ్‌ బడ్స్‌ పేరుతో ఓ పూల వ్యాపారసామ్రాజ్యాన్ని స్థాపించుకున్నారు. విజయవంతమైన పారిశ్రామిక వేత్తగా గుర్తింపు పొందారు. ఇన్ని బాధ్యతల్లో నిజాం క్లబ్‌ బాధ్యతలను తలకెత్తుకోవడంలో ఉన్న ఇష్టాన్ని సాక్షితో పంచుకున్నారామె.

తొలితరం మెంబర్‌
‘‘నిజాం క్లబ్‌ నాకు సొంతిల్లులాంటిది. చిన్నప్పుడు నాన్నతో దాదాపు రోజూ క్లబ్‌కి వచ్చేదాన్ని. ఇక్కడ టేబుల్‌ టెన్నిస్, స్విమ్మింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తూనే పెరిగాను. అప్పట్లో మహిళలకు సభ్యత్వం ఉండేది కాదు. మహిళలకు అన్ని చోట్లా సమాన హక్కులు ఉండాలని కోర్టు తీర్పు ఇవ్వడంతో 1992లో మహిళలకు ఓటు హక్కుతో కూడిన మెంబర్‌షిప్‌ ఇచ్చారు. అలా నేను నిజాం క్లబ్‌ సభ్యత్వం తీసుకున్న తొలితరం మహిళనన్నమాట. క్లబ్‌లో మహిళల భాగస్వామ్యం పెంచాలని అనుకునే దాన్ని. 2009 నుంచి నాలుగేళ్లపాటు మేనేజింగ్‌ కమిటీ మెంబర్‌గా ఉన్నాను. నా ప్రతిపాదనను మిగిలిన సభ్యులు కూడా సానుకూలంగా తీసుకోవడంతో క్లబ్‌లో చాలా మార్పులు చేయగలిగాం. ఆ తర్వాత నాలుగేళ్లు జాయింట్‌ సెక్రటరీగా బాధ్యతల్లో ఉన్నాను. వైస్‌ ప్రెసిడెంట్‌గా ఇది రెండో ఏడాది. 

ఈ పదేళ్లలో క్లబ్‌లో ఆడవాళ్లు ఆడుకునే ఆటలు పెట్టించడంతోపాటు లేడీస్‌ ట్రైనర్లతో జిమ్, హెల్త్‌క్లబ్‌ను ఇంప్రూవ్‌ చేయడంతోపాటు మహిళలు, పిల్లల కోసం విడివిడిగా స్విమ్మింగ్‌ పూల్స్‌ కట్టించాం. అంతకుముందు కామన్‌ స్విమ్మింగ్‌ పూల్‌లో మహిళల కోసం కొంత టైమ్‌ ఉండేది. మహిళలకు విడిగా పూల్‌ ఉండడంతో పిల్లలతోపాటు మహిళలూ రోజూ వస్తున్నారు.


పండుగల వేదిక
నిజాం క్లబ్‌లో ఇప్పుడు రంజాన్, దసరా, క్రిస్టమస్, ఉగాది పండుగలతోపాటు ఉమెన్స్‌ డే వేడుకలను కూడా నిర్వహిస్తున్నాం. దాంతో మహిళల పార్టిసిపేషన్‌ బాగా పెరిగింది. ఈ ఏడాది మార్చిలో ఐదు సాధారణ సభ్యత్వాలకు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో దాదాపు 650 మంది మహిళలు ఓటు వేశారు. ఆకాశంలో సగం, అవనిలో సగం అని మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో చూపించాలి. అందుకు మగవాళ్లు బాటలు వేయాలని ఎదురు చూడడం ఎందుకు? మనం ఒక అడుగు వేస్తే ఆ తర్వాత అడుగులను సమాజమే వేయిస్తుంది’’ అన్నారు డాక్టర్‌ కరుణా ఏకాంబర్‌.


రిపబ్లిక్‌ డే పతాక అవిష్కరణ సందర్భంగా... 

పూల డాక్టర్‌ – పుస్తక రచయిత
కరుణా ఏకాంబర్‌కి పూలంటే ఇష్టం. పూల వ్యాపారం చేశారు. పూల మీద అధ్యయనం చేసి పీహెచ్‌డీ అందుకున్నారు. అలాగే ఆమె నిత్యవిద్యార్థిని. నేర్చుకోవాలనే జిజ్ఞాసకు వయసు అడ్డంకి కాదంటారామె. పెళ్లి తర్వాత డిగ్రీ, హోటల్‌ మేనేజ్‌మెంట్, న్యూట్రిషన్‌ కోర్సు, ఇకబెనా ఫ్లవర్‌ డెకరేషన్‌ కోర్సులు చేశారు. పియానో కోర్సు కూడా చేశారు. అంతకంటే ముందు సోషియాలజీలో ఎంఫిల్‌ ఉంది. కోవిడ్‌ కారణంగా వచ్చిన ఈ విరామంలో హోలిస్టిక్‌ న్యూట్రిషన్‌ ప్రోగ్రామ్‌లో ఎంఫిల్‌ చేశారు. పని ఒత్తిడి నుంచి బయటపడడానికి కాలిగ్రఫీ, డూడులింగ్, మండల్‌ ఆర్ట్‌ వేస్తుంటారు.

హైబిజ్‌ లీడర్‌షిప్‌ అవార్డు అందుకున్న కరుణ ఇప్పుడు ఆయుర్వేద మెడిసిన్‌ రెండవ దశ కోర్సు చేస్తున్నారు. ఇక పుస్తక రచన పట్ల ఆసక్తి కగలగానికి కారణం ఆధునికతలో మన వంటిల్లు రూపు మారిపోవడమేనన్నారు. అమ్మ చేతి వంటకు దూరం కాకూడదని ఆమె ‘మదర్స్‌ కుక్‌ బుక్‌ రాశారు. తెలంగాణ కిచెన్‌ అంటే నాన్‌వెజ్‌ భోజనం, బిర్యానీలు మాత్రమే అనే అపోహను తొలగించడానికి శాకాహార రుచుల కోసం ‘సీక్రెట్స్‌ ఆఫ్‌ తెలంగాణ కిచెన్‌’ రాశారు డాక్టర్‌ కరుణ.
– వాకా మంజులారెడ్డి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top