ఎవరు నాయనా వచ్చింది?
ఈ సమయంలో పరాయి మనుషులకు ఆశ్రమంలోకి ప్రవేశం లేదు!
ముందు తలుపు తీయరా ముసలాడా! నేను గజదొంగ గంగులుని!
శేషాచలం అడవుల్లో ఒక ఋషి ఎంతోకాలంగా ఆశ్రమం నిర్మించుకుని నివసిస్తున్నాడు. ఆయన ఆ అడవుల్లో వుండే ఆదివాసీలకు మూలికా వైద్యం చేస్తూ, వాళ్లకు, వాళ్ళ పిల్లలకు పురాణాలు, నీతి కథలు చెబుతూ అందరికీ తలలో నాలుకలా వుండేవాడు. ఒక రోజు రాత్రి ఎవరో ఆశ్రమం తలుపు దబదబ బాదుతూ వుంటే నిద్రాభంగం అయింది ఋషికి.
‘‘ఎవరు నాయనా వచ్చింది? ఈ సమయంలో పరాయి మనుషులకు ఆశ్రమంలోకి ప్రవేశం లేదు!’’ అన్నాడు ఋషి లేచి కూర్చుంటూ. ‘‘ముందు తలుపు తీయరా ముసలాడా! నేను గజదొంగ గంగులుని!’’ అన్న భీకరమైన మాటలు వినబడ్డాయి.
‘‘నువ్వు దొంగవైనా, జమీందారువైనా, ఈ సమయంలో ఆశ్రమంలోకి రాకూడదు నాయనా! అది ఆశ్రమ నియమం.’’ అని సౌమ్యంగా అన్నాడు ఋషి.
‘‘నువ్వు తలుపు తీయకపోతే నేను తలుపు బద్దలు కొట్టి వస్తాను. మర్యాదగా తలుపు తీస్తావా లేదా? నువ్వు మంచి మాటలతో తలుపు తీసేలా లేవు!’’ అంటూ, తలుపు బద్దలు కొట్టడానికి పెద్ద రాయి కోసం వెతుకుతూ, దబ్బుమంటూ ఒక గోతిలో పడి పోయాడు గంగులు. గొయ్యి లోతుగా వుండటంతో వాడికి నడుం విరిగినంత పని అయింది.
‘‘చచ్చానురోయ్, దేవుడా!’’ అంటూ బాధగా అరిచాడు గంగులు.
తక్షణం తలుపు తీసుకుని బయటకు వచ్చాడు ఋషి. ఆయన గోతిలో మూలుగుతున్న గంగులును చూసి, ‘‘ఎంత పని జరిగింది నాయనా! ఆశ్రమం వెనక వైపు వున్న బావి ఎండిపోవడంతో, కొందరు చెంచులు ముందు వైపు బావి తవ్వుతున్నారు. చీకట్లో నువ్వు కాలు జారి, బావిలో పడి నట్లున్నావు!’’ అంటూ ఋషి ఆశ్రమంలోకి వెళ్లి ఒక పెద్ద తాడు తీసుకు వచ్చాడు. ఆ తాడు సహాయంతో గంగులుని అతి కష్టం మీద పైకి లాగాడు ఋషి.
తరువాత నడవలేకపోతున్న గంగులుని చేయి పట్టుకుని జాగ్రత్తగా ఆశ్రమంలోకి తీసుకు వెళ్ళాడు. గంగులు గాయాలకు పసరు మందు రాసి కట్టు కట్టాడు. ఒక లోటాలో ఆవు పాలు తీసుకు వచ్చి, గంగులు చేత తాగించాడు.
అప్పటి దాకా ఋషి చేస్తున్న పనులన్నీ విభ్రాంతిగా చూస్తున్న గంగులు, ‘‘ఈరోజు నాకు మహోపకారం చేశారు. మునపటి నా ప్రవర్తన మీద మీకు కోపం లేదా స్వామి?’’ అని అడిగాడు గంగులు.
ఋషి నవ్వి, ‘‘ఎవరి ధర్మానికి తగినట్లుగా వారు ప్రవర్తిస్తారు. నువ్వు దొంగలా బెదిరించావు. నేనొక ఋషిలా నీకు సేవ చేశాను అంతే!’’ అన్నాడు.
‘‘ఈ సమయంలో ఎవరికీ ఆశ్రమ ప్రవేశం లేదని చెప్పారు కదా! మరి మీరు స్వయంగా నన్ను లోపలికి ఎలా తీసుకువచ్చారు?’’ అని అడిగాడు గంగులు.
‘‘ఆపదలో వున్న తోటి మనిషిని కాపాడటానికి మించిన ధర్మం ఏం వుంది? అది సరే కానీ నువ్వు ఆశ్రమం అంతా వెతికినా వన మూలికలు తప్ప మరేమీ దొరకవు’’ అన్నాడు ఋషి.
ఆ మాటలకు గంగులు సిగ్గు పడి, ‘‘నా అవివేకపు ప్రవర్తనకు క్షమించండి స్వామి’’ అన్నాడు చేతులు జోడించి.
గంగులుకి ఇంకా పెళ్లి కాలేదని తెలుసుకుని, ‘‘నీ కాబోయే భార్య ఒక దొంగకు భార్యగా, పుట్టబోయే పిల్లలు దొంగకు పుట్టిన పిల్లలుగా వుండటం నీకు గాని, నీ కుటుంబానికి గాని గౌరవంగా వుంటుందా చెప్పు! దొంగ అని తెలిస్తే చాలు, దారిన పోయేవాడు కూడా నాలుగు పిడిగుద్దులు గుద్ది, మొహం మీద వుమ్మేసి పోతాడు! డబ్బు సంపాదించడానికి ఇంత నీచమైన పని చేయాలా, ఆలోచించుకో!’’ అన్నాడు ఋషి.
ఆ మాటలకు గంగులు తలదించుకుని మౌనంగా వుండి పోయాడు.
‘‘చీకటి ఎంత గాఢంగా వున్నా చిరు దీపం తో దాన్ని పారదొలొచ్చు! అలాగే మనిషి మనసు ఎంత కలుషితమైపోయి వున్నా ఒక మంచి మాటతో ఆ మలినాన్ని కడిగి వేయవచ్చు! నీ జీవితం కొత్త మలుపు తిరగడానికి దొంగగా ఈ ఆశ్రమానికి వచ్చిన నువ్వు, దొరలా ఇక్కడి నుంచి వెళతావో, లేక పాత దారిలోనే నడుస్తావో నీ ఇష్టం!’’ అన్నాడు ఋషి.
‘‘లేదు స్వామి, నా కళ్ళు పూర్తిగా తెరుచుకున్నాయి. ఇక జన్మలో దొంగతనం అనేది మరచి పోయి, కష్టపడి గౌరవంగా బ్రతుకుతాను’’ అంటూ ఋషికి నమస్కరించి ఆశ్రమం నుంచి బయటకు నడిచాడు గంగులు.
హితవచనం.. అజ్ఞానికి, నమ్మకంలేనివాడికి, అనుమానించేవాడికి నాశనం తప్పదు వీళ్లలో అనుమానించేవాడికి ఇహపరాలలో సుఖం ఎక్కడా ఉండదు. - మాచిరాజు కామేశ్వర రావు


