ఒరేయ్‌ ఆజామూ.. లగెత్తరోయ్‌! | Edward the robot sparks India fun viral | Sakshi
Sakshi News home page

ఒరేయ్‌ ఆజామూ.. లగెత్తరోయ్‌!

Apr 16 2026 7:58 AM | Updated on Apr 16 2026 11:35 AM

Edward the robot sparks India fun viral

సమయం: ఉదయం 10 గంటలు.. స్థలం: మన దేశంలోనే కానీ కచ్చితంగా తెలియదు.. కనుచూపు మేర నుంచి తమవైపే కదలి వస్తున్న ఓ మరమనిషిని చూసి కోళ్లు ‘‘కొకొక్కొ..’’ అంటూ చెల్లాచెదురయ్యాయి. దూరంగా వీధి కుక్కలు.. ఇదేందయ్యా ఇది అన్నట్లు ఓ చూపు చూసి దౌడు అందుకున్నాయి. ఎవడ్రా వీడు ఇలా ఉన్నాడు.. అంటూ వీధుల వెంట జనం ఆశ్చర్యపోతూ ఆ దృశ్యాన్నే చూస్తున్నాడు.

..ఇదేదో కొత్త గేమ్‌ క్యారెక్టర్‌లా ఉందే అంటూ ఓ చిన్నారి తన తల్లితో చెబుతూ చప్పట్లు కొడుతూ మురిసిపోతోంది. కాస్త దూరంలో ఉన్న అధికారులు, సిబ్బంది.. ‘హమ్మయ్యా.. వీధుల్లో, గల్లీల్లో తిరిగే జంతువుల్ని కంట్రోల్‌ చేయడానికి మేం రోడ్డెక్కాల్సిన రావాల్సిన అవసరం లేదు’ అంటూ తెగ సంబరపడిపోయ్యారు. అధికారుల్లో ఒకరు మైక్‌ అందుకుని.. ‘‘ఇది ఒక రోబో. పేరు ఎడ్వర్డ్‌.. ఇక నుంచి వీధుల్లో, రోడ్ల మీద జంతువుల్ని తరమి కొడుతుంది. మీరేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు’’ అంటూ అనౌన్స్‌ చేశారు. ఇది ఇంకా ఏం చేస్తుందా? అని స్థానికులు గుమిగూడి చూస్తున్నారు. ఈలోపు.. 

నడిరోడ్డులో డివైడర్‌కు కాస్త పక్కనే హాయిగా రెస్ట్‌ తీసుకుంటూ నెమరేస్తున్న ఆవు దగ్గరికి వెళ్లింది ఆ రోబో. ఆవు మాత్రం కదలకుండా ‘‘ఇప్పుడు నిన్ను చూసి భయపడలా?’’ అన్నట్టుగా ఓ చూపు చూసి తన పనిలో తాను ఉండిపోయింది. పాపం ఆ పిచ్చి యంత్రుడు ‘‘ఉషూ.. ఉషూ.. చో’’ అన్నట్లు ఎన్ని సైగలు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈలోపు పారిపోతున్న కోళ్లు, వీధి కుక్కలు ఆ సీన్‌ చూసి ఆగిపోయాయి. పైకి నిలబడిన ఆ ఆవును చూసి కేజీఎఫ్‌లో రాకీభాయ్‌లా ఊహించేసుకున్నాయి. 

ఆవు వెంట కలిసిన ఆ జంతువులు ఆ రోబోను, తమను తరిమేందుకు వచ్చిన అధికారులను రోడ్ల వెంట పరుగులు పెట్టించాయి. ‘‘ఒరేయ్‌ ఆజామూ.. లగెత్తరోయ్‌’’ అంటూ అధికారులు.. ‘‘రేయ్‌.. ఎవర్రా మీరంతా’’ అంటూ ఎడ్వర్డ్‌ చెరో వైపు పారిపోయారు.  

పాపం ఎడ్వర్డ్‌ వార్చోకి(Edward Warchocki).. పోలాండ్‌లోని వార్సా నగరంలో ఒక హ్యూమనాయిడ్ రోబోట్(Unitree G1 humanoid robot). వీడు ఈ మధ్యే  అడవి పందుల గుంపును వెంబడించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. వినోదం కోసం చేసిన ప్రదర్శన మాత్రమే అయినా స్థానికులు దీనిని ఆసక్తిగా చూశారు. ఈ దృశ్యం "సై-ఫై సినిమా"లా కనిపించడం వల్ల సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అయింది.

కొందరు దీనిని కేవలం మార్కెటింగ్ స్టంట్ అని, మరికొందరు భవిష్యత్తు టెక్నాలజీకి సంకేతం అని భావిస్తున్నారు. మన దేశానికి వస్తే మాత్రం ఎడ్వర్డ్‌గాడి పరిస్థితి పైన చెప్పుకున్నట్లే ఉంటుందని కొందరు సెటైర్ల రూపంలో కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement