
ఆసిఫ్ ఇమ్రాన్ ఖురేషి. ఇండోర్‌కు చెందిన వ్యక్తి. అతనొక కనస్ట్రక్షన్ లేబర్.. రాడ్లు, బీమ్‌లు కట్ చేసే పని. ఆ పనిలో కష్టం ఉంది. కానీ అతని జీవితంలో అంత కంటే కష్టం ఉంది. అయితేనేం.. 'కౌన్ బనేగా కరోడ్‌పతి-17 లో హాట్‌సీట్‌లో కూర్చునే అవకాశం వచ్చిన అతను.. రూ. 25 లక్షలు గెలుచుకున్నాడు.
కన్‌స్ట్రక్షన్ లేబర్‌గా చేస్తూ కేబీసీ హాట్ సీట్ వరకూ రావడమే ఒక ఎత్తైతే.. అక్కడ రూ. 25 లక్షలు గెలుచుకోవడం అతని పట్టుదలకు నిదర్శనం. కష్టాలు, కన్నీళ్లు అనేవి వస్తూ పోతూ ఉంటాయని, కష్టపడితే అదృష్టం మన వెంటే ఉంటుందని నిరూపించాడు. ఒకవైపు తన కూతుళ్లలో ఒక కుమార్తె వంశ పారం పర్యంగా వచ్చే రక్త హీనత సికిల్ సెల్ ఎనీమియా (Sickle Cell Anemia)తో బాధపడుతున్నా తాను నమ్ముకున్నా కష్టాన్ని ఎప్పుడూ వదల్లేదు. రోజుకి రూ. 2000 సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు.
దాంతో పని అధికం కావడం వల్ల ఒంటికి గాయాలు తరుచు అవుతూ ఉండేవి. కానీ అవేమీ అతన్ని ఆపలేదు. శారీరకంగా ఎంత గాయమైనా, మానసికంగా బలంగా ఉండటంతో తన పని పట్ల కచ్చితమైన నిబద్ధతో ఉండే వాడు. ఈ క్రమంలోనే కేబీసీ-17కి ఎంపికయ్యాడు. ఇక్కడ జ్ఞానం అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు అని కూడా రుజువు చేశాడు.
తాను చేసేది లేబర్ వర్కే అయినా కనీసం లోకజ్ఞానం ఉందని చాటుకున్నాడు. ఇప్పుడు రూ. 25 లక్షలు గెలుచుకున్న అసిఫ్ కళ్లల్లో ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఆ షోకి వచ్చిన మిగతా ఇద్దరు కూతుళ్లు తండ్రి విజయాన్ని చూసి ఉప్పొంగిపోయారు.
రక్తహీనతతో బాధపడే కూతురికి మంచి వైద్యం అందించడమే తదుపరి లక్ష్యమని, ఇక తన కూతుళ్లను డాక్టర్లుగా చూడాలని ఉందని అంటున్నాడు. వారిని డాక్టర్లు చేయడమే లక్ష్యంగా తన కార్యాచరణ ఉంటుందన్నాడు.
ఇక కూతుళ్లు మాట్లాడుతూ.. ఇప్పటివరకూ నాన్న ఏమీ తనకంటూ దాచుకోలేదని, ఎంత ఉంటే అంత తమకే ఖర్చు చేస్తున్నాడని ఒకవైపు ఆనందం, ఉద్వేగంతో కూడిన స్వరంతో వారు చెప్పుకొచ్చారు.