Dr. Neelima Arya: ‘షి నీడ్స్‌’ నీలిమ! | Sakshi
Sakshi News home page

Dr. Neelima Arya: ‘షి నీడ్స్‌’ నీలిమ!

Published Sat, Nov 25 2023 12:16 AM

Dr Neelima Arya about Women Need - Sakshi

ఉరుకుల పరుగుల జీవితంలో మన ప్రయాసలే కనిపిస్తాయి. ఒకసారి ఆగి చుట్టూ చూస్తే.. ఇన్నాళ్లూ మనం మన కోసమే తప్ప చుట్టూ ఉన్న వారి సమస్యలను ఏ మాత్రం పట్టించుకోవడంలేదనే స్పృహ కలుగుతుంది. కొందరు మనకెందుకులే అని మళ్లీ తమ పనుల్లో మునిగిపోతారు. డాక్టర్‌ నీలిమా ఆర్య లాంటివాళ్లు మాత్రం సున్నితమైన సమస్యలపై దృష్టి పెట్టి వాటికి సరైన పరిష్కారాలు వెదుకుతారు.

హైదరాబాద్‌ వాసి నీలిమా ఆర్య  నిరుపేద అమ్మాయిలకు లో దుస్తులను అందిస్తూ, శుభ్రతపైన అవగాహన కల్గిస్తూ వారి భవిష్యత్తు ఆరోగ్యంగా ఉండేందుకు కృషి చేస్తున్నారు. ఏడాదిలో రెండు లక్షల మంది అమ్మాయిలకు లో దుస్తులను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న నీలిమా ఆర్యను కలిసినప్పుడు ఆమెకు వచ్చిన ఈ ఆలోచన గురించి ఇలా పంచుకున్నారు.

‘‘మా సొంతూరు బాపట్ల. అమ్మానాన్నలకు పెద్ద కూతురిని. ఇంగ్లీష్‌ లిటరేచర్‌లో మాస్టర్స్‌ చేశాను. మా నాన్నగారు ఆర్మీ ఉద్యోగి కావడంతో నా చదువు అంతా ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా భోపాల్‌లో జరిగింది. చదువు పూర్తయ్యాక హైదరాబాద్‌ వచ్చాం. ఇక్కడ పదేళ్లపాటు ఇంగ్లిష్‌ లెక్చరర్‌గా వర్క్‌ చేశాను. ఆ తర్వాత తిరిగి భోపాల్‌కి వెళ్లాను.

అక్కడ నుంచి సౌదీ గవర్నమెంట్‌కు ఆంగ్ల ప్రొఫెసర్‌గా వర్క్‌ చేశాను. ఆరేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి, మీడియా రంగంలో ఉండటంతో చాలా సామాజిక సమస్యలు నా దృష్టికి వచ్చాయి. సమాజానికి నా వంతుగా ఏదైనా చేయాలనే తపన అప్పుడే మొదలైంది. అమ్మానాన్నల దేశ సేవ స్ఫూర్తి కూడా నాలో ఉండటం అందుకు కారణమై ఉంటుంది.  

► ఐదు ప్రాజెక్ట్స్‌తో సేవా రంగం
ఐదేళ్ల క్రితం ఐదు ప్రాజెక్ట్స్‌తో ‘యాపిల్‌ హోమ్‌ రియల్‌ నీడ్‌ ఇండియా’ ఫౌండేషన్‌ను ప్రారంభించాను. దీంట్లో భాగంగా ఎవరూ ఆకలితో పడుకోకూడదు అనే ఆలోచనతో మొదటిది ఫీడ్‌ ద నీడ్‌ ప్రాజెక్ట్‌ చేశాను. రోడ్‌సైడ్‌ ఫ్రిడ్జ్‌లను ఏర్పాటు చేసి, నిరుపేదలకు ఆహారం అందేలా ఏర్పాటు చేశాం. ఆ తర్వాత ‘షీ నీడ్‌’ ద్వారా ముఖ్యంగా గ్రామీణ అమ్మాయిలకు, మహిళలకు శానిటరీ ప్యాడ్స్‌ ఉచితంగా అందజేశాం.

‘మిషన్‌ భద్రత’ పేరుతో ఒక్కో సెట్‌లో ఆరు నాణ్యమైన ఫ్యాబ్రిక్‌తో తయారుచేసిన లో దుస్తులను ఉంచి, ఏడాది నుంచి నిరుపేద అమ్మాయిలకు అందజేస్తున్నాం. వచ్చే ఏడాది వరకు రెండు లక్షల మంది అమ్మాయిలకు లో దుస్తులను అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రముఖ డిజైనర్‌ రవిత మేయర్‌ ఈ లో దుస్తులను డిజైన్‌ చేస్తున్నారు. కొన్ని సేవాసంస్థల సహకారంతో ఇండియా మొత్తంలో ఎవరికి అవసరం ఉందో గుర్తించి, వారికి లో దుస్తులను అందజేస్తాం. వీటితర్వాత రైతులు, నిరుద్యోగులు, వయసుపైబడినవారి కోసం సాయం అందించాలనేది మా ఉద్దేశ్యం.

► లో దుస్తుల ప్రాముఖ్యత..
నిరుపేదలను దృష్టిలో పెట్టుకొని, వారికి అత్యవసరంగా కావాల్సినవి ఏమిటి అనే ఆలోచనలు ఎప్పుడూ చేస్తుంటాం. షీ నీడ్‌ ప్రాజెక్ట్‌ లో భాగంగా భవన నిర్మాణాలు జరిగే చోట, స్లమ్స్‌లలో, కూలీల పిల్లలను చూసినప్పుడు వారికి లో దుస్తుల సమస్య ఉన్నట్టు గుర్తించాం. 3 నుంచి 13 ఏళ్ల అమ్మాయిల వరకు లో దుస్తుల గురించి సరైన అవగాహన చేయగలిగితే వారిలో పునరుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.

దీనిద్వారా భవిష్యత్తు తరాలకు మెరుగైన ఆరోగ్యాన్ని అందించగలం. అలాగే, శానిటరీ ప్యాడ్స్‌ వాడాలన్నా సరైన లో దుస్తులు ఉండాలి. నిజానికి గ్రామీణ అమ్మాయిలు, మహిళలకు సురక్షితమైన శానిటరీ ప్యాడ్స్, లో దుస్తులు అందుబాటులో ఉండవు. ఇంట్లో మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఆ ఇల్లు క్షేమంగా ఉంటుందనే విషయాన్ని మనం విస్మరించకూడదు. ఈ విషయాన్ని పదే పదే ఆ కుటుంబాలకు తెలియజేయడానికి కూడా ఈ మార్గాన్ని ఎంచుకున్నాం.

►సాధికారతలో భాగంగా..
ఆర్య రసోయి–క్లౌడ్‌ కిచెన్‌ ద్వారా శాకాహార, మాంసాహార వంటకాలను అందిస్తున్నాను. ఎడ్యుకేటర్‌గా, అడ్మినిస్ట్రేటర్‌గా, ఆంట్రప్రెన్యూర్‌గా, ఇద్దరు పిల్లల తల్లిగా నా బాధ్యతలు కొనసాగిస్తూనే సమాజానికి నా వంతు సహకారాన్ని అందించాలనే లక్ష్యంతో కొనసాగతున్నాను.  ధనం కన్నా ముందు జీవితాన్ని క్రమశిక్షణాయుతంగా మలుచుకోవడంలోనే విజయం దాగుంది అని నమ్ముతాను. ఆ క్రమశిక్షణే నన్ను నడిపిస్తుందని నమ్ముతాను’ అని వివరించారు నీలిమా ఆర్య.

– నిర్మలారెడ్డి

Advertisement
Advertisement