
మా అమ్మ గారికి 78 సంవత్సరాలు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. అలాంటిది ఆమె ఒక 6–7 నెలల నుండి ఒళ్ళంతా చిన్న చిన్న పురుగులు పాకుతున్నాయని, దురదగా ఉందని వళ్లంతా గోక్కుంటోంది. స్కిన్ ఇన్ఫెక్షన్ అనుకుని చర్మం డాక్టర్ గారి దగ్గరికి తీస్కుని వెళ్ళాము. పరీక్ష చేసి ఎలాంటి ఇన్ఫెక్షన్ లేదని దురద తగ్గడానికి కొన్ని మందులు ఆయింట్మెంట్ ఇచ్చారు. అవి వాడిన తర్వాత కూడా ఆమెకు ఉపశమనం లేదు. పురుగులు చర్మంలోకి చొచ్చుకు పోతున్నాయని గొడవ చేస్తుంది. పుండ్లు పుట్టేలా చర్మాన్ని గోకుతుంది. ఒక చిన్న ఖాళీ డబ్బా తీస్కుని దాంట్లో పురుగులు వేశానని మమ్మల్ని కూడా చూడమని చెప్తుంది. ఆ డబ్బాలో ఆమె బట్టలవి చిన్న చిన్న దారపు పోగులు తప్ప ఏమి లేవు అంటే ఒప్పుకోదు. ఆవిడ బాధ తట్టుకోలేక ఇంకో స్కిన్ డాక్టర్ గారి దగ్గరికి తీసుకు వెళ్ళాము. ఆయన తల స్కాన్ చేసి ఒకసారి మానసిక వైద్యునికి చూపించమని చెప్పారు. ఆమె అన్ని రకాలుగా బాగుంది. ఆమె పనులు ఆమె చేసుకుంటుంది. జ్ఞాపక శక్తి బాగుంది. ఈ పురుగులు పాకుతున్నాయిని ఒక్క కంప్లెట్ తప్ప! ఆమెకు సైకియాట్రిస్ట్ ట్రీట్మెంట్ అవసరం అంటారా?
– పద్మావతి, బళ్ళారి
మీరు మీ అమ్మగారిలో చూస్తున్న లక్షణాలు క్లాసికల్‌గా ‘డెల్యూజనల్ పారా సైటోసిస్‘ లేదా ‘ఎక్బామ్ సిండ్రోమ్‘ అనే మానసిక సమస్య వచ్చిన వారిలో కనబడతాయి. ఇది ఒక అరుదైన మానసిక సమస్య. దీనిని ఎక్కువగా స్త్రీలలో చూస్తాము. మెదడు రసాయనాల్లో వచ్చే మార్పులు ఈ జబ్బు రావడానికి ప్రధాన కారణం. రక్త హీనత, విటమిన్ లోపాలు, థైరాయిడ్ సమస్యలు లాంటివి ఉండే వారిలో కూడా జబ్బు వచ్చే ఆవకాశాలు ఎక్కువ.
కొన్ని సార్లు పెద్దవయసులో వచ్చే ‘ఆల్జీమర్స్ డిమెన్షియా‘ ఈ లక్షణంతోనే ప్రారంభం అవ్వొచ్చు. అలాగే అత్యంత అరుదుగా మెదడులో కణుతులు లాంటివి ఉన్నా డెల్యూజన్‌లో పారా సైటోసిస్ లక్షణాలు కనపడే అవకాశముంది.
తమ వంటిమీది లేదా చర్మం కింద పురుగులు పాకుతున్నాయనే సందేహం తప్ప ఇతర లక్షణాలు ఏమి కనపడవు. దురద తట్టుకోలేక కొంతమంది చర్మానికి క్రిమి సంహారక మందులు పూసుకొని ప్రాణం మీదికి కూడా తెచ్చుకుంటారు.
యాంటీ సైకోటిక్ మందుల ద్వారా ఈ జబ్బు లక్షణాలని పూర్తిగా తగ్గించవచ్చు. మీరు దగ్గర్లోని మానసిక వైద్యుని వెంటనే కలిసి వాళ్ళు చెప్పిన ప్రకారం మందులు వాడితే త్వరగా ఆమె సమస్య తగ్గుతుంది. ఇది మానసిక జబ్బు లక్షణమే తప్ప శారీరక అనారోగ్యం ఏమాత్రం కాదనేది అందరూ గుర్తించాలి!
(డా. ఇండ్ల విశాల్ రెడ్డి సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ sakshifamily3@gmail.com)