కథ: నూటొక్క దర్శనాలు.. స్వామివారు కాంక్షించేది కూడా అదే ఇంద్రనీల్‌! | Sakshi
Sakshi News home page

కథ: నూటొక్క దర్శనాలు.. స్వామివారు కాంక్షించేది కూడా అదే ఇంద్రనీల్‌!

Published Sun, May 22 2022 4:21 PM

Funday Magazine: Nootokka Darshanalu Telugu Story - Sakshi

ఇంద్రనీల్‌ కళ్ళ నుండి నీళ్ళు ఉబికి వస్తున్నాయి. ఎంత ప్రయత్నించినా.. మనసుకు ఎంత సర్దిచెప్పినా కన్నీటి ధార ఆగటం లేదు. ఎంతో ఇష్టపడిన తిరుపతిని వదిలి హైదరాబాద్‌ కాంక్రీట్‌ అరణ్యానికి మూడు నెలల్లో వెళ్ళాల్సిందే. తిరుపతికి వచ్చిన లక్ష్యం నెరవేరనే లేదు. మూడేళ్ళు మూడు క్షణాలుగా గడిచిపోయాయి. ఇంద్రనీల్‌ను చూసి.. ఏమాత్రం ఆశ్చర్యపోలేదు వైదేహి.

స్వామివారు అంటే ఇంద్రనీల్‌కు ఎంత భక్తో ఆమెకు తెలుసు. తోటి ప్రయాణీకులు ఇంద్రనీల్‌ను గమనించకుండా కిటికీ వైపు కూర్చోబెట్టింది. అతనికి  మనసు బరువెక్కుతున్నట్లు అనిపించింది. ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో బిగ్గరగా ఏడిస్తేగానీ ఉపశమనం లభించేటట్లు లేదు. ఎప్పుడో పదిహేనేళ్ళ కిందట తన చెల్లెలు  పున్నమ్మ చనిపోయినప్పుడు దిక్కులు పిక్కటిల్లేలాగా ఏడ్చిన రోజులు గుర్తుకొస్తున్నాయి. అప్పుడు బిగ్గరగా ఏడ్వడం వల్లనేమో గుండె ఇంత బరువెక్కిట్లుగా అనిపించలేదు.

అప్పటికే బస్సు అలిపిరి తనిఖీ పాయింట్‌ దాటి గరుడాద్రి కొండ మీదుగా దూసుకుపోతోంది.  మెడిసిన్‌లో సీట్‌ వచ్చినప్పుడు, డిగ్రీ అందుకొన్న తర్వాత స్వామి వారి దర్శనం కోసం రావటం ఆనవాయితీగా మారింది. స్వామివారు తను కోరుకున్నవన్నీ ఇచ్చారు కొంచెం ముందూ..వెనకలుగా. అందుకే అతనికి స్వామివారంటే ఎనలేని భక్తి! 

తొలినాళ్ళలో మొక్కు తీర్చటం కోసం మొక్కుబడిగా మెట్లెక్కిన పాదాలు తిరిగి వెళ్ళేటప్పుడు మెట్లు దిగమని మారాం చేయటం, తిరిగి వెళుతుంటే మనసు కలత చెందడం తనకింకా గుర్తు. హైదరాబాదు నుండి శనివారం సాయంత్రం నారాయణాద్రి రైలుకు బయలుదేరి, సోమవారం సాయంత్రం పద్మావతి రైలుకు తిరిగి వెళ్ళటం, నిమిషం పాటు గోవిందుడి దర్శనం, గంటలోనే తిరుమలగిరి వీడటం మనోవేదనకు గురిచేసేది.

ఎలాగైనా జీవితంలో కొంతసమయం స్వామివారి చెంత గడపాలని, స్వామివారిని మనసారా దర్శించుకోవాలని, స్వామివారి అన్ని ఆర్జిత సేవల్లో పాల్గొనాలని ఇంద్రనీల్‌ దృఢంగా నిశ్చయించు కున్నాడు. దానికి తిరుపతిలో పీజీ చేయడమొక్కటే మార్గంగా తోచింది.  అనుకున్నట్లుగానే తిరుపతి.. వైద్యకళాశాలలో సీట్‌  దొరికింది. ఆనందానికి హద్దుల్లేవు.  

మూడేళ్ళ కోర్స్‌లో లెక్క వేస్తే నూట నలభై నాలుగు ఆదివారాలు సెలవులుగా దొరకనున్నాయి. ప్రతికూల పరిస్థితులు ఎదురై నలభై పైచిలుకు మినహాయించుకున్నా నూరున్నొక్క మార్లు మలయప్ప స్వామి దర్శనం పొందవచ్చు. వీలును బట్టి నిజపాద, తిరుప్పాడ, అష్టదళ పాద పద్మారాధన, మొదలగు అన్ని సేవలూ ఈ మూడు నెలల్లో పూర్తి చేసుకోవాలన్నది ఇంద్రనీల్‌ అభిమతం. అయితే ఇంద్రనీల్‌ సంబరం ఎక్కువకాలం నిలవలేదు. దైవం వరమిచ్చినా పూజారి వరమియ్యలేదన్న చందాన ప్రొఫెసర్‌ సత్యారావు స్వామివారి దర్శనాలకు సైంధవుడిలా అడ్డుపడ్డాడు.

ప్రొఫెసర్‌ సత్యారావు ప్రవర్తన స్థూలంగా శోధిస్తే అంతర్లీనంగా నాస్తికుడేమో అనిపించింది ఇంద్రనీల్‌కు. మంగళవారం నాడు ఎక్స్‌రే క్లాస్‌లు, గురువారం సెమినార్లు, శనివారం జర్నల్‌ క్లబ్‌ మీటింగ్స్‌. మిగతా రోజుల్లో రాత్రి పది వరకూ సాగే ప్రొఫెసర్‌ సత్యారావు ఈవెనింగ్‌ క్లినిక్స్‌తో వారం గడిచిపోయేది. ఇక్కడి వరకూ సరిపెట్టుకున్నా ఆదివారం రోజుల్లో సాయంత్రం వరకూ జరిగే పక్షవాత, మూర్ఛరోగుల క్యాంప్‌లతో.. ప్రొఫెసర్‌ సత్యారావు విద్యార్థుల వెన్ను విరిచేవాడు.

మిగతా రోజులకూ ఆదివారానికి తేడా ఏమిటంటే, ఆదివారం నాడు మాత్రం సాయంత్రం ఆరు గంటలకే హాస్టల్‌ చేరుకునే వెసులుబాటు కల్పించాడు. 24 గంటల విధులు నిర్వర్తించేటప్పుడు మధ్యరాత్రి సెల్‌ఫోన్‌కు కాల్‌ చేసి విధుల్లో ఉన్నారో లేరో తెలుసుకునేది. సెల్‌ఫోన్‌లో వెంటిలేటర్‌ శబ్దాలు వినపడకపోతే ల్యాండ్‌లైన్‌కు ఫోన్‌ చేసి వార్డులో ఉన్నారో లేరో నిర్ధారించుకునేది.   

వార్డు రౌండ్స్‌కయితే పిండప్రదాన కాకి కోసం ఎదురుచూసినట్లుగా వుండేది. ఒకరోజు ఉదయం తొమ్మిదికే పూర్తయితే మరొకరోజు రాత్రి పదకొండు అయ్యేది. ఏమైనా  రాత్రి పదకొండు తర్వాతే విరామం.  హాస్టల్‌ నుండి ఆసుపత్రికెళ్ళేటప్పుడు పగలు గాలిగోపురం, రాత్రివేళల్లో తిరుమలకు వెళ్ళే బస్సుల హెడ్‌లైట్స్‌ కాంతులు హాస్టల్‌ కిటికీ నుండి చూసి మురిసిపోవటం తప్ప ఆసుపత్రి ప్రాంగణమే దాటింది లేదు ఇంద్రనీల్‌.

ప్రొఫెసర్లు విషయ పరిజ్ఞానంలో ఎంత ఎత్తు ఎదిగినా కొద్దిమంది ప్రొఫెసర్లు మాత్రం స్త్రీలోలత్వం, కులం, మతం, ప్రాంతీయతత్వం జాడ్యాలతో మరుగుజ్జులవుతారనేది వాస్తవం. ప్రొఫెసర్‌ సత్యారావుకి వీటిల్లో ఏ బలహీనత వున్నా స్వామి వారి దర్శనానికి కొంత వెసులుబాటు వుండేదేమో అనిపించేది ఇంద్రనీల్‌కి.  ప్రొఫెసర్‌ సత్యారావు అప్పుడప్పుడు సెమినార్లలో క్షీరాన్నం, కదంబం, శుద్ధాన్నం లాంటి సామాన్యులకు అందని ప్రసాదాన్ని పంచేవారు. అదే ఇంద్రనీల్‌కు మహాభాగ్యమనిపించేది.  

బస్సు వెంకటాద్రి కొండ మీదకు చేరినట్లుంది. చెట్లల్లో కోతులు, కొండముచ్చుల గెంతులు, కొండచరియల్లోంచి జాలువారే నీళ్ళు, మూలమలుపుల్లో గోవిందుడి నామాలు, అశ్వగంధ, శతావరి ఔషధ మొక్కలను తాకుతూ ఒంటిని స్పృశిస్తూ వెళ్తున్న స్వచ్ఛమైన గాలి, కనుచూపు మేర పచ్చదనం కనువిందు చేస్తుంటే ఇంద్రనీల్‌ మనసు మెల్లగా కుదుటపడసాగింది. లక్ష్యం నెరవేరనప్పుడు గమ్యం మార్చాల్సి వుంటుంది.

గమ్యం కోసం గమనం మార్పు చేయాలనుకున్నాడు ఇంద్రనీల్‌. మొదటగా నూటొక్క దర్శనాలు అనుకున్నాడు. అది వీలు కానప్పుడు స్వామివారి మహాద్వారం దర్శనమయితే చాలు అని రాజీ పడ్డాడు. అదీ వీలు కాలేదు. కాబట్టి రేపటి ఎల్‌2 దర్శనంలో మొదటి ప్రాకారం నుండి స్వామి వారి దివ్యమంగళ దర్శనం వరకు ప్రతీ అంగుళాన్ని అనేకమార్లు చూసి మస్తిష్కంలో శాశ్వతంగా ముద్ర వేసుకొనేలా చేసుకోవాలి.

రోజువారి పూజలో గోవింద నామాల పఠనం అనంతరం కళ్ళు మూసుకొని ఆలయం ప్రతిరోజూ అడుగిడుతున్నట్లు వజ్రమకుటధారిని దర్శించుకున్నట్లు భావించుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. బస్సు రామ్‌బగీచా ప్రయాణ ప్రాంగణం చేరుకున్నట్లు గమనించనే లేదు.  ఇక బస్సు దిగండి అన్న వైదేహి పిలుపుతో స్వామివారి ఆలోచనల నుండి బయటపడి పద్మావతి గృహం చేరుకున్నారు ఇద్దరూ. 
∙∙ 
ఉదయం ఆరుకావస్తోంది.. ఎల్‌2 వి.ఐ.పి. భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రముఖ కవి ఆచార్య ఆత్రేయ చెప్పినట్లుగా కునుకు పడ్డాక మనసు పూర్తిగా కుదుటపడటమే కాకుండా గంటలో నారాయణుడి దర్శనం కోసం తీపి కలలు కంటున్నది. శరీరం పూర్తిగా తేలికయి గాల్లో తేలుతున్నట్లు ఎంత బలంగా ఆడుగేసినా పాదాలు నేలనే తాకనట్లు అనిపిస్తోంది ఇంద్రనీల్‌కు.  

తమ ఎల్‌2 టిక్కెట్టు, గుర్తింపుకార్డు ఆలయ సిబ్బందికి అందజేశారు భార్యభర్తలు. ఇంద్రనీల్‌ గుర్తింపుకార్డు చూడగానే ఆలయ సిబ్బంది ఒకరి మొఖాలు ఒకరు చూసుకున్నారు. ఎందుకలా చూసుకుంటున్నారో అర్థంకాక ఇంద్రనీల్‌.. వైదేహి వైపు చూశాడు. సిబ్బందిలో ఒకరు ‘మీరు ప్రొఫెసర్‌ సత్యారావు స్టూడెంట్‌ కదా!’ అని అడిగాడు. అవును అని గర్వంతో ఇంద్రనీల్‌ సమాధానమిచ్చాడు.

‘క్షమించాలి, మీ దర్శనం రద్దయింది. మీ కోసం మీ స్టాఫ్‌ వెయిట్‌ చేస్తున్నారు.  వైదేహిగారు  మాత్రం దర్శనానికి  వెళ్లొచ్చు’ అని చెప్పాడు. ఈ  అనూహ్య పరిణామానికి ఇంద్రనీల్‌ స్థాణువైపోయాడు. గొంతు పూర్తిగా తడారిపోయింది. మంచినీళ్ళు తాగితేగానీ మాట్లాడే పరిస్థితి లేదు. గుండెవేగం హెచ్చయి, శ్వాస అందనట్లుగా అనిపించింది.

వైదేహేమో.. తనకు 50వ దర్శనం పూర్తి కావస్తున్నందుకు స్వామివారి దర్శనానికి వెళ్ళాలో లేక ఇంద్రనీల్‌కు తోడుగా వుండిపోవాలో తెలియని త్రిశంకు స్వర్గంలో వుంది. అక్కడ ప్రొఫెసర్‌ సత్యారావు పీఏ కేశవ్, అంబులెన్స్‌ డ్రైవర్‌ వాసుదేవరెడ్డి ప్రత్యక్షం కావటంతో ఇంద్రనీల్‌ వారి కళ్ళల్లోకి సూటిగా చూడగానే వాళ్ళు వణికిపోయారు. కొంచెం మంచినీళ్ళు తాగి తమాయించుకొని వైదేహిని దర్శనం వైపు సాగమని సైగ చేశాడు ఇంద్రనీల్‌.

‘సర్‌..  తమిళనాడు, కృష్ణగిరి నుండి ఓ క్వారీ కార్మికుడిని మన ఆసుపత్రికి తీసుకొస్తున్నారు. అతను చావుబతుకుల్లో ఉన్నాడు. డ్యూటీ  డాక్టర్‌ దుష్యంత్‌బాబుకేమో  జ్వరం. కృష్ణగిరి నుంచి వస్తున్న పేషంట్‌కేమో వెంటనే ట్రీట్‌మెంట్‌ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే సత్యారావు అయ్యగారు.. మిమ్మల్ని దర్శనం రద్దుచేసుకొని వెంటనే రమ్మాన్నారు సర్‌..’ అంటూ ఆగాడు కేశవ్‌. 

‘సెల్‌ఫోన్‌లో మిమ్మల్ని సంప్రదించడానికి అయ్యగారు ప్రయత్నించారు. నిన్నటి నుండి స్విచ్ఛాఫ్‌ వస్తోంది మీ ఫోన్‌’ అనీ  వివరించాడు. పూర్వజన్మ పాపమేదో తనను వెంటాడి స్వామివారి దర్శనం దూరం చేస్తున్నట్లు భావించసాగాడు ఇంద్రనీల్‌. నూటొక్క దర్శనాల లక్ష్యంలో ఎంత కష్టపడ్డా ఒక్కటంటే ఒక్కటేసారి స్వామివారిని దర్శించుకునే వీలయింది. ఎల్‌2 టికెట్‌ ప్రొఫెసర్‌ మంజూరు చేసినందున ఇక చేసేదేమీ లేక వారిని అనుసరించాడు ఇంద్రనీల్‌.  

అంబులెన్స్‌లో కొండ దిగుతుండగానే పేషంట్‌ ట్రీట్‌మెంట్‌  కోసం నర్సింగ్‌ సిబ్బందిని అప్రమత్తం చేశాడు ఇంద్రనీల్‌. ఆచార్యులపై గల కోపం, దర్శనం కాలేదన్న నిస్పృహ పేషంట్‌ పై గానీ, పేషంట్‌  కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు గానీ చూపకూడదని ముందుగానే నిశ్చయించుకున్నాడు అతను. పేషంట్‌  పరిస్థితి విషమంగా వుంది. అపస్మారక స్థితిలో వుండి, నాడీ దొరక్కపోవటమే గాక బీపీ కూడా రికార్డు కావటం లేదు. ఐసీయూలో వుంచి చికిత్స చేశాడు.

అవసరమైతే వెంటిలేటర్‌ మీద వుంచాల్సి వస్తుందని పేషంట్‌ బంధువులకు వివరించాడు. తర్వాత కొన్నిరోజులకు లైబ్రరీలో జర్నల్స్‌ చదువుతుండగా ప్రొఫెసర్‌ సహాయకుడు కేశవ్‌ వచ్చి ప్రొఫెసర్‌ సత్యారావు తన చాంబర్‌కు రమ్మన్నాడని చెప్పటంతో ఇంద్రనీల్‌ బయలుదేరాడు. గది ముందు పదిమంది దాకా జనం పోగైవున్నారు. ట్రీట్‌మెంట్‌లో ఏదో లోపంతో పేషంట్‌ చనిపోయి వుంటాడని, గొడవేదో జరగబోతున్నట్లు ఇంద్రనీల్‌ మనసు భయపడుతోంది.

గుండె వేగంగా కొట్టుకోవటం మొదలయింది. లోపలికి వెళ్ళగానే ప్రొఫెసర్‌ సత్యారావు ఇంద్రనీల్‌కు ఒక వ్యక్తిని చూపిస్తూ ‘ఇతన్ని గుర్తుపట్టారా?’ అని అడిగాడు. ఇంద్రనీల్‌ ‘గుర్తుపట్టలేదు సర్‌’ అని జవాబిచ్చాడు. ‘‘వీరిలో ఎవరినైనా గుర్తుపట్టగలరా’’ అని ఆయన కుటుంబ సభ్యులను చూపిస్తూ మళ్ళీ చిరునవ్వుతో అడిగాడు సత్యారావు.  ‘నేనయ్యా వెంకటేశాన్ని’ అని ఆ వ్యక్తి ఇంద్రనీల్‌ కాళ్ళమీద పడి ఏడుస్తున్నాడు. అతనితో పాటు ఆయన భార్యాపిల్లలు ఇంద్రనీల్‌ కాళ్ళు మొక్కబోతుండగా వద్దని వారించాడు ఇంద్రనీల్‌. 

 ‘ఆ రోజున మీరు సమయానికి రాకుంటే నేనేమయ్యేవాడినయ్యా..! ఆ రోజు పొద్దున్నే ఇంకా నిద్రలో ఉండగానే.. వున్నట్లుండి తలలో పిడుగుపడినట్లు నొప్పి మొదలైందయ్యా! ఆ వెంటనే కుడికాలు, చేయి కదల్లేదు. మా ఆవిడకు చెబుదామంటే నోట మాట పెగల్లేదు. అటు ఇటు కదిలి ఎలాగోలా మా ఆవిడను నిద్రలేపాను. ఏదో జరుగుతోందని, నేను బతికేలా లేననిపించింది.   నేను చనిపోతే నా ముగ్గురు ఆడపిల్లలకు దిక్కెవరు? వాళ్ళను పెంచేదెవరు? పెళ్ళి చేసేదెవరు? అన్న దిగులు పట్టుకుంది.

పిల్లల పెళ్ళిల్లయ్యేవరకు బతికించి ఆ మరుక్షణమే నన్ను తీసుకెళ్ళమని భగవంతుని మొక్కుకున్నా. నా అనారోగ్యం గురించి మా ఆవిడ మా క్వారీ యజమానికి చెప్పింది. అతను వెంటనే వచ్చి నన్ను ఆసుపత్రిలో చేర్పించాడు. ఆడపిల్లలు వున్నారు, ఎలాగైనా ప్రాణం కాపాడమని సత్యారావు దొరకు పదే, పదే దారి పొడవునా ఫోన్‌ చేశాడు. వైద్యానికి ఎంతైనా భరిస్తానని భరోసా ఇచ్చాడు.

సమయానికి మీరు వచ్చి వైద్యం  చేశారయ్యా! నా వేలికున్న స్వామి వారి ఉంగరం చూసి, మీ వేలికున్న స్వామివారి ఉంగరాన్ని చూపించి స్వామి పంపితేనే నేను వచ్చానని మీరు చెప్పినప్పుడు నాకు  ధైర్యం చెబుతున్నారే తప్ప నిజమనిపించలేదు. కానీ మీరు చెప్పిందే నిజమై ప్రాణాలతో బయటపడ్డా.  మోకాళ్ళపై కొండ ఎక్కి స్వామివారి దర్శనం చేసుకుంటానని మొక్కుకున్నానయ్యా. కొండపై దేవుడ్ని చూశాక కొండ కింద దేవుడంతటి మీ దర్శనం కూడా చేసుకోవాలని  వచ్చానయ్యా! మీకు ఏమిచ్చినా ఋణం తీరదు’  అంటూ స్వామివారి ప్రసాదం, చిత్రపటం ఇంద్రనీల్‌కు అందించాడు. ఇంద్రనీల్‌ కన్నీళ్ళు జాలువారి వెంకటేశం చేతుల మీద పడ్డాయి.

 ‘స్వామి పట్ల మీ అచంచల భక్తి.. స్వామిని పలుమార్లు చూడాలన్న దర్శనవాంఛ నాకు తెలుసు ఇంద్రనీల్‌’ అన్నాడు ప్రొఫెసర్‌ సత్యారావు.  ఆ మాటకు ఇంద్రనీల్‌ ఆశ్చర్యపోయాడు.  ‘భగవద్గీతలో కృష్ణపరమాత్ముడు చెప్పినట్లుగా మనం లేని కాలమే లేదు. అయితే వర్తమానంలో మనుషులను స్వస్థపరచే అత్యున్నతమైన వృత్తిలో ఉన్నాం. ఇంక ఇంతకంటే ఉన్నత స్థితి లేదు.

తలచుకుంటే మీరు, నేను ప్రతిరోజు స్వామి వారిని దర్శించుకొని ఆనందపడవచ్చు. మనం ఎన్నిమార్లు దర్శించుకోవటం కన్నా ఎంతమందికి వ్యాధులను నయం చేసి వాళ్లను స్వామివారి దర్శనానికి పంపి వాళ్ల కళ్లతో మనం స్వామిని దర్శించుకున్నామనేదే నా లెక్క. స్వామివారు కాంక్షించేది కూడా అదే. నేను మీకిచ్చిన ప్రసాదాలు నేను దర్శనానికి వెళ్ళి తెచ్చినవి కావు, ఇలాగే ఆరోగ్యం మెరుగైన వాళ్లు  స్వామివారి దర్శనానికి వెళ్ళి తెచ్చినవి’ అని చెప్పాడు ప్రొఫెసర్‌ సత్యారావు. 

ఇన్నాళ్లు తను ప్రొఫెసర్‌ను అపార్థం చేసుకున్నందుకు బాధపడ్డాడు ఇంద్రనీల్‌. కళ్ళల్లో నీటిపొర కమ్ముకోవడంతో ప్రొఫెసర్‌ సత్యారావు అస్పష్టంగా కనిపించసాగారు. రెండడుగులు ముందుకు వేసి ప్రొఫెసర్‌ పాదాలవైపు వంగేసరికి కన్నీటి చుక్కలు ప్రొఫెసర్‌ పాదాలపై జాలువారి స్పష్టంగా కనిపించిన అతని కాళ్లకు ప్రణమిల్లాడు.  నూటొక్క మార్ల దర్శనం కన్నా నూటొక్క రోగులను బాగుచేసి స్వామి వారి దర్శనానికి పంపటమే తక్షణ కర్తవ్యంగా నిర్ణయించుకొని ఇంద్రనీల్‌ తిరిగి గ్రంథాలయం వైపు అడుగులేశాడు.

-డా. వి.ఎన్‌. మాధవరావు 

చదవండి: ఈవారం కథ: తమ తమ నెలవులు.. లండన్‌ వెళ్లిన భర్త.. ఆమె పరిచయం ఎక్కడికి దారితీసింది?
  

Advertisement
 
Advertisement
 
Advertisement