
కొంత వయసు దాటాక పొట్ట కాస్త ముందుకొచ్చి కనిపిస్తుంది. దీనికి కారణం వయసు పెరుగుతున్న కొద్దీ దేహంతో పాటు మిగతా శరీర భాగాల్లో కొవ్వు కణాలు పేరుకుపోతూ ఉండటం. మధ్యవయసు దాటాక వయసుతో పాటు దేహంలో కొవ్వు కూడా ఇలా పెరుగుతూ, పేరుకుపోతూ ఉంటుంది. ఇది కేవలం బయటకు కనిపించే పొట్ట భాగంలోనే కాదు... ఇలా కొవ్వు కాలేయంలోని నార్మల్ కణాల్లో కూడా పేరుకుపోతూ ఉండవచ్చు.
ఇలా జరగడాన్ని ఫ్యాటీ లివర్‌గా పేర్కొంటారు. అప్పుడు కాలేయం తాలూకు సహజ ఆకృతి, దాని స్వాభావికమైన రంగులో మార్పురావచ్చు. క్రమంగా అది కాస్త గట్టిగాగానీ లేదా జిగురుజిగురుగా, పచ్చరంగుకు మారవచ్చు. ఆ కండిషన్‌నే సిర్రోసిస్ అంటారు. కొన్నిసార్లు దేహంలోకి చాలా ప్రమాదకరమైన విషాలు (టాక్సిన్స్) ప్రవేశించడం వల్ల గానీ, కొన్ని వ్యాధులు లేదా ఇన్ఫెక్షన్స్ వల్లగానీ లేదా తగినంత ఆహారం తీసుకోకుండా ప్రతిరోజూ మితిమీరిన ఆల్కహాల్ తాగుతుండటం వల్ల కూడా సిర్రోసిస్ రావచ్చు.
రక్తనాళాలు సాలీడు ఆకృతిలో ఎందుకు కనిపిస్తాయంటే...
ఇలా కాలేయంలో కొవ్వు పేరుకుంటూ, దాని సహజ ఆకృతి, రంగు దెబ్బతింటున్నప్పుడు చర్మంలోంచి రక్తనాళాలు సాలీడు ఆకృతిలో బయటకు కనిపించవచ్చు. అంతేకాదు... ఆకలి లేక΄ోవడం, నీరసం, నిస్సత్తువ, పొట్టలో నీరు చేరడం, కళ్లు పసుపురంగులో ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇలాంటప్పుడు తప్పక డాక్టర్‌ను సంప్రదించాలి.
నిర్ధారణ ఇలా....
పైన పేర్కొన్న లక్షణాలు కనిపిస్తుంటే డాక్టర్‌లు లివర్ ఫంక్షన్ టెస్ట్ వంటి కొన్ని పరీక్షలు చేసి కాలేయం పనితీరు తెలుసుకుంటారు. కాలేయం పనితీరు బాగుంటే ఆందోళన అక్కర్లేదు. ఫ్యాటీలివర్ ప్రాథమిక దశలో ఉన్నా అంతగా ప్రమాదం ఉండదు. ఇలా పొట్ట ముందుకు వస్తున్నవారు స్థూలకాయాన్ని, బరువు పెరగడాన్ని నియంత్రించుకోవాలి.
మద్యం పూర్తిగా మానేయాలి. అన్ని రకాల పోషకాలు అందేలా... ముఖ్యంగా విటమిన్ బి లాంటి పోషకాలు అందేలా మంచి ఆహార నియమాలు పాటించాలి. రోజూ కొద్దిగా వ్యాయామం చేయాలి. ఇలా ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరిస్తూ ఉంటే కొద్దిపాటి మందులతోనే కాలేయం ఆరోగ్యం మెరుగవుతుంది.
సాధారణంగా కాలేయం తనలో దెబ్బతిన్న భాగాన్ని తానే బాగుచేసుకుంటుంది. అలా ఒకసారి అది తనను రిపేర్ చేసుకోలేనంతగా దెబ్బతింటే మాత్రం కాలేయ మార్పిడి తప్ప మరొక ప్రత్యామ్నాయం ఉండదు. అందుకే మధ్యవయసు వాళ్లు కాలేయంపై శ్రద్ధ చూపడం అవసరం.
డాక్టర్ చలపతిరావు ఆచంట, సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్
(చదవండి: గుండెదడ ఎందుకొస్తుంది..? ఆరోగ్యానికి ప్రమాదకరమా..?)