ఒక్కోసారి మనకు తగిలిన దెబ్బలే విజయపథంవైపు అడుగులు వేయిస్తాయి. మన అభిరుచులు, కోరికలే మన జీవితంలోఊహించని సక్సెస్‌కు బాటలు వస్తాయి.ముంబైకు చెందిన జంట సక్సెస్ స్టోరీ కూడా అలాంటిదే.
బెంగళూరుకు చెందిన అఖిల్, శ్రీయ దంపతులు ముంబైలో మొదట్లో కొన్ని కంపెనీల్లో ఉద్యోగాలు చేసుకుంటూ అరకొర జీతాలతో నెట్టుకొచ్చేవారు. దీంతో ఏదైనా వ్యాపారం చేయాలనే ఆలోచన ఇద్దరిలోనూ బాగా ఉండేది. అఖిల్ అయ్యర్, శ్రియ నారాయణకు కర్ణాటకలోని దావణగిరె దోసెలంటే పిచ్చి ప్రేమ. దాన్ని తమ స్నేహితులకు రుచి చూపించారు. మంచి స్పందన లభించింది. అంతే వ్యాపార ఆలోచనకు పదును పెట్టారు. ఆ అభిరుచి, పట్టుదలకు కృషి తోడైంది. అలా ఎంబీఏలు, ఐఐటీలు లేకుండానే నెలకు కోటి రూపాయలు సంపాదించే స్థాయికి ఎదిగారు.
ఎలాంటి పెట్టుబడి దారులు, ఫుడ్ ఇండస్ట్రీలో అనుభవం లేకుండానే బాంద్రాలో ఒక చిన్న కేఫ్‌ను ప్రారంభించారు. కేవలం 12 సీట్లతో కెఫే మొదలైంది. మెల్లిగా మంచి పేరు తెచ్చుకుంది. తాజా దోసెకు తోడు రుచికరమైన చట్నీ ఇంత కంటే ఏం కావాలి. స్పందన అఖండంగా మారిపోయింది. త్వరలోనే, నగరం నలుమూలల నుండి ప్రజలు బెన్నే దోసెల రుచి చూడటానికి అవుట్‌లెట్ వెలుపల బారులు తీరారు. నేడు ప్రతీ రోజుకి 800కు పైగా దోసెలమ్మే స్థాయికి వారి బిజినెస్ వృద్ధి చెందింది. ఒక్కో దోసె ధర రూ. 250 నుండి రూ. 300 వరకు ఉంటుంది. ఫలితంగా నెలకు రూ. 1 కోటి సంపాదన ఆర్జించే వ్యాపారంగా మారింది.

దోసె టేస్టే పెద్ద సక్సెస్
ఫ్యాన్సీ ఇంటీరియర్స్ లేదా సెలబ్రిటీ ఎండార్స్‌మెంట్‌లేవీ లేవు. ఒక చిన్న ప్రాంతాన్ని అద్దెకు తీసుకుని దానిని క్లౌడ్ కిచెన్‌లా మార్చారు. తమ కలల కేఫ్ అయిన బెన్నేగా పేరుపెట్టుకున్నారు. శుభ్రత, నిజమైన రుచి, తాజా వంటలు ఆహార ప్రియులకు తెగ నచ్చేశాయి. ఆ నోటా ఈ నోటా కేవలం మౌత్ పబ్లిసిటీ ద్వారా మంచి గిరాకీ వచ్చింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల ద్వారా ఈ రెస్టారెంట్ ఖ్యాతి పెరిగింది. ముఖ్యంగా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ , అనుష్క జంట 2024లో బెన్నే కేఫ్‌ను సందర్శించి ఆహా అని అరగించారు. ఇంకా రోహిత్‌శర్మ లాంటి ప్రముఖుల మనసు దోచుకుందీ బెన్నే దోసె ఇంకా దీపికా పదుకొనే, రణవీర్ సింగ్, రాజ్‌కుమార్ రావు, శ్రద్ధా కపూర్ , దియా మీర్జా వంటి ప్రముఖులు విరాట్ జంటతో కలిసి కన్నడ బెన్నే దోసెలమీద మనసు పారేసుకున్నవారే. అంతేకాదు సోషల్‌మీడియా ద్వారా బాగా ప్రచారం చేసుకున్నారు. రీల్స్ ద్వారా మంచి ఆదరణను పెంచుకున్నారు.

ఇక్కడ అన్ని రకాల దోసెలతో పాటు, ఇడ్లీ, ఇతర సౌత్ ఇండియన్ టిఫిన్లు, కాఫీ కూడా ప్రత్యేకమే. కాగా శ్రియ నారాయణ్ , అఖిల్ అయ్యర్ దంపతులు ముంబైలో ‘బెన్నే, బెంగళూరు హెరిటేజ్’ గోవాలో ‘బెన్నే బ్రాంచ్‌లను నిర్వహిస్తున్నారు. అన్నట్టు అఖిల్ ఒకప్పుడు సినిమా నిర్మాత. కాగా ఆమె మనస్తత్వవేత్త.



