
ఇండియా, జపాన్‌ల మధ్య ఉన్న బంధాన్ని పెంచేందుకు ఈ నెల 25, 26వ తేదీల్లో స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ వేదికగా ‘హైదరాబాద్ జపాన్ ఫెస్టివల్–2025’ నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ జపనీస్ అసోసియేషన్ చైర్మన్ హెచ్.పురుటా తెలిపారు. నారా జపాన్ హబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఫెస్టివల్ ద్వారా రెండు దేశాల సాంస్కృతిక మార్పిడి, పరస్పర అవగాహన, ఆర్థిక సహకారాన్ని పెంపొందించేందుకు ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.
సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం కార్యక్రమ కరపత్రాన్ని నా రా జపాన్ హబ్ వ్యవస్థాపకుడు డాక్టర్ బొడ్డుపల్లి రామభద్ర, సహ వ్యవస్థాపకురాలు బొడ్డుపల్లి నాగనాథ్, హిడీతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రెండు రోజుల ఉత్సవంలో కాలిగ్రఫీ, మార్షల్ ఆర్ట్స్, ఇండియన్ కూచిపూడి, కిమోనో, శారీ ఫ్యాషన్ షో ఉంటుందని, ఒరిగామి, సుమీ పెయింటింగ్స్, విద్యార్థుల సృజనాత్మకపై కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.
జపాన్‌లో విద్యా, ఉద్యోగ అవకాశాలు, స్కాలర్‌షిప్ పొందడం ఎలా, జపనీస్ ఉత్పాదక పద్ధతులు, ఇకిగై తత్వశాస్త్రం వంటి అంశాలను నిపుణులు చర్చిస్తారని చెప్పారు. జపాన్ ప్రత్యేక వంటకాలతో స్టాల్స్ ఏర్పాటు చేస్తారన్నారు. కార్యక్రమానికి జపాన్ కౌన్సిల్ జనరల్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన హాజరవుతారని పేర్కొన్నారు.