breaking news
machiraju
-
అపకారికి ఉపకారం: మర్యాదగా తలుపు తీస్తావా లేదా?
శేషాచలం అడవుల్లో ఒక ఋషి ఎంతోకాలంగా ఆశ్రమం నిర్మించుకుని నివసిస్తున్నాడు. ఆయన ఆ అడవుల్లో వుండే ఆదివాసీలకు మూలికా వైద్యం చేస్తూ, వాళ్లకు, వాళ్ళ పిల్లలకు పురాణాలు, నీతి కథలు చెబుతూ అందరికీ తలలో నాలుకలా వుండేవాడు. ఒక రోజు రాత్రి ఎవరో ఆశ్రమం తలుపు దబదబ బాదుతూ వుంటే నిద్రాభంగం అయింది ఋషికి.‘‘ఎవరు నాయనా వచ్చింది? ఈ సమయంలో పరాయి మనుషులకు ఆశ్రమంలోకి ప్రవేశం లేదు!’’ అన్నాడు ఋషి లేచి కూర్చుంటూ. ‘‘ముందు తలుపు తీయరా ముసలాడా! నేను గజదొంగ గంగులుని!’’ అన్న భీకరమైన మాటలు వినబడ్డాయి.‘‘నువ్వు దొంగవైనా, జమీందారువైనా, ఈ సమయంలో ఆశ్రమంలోకి రాకూడదు నాయనా! అది ఆశ్రమ నియమం.’’ అని సౌమ్యంగా అన్నాడు ఋషి.‘‘నువ్వు తలుపు తీయకపోతే నేను తలుపు బద్దలు కొట్టి వస్తాను. మర్యాదగా తలుపు తీస్తావా లేదా? నువ్వు మంచి మాటలతో తలుపు తీసేలా లేవు!’’ అంటూ, తలుపు బద్దలు కొట్టడానికి పెద్ద రాయి కోసం వెతుకుతూ, దబ్బుమంటూ ఒక గోతిలో పడి పోయాడు గంగులు. గొయ్యి లోతుగా వుండటంతో వాడికి నడుం విరిగినంత పని అయింది. ‘‘చచ్చానురోయ్, దేవుడా!’’ అంటూ బాధగా అరిచాడు గంగులు.తక్షణం తలుపు తీసుకుని బయటకు వచ్చాడు ఋషి. ఆయన గోతిలో మూలుగుతున్న గంగులును చూసి, ‘‘ఎంత పని జరిగింది నాయనా! ఆశ్రమం వెనక వైపు వున్న బావి ఎండిపోవడంతో, కొందరు చెంచులు ముందు వైపు బావి తవ్వుతున్నారు. చీకట్లో నువ్వు కాలు జారి, బావిలో పడి నట్లున్నావు!’’ అంటూ ఋషి ఆశ్రమంలోకి వెళ్లి ఒక పెద్ద తాడు తీసుకు వచ్చాడు. ఆ తాడు సహాయంతో గంగులుని అతి కష్టం మీద పైకి లాగాడు ఋషి.తరువాత నడవలేకపోతున్న గంగులుని చేయి పట్టుకుని జాగ్రత్తగా ఆశ్రమంలోకి తీసుకు వెళ్ళాడు. గంగులు గాయాలకు పసరు మందు రాసి కట్టు కట్టాడు. ఒక లోటాలో ఆవు పాలు తీసుకు వచ్చి, గంగులు చేత తాగించాడు.అప్పటి దాకా ఋషి చేస్తున్న పనులన్నీ విభ్రాంతిగా చూస్తున్న గంగులు, ‘‘ఈరోజు నాకు మహోపకారం చేశారు. మునపటి నా ప్రవర్తన మీద మీకు కోపం లేదా స్వామి?’’ అని అడిగాడు గంగులు.ఋషి నవ్వి, ‘‘ఎవరి ధర్మానికి తగినట్లుగా వారు ప్రవర్తిస్తారు. నువ్వు దొంగలా బెదిరించావు. నేనొక ఋషిలా నీకు సేవ చేశాను అంతే!’’ అన్నాడు.‘‘ఈ సమయంలో ఎవరికీ ఆశ్రమ ప్రవేశం లేదని చెప్పారు కదా! మరి మీరు స్వయంగా నన్ను లోపలికి ఎలా తీసుకువచ్చారు?’’ అని అడిగాడు గంగులు.‘‘ఆపదలో వున్న తోటి మనిషిని కాపాడటానికి మించిన ధర్మం ఏం వుంది? అది సరే కానీ నువ్వు ఆశ్రమం అంతా వెతికినా వన మూలికలు తప్ప మరేమీ దొరకవు’’ అన్నాడు ఋషి.ఆ మాటలకు గంగులు సిగ్గు పడి, ‘‘నా అవివేకపు ప్రవర్తనకు క్షమించండి స్వామి’’ అన్నాడు చేతులు జోడించి.గంగులుకి ఇంకా పెళ్లి కాలేదని తెలుసుకుని, ‘‘నీ కాబోయే భార్య ఒక దొంగకు భార్యగా, పుట్టబోయే పిల్లలు దొంగకు పుట్టిన పిల్లలుగా వుండటం నీకు గాని, నీ కుటుంబానికి గాని గౌరవంగా వుంటుందా చెప్పు! దొంగ అని తెలిస్తే చాలు, దారిన పోయేవాడు కూడా నాలుగు పిడిగుద్దులు గుద్ది, మొహం మీద వుమ్మేసి పోతాడు! డబ్బు సంపాదించడానికి ఇంత నీచమైన పని చేయాలా, ఆలోచించుకో!’’ అన్నాడు ఋషి.ఆ మాటలకు గంగులు తలదించుకుని మౌనంగా వుండి పోయాడు.‘‘చీకటి ఎంత గాఢంగా వున్నా చిరు దీపం తో దాన్ని పారదొలొచ్చు! అలాగే మనిషి మనసు ఎంత కలుషితమైపోయి వున్నా ఒక మంచి మాటతో ఆ మలినాన్ని కడిగి వేయవచ్చు! నీ జీవితం కొత్త మలుపు తిరగడానికి దొంగగా ఈ ఆశ్రమానికి వచ్చిన నువ్వు, దొరలా ఇక్కడి నుంచి వెళతావో, లేక పాత దారిలోనే నడుస్తావో నీ ఇష్టం!’’ అన్నాడు ఋషి.‘‘లేదు స్వామి, నా కళ్ళు పూర్తిగా తెరుచుకున్నాయి. ఇక జన్మలో దొంగతనం అనేది మరచి పోయి, కష్టపడి గౌరవంగా బ్రతుకుతాను’’ అంటూ ఋషికి నమస్కరించి ఆశ్రమం నుంచి బయటకు నడిచాడు గంగులు.హితవచనం.. అజ్ఞానికి, నమ్మకంలేనివాడికి, అనుమానించేవాడికి నాశనం తప్పదు వీళ్లలో అనుమానించేవాడికి ఇహపరాలలో సుఖం ఎక్కడా ఉండదు. - మాచిరాజు కామేశ్వర రావు -
రాపిడ్ ఫైర్: ప్రదీప్ మాచిరాజు And దీపికా పిల్లి
-
మాచిరాజు చిత్రాలు మాట్లాడతాయి : త్రివిక్రమ్
ఒంగోలు మెట్రో: ‘ఆయన కళాఖండాలు మాట్లాడుతాయి. ఆధ్యాత్మిక చైతన్యంతో తొణకిసలాడుతాయి’ అని ప్రముఖ సినీ దర్శకుడు, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నారు. ఒంగోలుకు చెందిన ప్రఖ్యాత చిత్రకారులు, వైద్యుడు డాక్టర్ మాచిరాజు రామచంద్రరావు వేసిన కళాకృష్ణ చిత్రాలను సోమవారం సాయంత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ సందర్శించి ప్రశంసించారు. లాయరుపేటలోని రామచంద్రరావు నివాసంలో ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీని త్రివిక్మ్మŠఆయన తిలకించి ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 72 మేళకర్తల రాగాలను తన కళా నైపుణ్యంతో చిత్రరూపంలో అందించిన మాచిరాజు అభినందనీయులన్నారు. ప్రతిచిత్రం ద్వారా సమాజానికి కళారంగానికి ఉన్నత సందేశాన్ని ఇచ్చారన్నారు. అటు వైద్యునిగా, ఇటు చిత్రకారుడిగా సవ్యసాచిలా ఆయన నిర్వహిస్తున్న పాత్ర అందరికీ ఆదర్శమన్నారు. ఇలాంటి కళాకారులను ప్రభుత్వాలు గుర్తించి అవసరం, తద్వారా చిత్రకళా రంగ ఉన్నతికి చేయూతనివ్వాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. కార్యక్రమంలో చిత్రకారులు డాక్టర్ మాచిరాజు రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రముఖ అష్టావధాని మాచిరాజు శివరామరాజు మృతి
కర్నూలు(కల్చరల్): ప్రముఖ అష్టావధాని మాచిరాజు శివరామరాజు(70) శుక్రవారం సాయంత్రం గుండెపోటుతో మరణించారు. చాగలమర్రికి చెందిన ఆయన దాదాపు 112 అవధానాలు పూర్తిచేసి ఎంతోమంది శిష్యులను తీర్చిదిద్దారు. గురువారం కర్నూలు టీజీవీ కళాక్షేత్రంలో నిర్వహించిన అష్టావధానంలో ఆయన పాల్గొన్నారు. 24 గంటలు గడవక మునుపే ప్రాణాలు కోల్పోవడం సాహితీ లోకాన్ని కన్నీరు పెట్టిస్తోంది. ఆయన మృతి సాహిత్య రంగానికి తీరని లోటని అవధాని రామ్మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. మాచిరాజు కవితా మాధుర్యాన్ని తెలుగు పాఠకులు ఎన్నటికీ మరిచిపోలేరని మరో ప్రముఖ పద్యకవి బాలన్న అన్నారు. తెలుగు కళాస్రవంతి అధ్యక్షులు డాక్టర్ ఎంపీఎం.రెడ్డి, కార్యదర్శి ఎస్ఎస్ పటేల్, కార్యాధ్యక్షులు ఇనాయతుల్లా, కర్నూలు కవులు మారేడు రాముడు, శ్రీనివాసులు తదితరులు మాచిరాజు మృతి పట్ల సంతాపం ప్రకటించారు.


