
దీపావళిని వైభవంగా జరుపుకునే నగరాల్లో మన సిటీ ఒకటి. ఆకాశంలో నక్షత్రాల్లా విరబూసే టపాసులతో ఉత్సాహంగా దీపావళిని జరుపుకుంటాం. ముఖ్యంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలు, విభిన్న సంస్కృతులకు చెందిన వారు నగరంలో అధికంగా ఉండటంతో ఇది అందరి పండుగలా అత్యంత ఘనంగా నిర్వహించుకుంటాం. అయితే పండుగ ఆనందం ముగిసిన తర్వాత నగరం ఎదుర్కొంటున్న పెద్ద సవాల్ కాలుష్యం.. కాలుష్య నియంత్రణ మండలి గణాంకాల ప్రకారం దీపావళి రోజున పీఎం 2.5 స్థాయిలు 69కి, సాధారణంగా 50లోపు ఉండాల్సిన పీఎం 10 స్థాయిలు 153కి (మూడు రెట్లు) పెరిగాయి. అంటే గాలిలో సూక్ష్మ ధూళికణాలు, రసాయనాలు, పొగ మొదలైనవి సాధారణ రోజులతో పోలిస్తే 60–80 శాతం ఎక్కువగా ఉన్నాయి. దీని ప్రభావం కేవలం ఆ రోజు మాత్రమే కాకుండా, కొన్ని రోజులు నగర గాలి నాణ్యతపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ఈ పరిస్థితులు జీవనశైలి, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. చిన్నారులు, వృద్ధులకు ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రోజువారీ జీవనశైలిలో కొన్ని స్మార్ట్ మార్పులు చేసుకుంటే కాలుష్యాన్ని తగ్గించుకోవచ్చని నిపుణుల మాట.
హైదరాబాద్‌లో స్మార్ట్ హోమ్ పరికరాలు వేగంగా పెరుగుతున్నాయి. ఈ కాలుష్య సమయంలో హెపా(హెచ్‌ఈపీఏ) ఫిల్టర్ ఉన్న ఎయిర్ ప్యూరిఫైయర్లు, ఎయిర్ విజువల్ వంటి ఎయిర్ మానిటరింగ్ యాప్స్ వాడటం ద్వారా గాలినాణ్యతను తక్షణం తెలుసుకోవచ్చు. ఇంట్లో గాలి సర్క్యులేషన్ కోసం రోజుకు కనీసం 15 నిమిషాలు కిటికీలు తెరిచి ఉంచడం మంచిది.
గ్రీన్ లివింగ్.. నేచురల్ ఎయిర్ ఫిల్టర్స్..
చిన్న స్పేస్‌ల్లో కూడా ఇండోర్ ప్లాంట్స్ చాలా పెద్ద మార్పు తీసుకువస్తాయి. అరెకా పామ్, స్పైడర్ ప్లాంట్, స్నేక్ ప్లాంట్, ఆలొవెరా వంటి మొక్కలు గాలిలోని టాక్సిన్స్‌ను శోషించి ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. ఇప్పుడు సిటీ ట్రెండ్.. బాల్కనీలో మినీ ఆక్సిజన్ గార్డెన్స్.
స్మార్ట్ కమ్యూటింగ్..
కాలుష్యాన్ని తగ్గించే సిటీ మూవ్‌మెంట్ దీపావళి తర్వాతి రోజుల్లో వీధుల్లో వాహనాల సంఖ్య తగ్గించి.. కార్ పూలింగ్, ప్రజారవాణా, ఎలక్ట్రిక్ బైక్స్, మెట్రో ప్రయాణం మంచిది. ఇవి కేవలం గాలి కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా, నగర ట్రాఫిక్‌ను కూడా కంట్రోల్ చేస్తాయి. ‘రైడ్ గ్రీన్ హైదరాబాద్’ వంటి సిటీ కాంపెయిన్లు ఇప్పుడు ట్రెండ్‌గా మారుతున్నాయి.
బ్రీత్ డీటాక్స్..
శరీరానికి సహజ రక్షణ కాలుష్య సమయంలో శరీరం పీలి్చన టాక్సిన్స్ నుంచి రికవరీ కావడానికి స్టీమ్ ఇన్హేలేషన్, నాసికా కర్మ, ప్రాణాయామం వంటి యోగా పద్ధతులు సహజ డీటాక్సిఫైయర్లు. అలాగే నీరు ఎక్కువగా తాగడం, విటమిన్–సి ఉన్న పండ్లు (మొసంబి, నారింజ, ఆమ్లా) తీసుకోవడం
శ్వాసకోశానికి రక్షణ కల్పిస్తుంది.
సామూహిక చొరవ.. క్లీన్ బ్రీత్.
హైదరాబాద్‌లో ఇప్పటికే కొంతమంది యువత ‘స్వచ్ఛ గాలి డ్రైవ్’, ‘గ్రీన్ దీపావళి మిషన్’ వంటి ప్రచారంలో పాల్గొంటున్నారు. కాలుష్యానంతర రోజుల్లో కమ్యూనిటీ ప్లాంటేషన్ డ్రైవ్స్, పార్క్ క్లీన్ అప్ ఈవెంట్స్ వంటి కార్యక్రమాలు నగర జీవనశైలిలో కొత్త పాజిటివ్ వేవ్‌గా మారుతున్నాయి.