
తొలి వేతనం.. జీవిత ప్రయాణంలో ఒక కీలక మైలురాయి. ఆర్థిక స్వాతంత్య్రం, ఒక బాధ్యత, కుటుంబ సమిష్టి ప్రయాణానికీ సూచిక. అంతటి ప్రత్యేకత ఉన్న తొలి జీతం అందుకున్న రోజు కోట్లాది మందికి భావోద్వేగ ఘట్టం. ఒక్కొక్కరు ఒక్కో తీరుగా ఈ వేడుకను జరుపుకొంటారు. ఇంట్లో వాళ్లకు, బంధువులు, స్నేహితులు, సహచరులకు స్వీట్లు పంచేవారు కొందరైతే తొలి సంపాదనతో తమ వాళ్లకు బహుమతులను అందించేవారు మరి కొందరు. తొలి వేతనం రాగానే ‘అమ్మా.. జీతం పడింది’ అంటూ జన్మనిచ్చిన తల్లితో సంతోషం పంచుకునేవారే ఎక్కువని యాడ్ ఏజెన్సీ ‘రీడిఫ్యూజన్, లక్నో యూనివర్సిటీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ‘భారత్ ల్యాబ్’ తాజా సర్వేలో వెల్లడించింది.
చిన్న నగరాల నుంచి..
‘నా తొలి వేతనం’ పేరుతో నిర్వహించిన సర్వేలో దేశవ్యాప్తంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు చెందిన 2,125 మంది యువ ఉద్యోగులు పాలుపంచుకున్నారు. 1997–2012 మధ్య జన్మించిన ఈ జెన్–జీ తరం వాళ్లు.. మొదటి నెల జీతాన్ని ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు, ఎలా ఆదా చేస్తున్నారు అన్న అంశాలను లోతుగా అధ్యయనం చేశారు. సర్వేలో పాల్గొన్నవారిలో కొందరు ప్రధానంగా కుటుంబ సభ్యులకు గిఫ్టులు అందించి తమ కృతజ్ఞతను చూపారు.
కొంత మొత్తాన్ని ఆదా చేయడం ద్వారా.. పెరుగుతున్న ఆర్థిక దూరదృష్టికి నిదర్శనంగా నిలిచారు మరికొందరు. విరాళాలు ఇచ్చి తమలో స్వార్థం లేదని ఇంకొందరు నిరూపించారు. ప్రతి రూపాయి లెక్కించే కుటుంబాలకు ఇవన్నీ భావోద్వేగాలతో ముడిపడిన అంశాలే. ‘మొదటి జీతం.. ఒక స్వాతంత్య్ర ప్రకటన. ముఖ్యంగా మహిళలకు ఒక నిశ్శబ్ద విప్లవం’ అంటారు భారత్ ల్యాబ్ కో–చైర్మన్, రీడిఫ్యూజన్ చైర్మన్ సందీప్ గోయల్.
ముందుగా అమ్మకు..
తొలి వేతనం అందుకున్న మరుక్షణమే 44.6% మంది ఆ సంతోషాన్ని తొలుత అమ్మతో పంచుకుంటున్నారు. 28.6% మంది తండ్రికి, 16.1% మంది జీవిత భాగస్వామికి, 10.7% మంది తోబుట్టువులకు సమాచారం ఇస్తున్నారు. తరాలు మారుతున్నా.. సామాజిక పరిస్థితులు మారుతున్నా.. కుటుంబ బంధాలకు ఇచ్చే విలువను ఇది సూచిస్తుందని నివేదిక వివరించింది.
ఇంటికి తమవంతు ఆర్థిక సహకారంగా గత తరాలు భావిస్తే.. నేటి జెన్‌జీ తరం మహిళల్లో 88.5% మంది తమ మొదటి జీతాన్ని స్వాతంత్య్రంగా అభివర్ణించారు. ఆర్థిక స్వాతంత్య్రం మహిళల ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది అనడానికి ఈ ప్రకటనే నిదర్శనం. స్వాతంత్య్రంతో పాటు ఇంటికి అందించాల్సిన బాధ్యత అని 41.2% మంది పురుషులు భావించారు.
దానంలోనూ, పొదుపులోనూ మహిళలే
మొదటి జీతాన్ని పొదుపు, దానం చేయడంలో.. రెండింటిలోనూ పురుషుల కంటే మహిళలే ముందుండటం విశేషం. మొత్తంగా 24.5% మంది తొలి జీతాన్ని జాగ్రత్తగా పొదుపు చేశారు. అత్యవసర నిధిని ఏర్పాటు చేయడం, తదుపరి విద్యకు సిద్ధం కావడం లేదా కష్ట సమయాల్లో కుటుంబాన్ని పోషించడం వంటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని పొదుపునకు ప్రాధాన్యత ఇచ్చారు. విడివిడిగా చూసినప్పుడు.. 50% మంది మహిళలు పొదుపు చేస్తే, పురుషుల్లో ఈ సంఖ్య 32.3% మాత్రమే.
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే..20.4% మంది తొలి జీతాన్ని దాతృత్వ కార్యక్రమాలకు వినియోగించారు. మతపర సంస్థలు, ఎన్‌జీఓలు లేదా నేరుగా అవసరంలో ఉన్నవారికి విరాళంగా ఇచ్చారు. భారత్‌లోని యువ సంపాదకులు సమాజ అభ్యున్నతి, శ్రేయస్సును అర్థం చేసుకుంటారని నిరూపించారు.
దానంలో మహిళలు 41.6% కాగా, పురుషుల్లో ఈ సంఖ్య 27.7% ఉంది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని యువతుల్లో ఆర్థిక వివేకం, సామాజిక బాధ్యత పెరుగుతోందని ఈ గణాంకాలు చెబుతున్నాయి.
తమవారికి కృతజ్ఞతగా..
తొలి వేతనం పొందిన సంబరాన్ని 38.8% మంది బహుమతుల ద్వారా పంచుకుంటున్నారు. గుర్తుండిపోయే రోజున తల్లుల కోసం ఆభరణాల నుండి తోబుట్టువులకు గ్యాడ్జెట్స్ వరకు.. తమ ప్రయాణానికి మద్దతుగా నిలిచిన వారికి గిఫ్టులతో కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
కిరాణా సామాగ్రి, ఫ్యాన్లు, యుటిలిటీ బిల్లుల వంటి వాటికి 12.2% మంది ఖర్చు చేశారు. తల్లిదండ్రుల అవసరాలకు 4.1% మంది తమ తొలి జీతాన్ని వెచ్చించారు. సర్వేలో పాల్గొన్నవారిలో 88.3% మంది తమ మొదటి జీతం అవసర ఖర్చులకు సరిపోతుందని చెబితే.. 11.7% మంది ఇబ్బందులు పడ్డట్టు తెలిపారు.
బంగారం కొంటున్నారు..
పుత్తడి మన జీవితాల్లో భాగం.. అదొక ఆర్థిక భరోసా. అందుకే, ఆభరణాలకు బదులుగా యువ మహిళా ఉద్యోగులు పసిడి కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. సర్వేలో పాల్గొన్నవారిలో మూడింట ఒక వంతు మహిళలు తమ తొలి జీతంతో బంగారం కొన్నారు.
భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, భారతదేశంలోని 76% యువత నెలవారీ పొదుపు (సిస్టమాటక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ సిప్) కంటే సౌకర్యవంత పెట్టుబడి విధానాలను ఇష్టపడుతున్నారని నివేదిక వెల్లడించింది. అదనపు ఆదాయం, పండుగ బోనస్‌లు వచ్చినప్పుడు టూర్స్ లేదా తమ కలల బైక్ కొనుగోలు వంటి వ్యక్తిగత లక్ష్యాలకు ఖర్చు చేస్తున్నారు. సంకెళ్ళు లేకుండా జెన్ –జీ తరం పొదుపుచేయాలనుకుంటున్నారు.
(చదవండి: అమ్మలకు ఆదాయ పన్ను మినహాయింపు..!)