మెసేజ్‌ లింక్స్‌తో జాగ్రత్త..!

Be careful with message links - Sakshi

ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకునే పూర్ణిమ(పేరుమార్చడమైనది) ప్రతి పైసా జాగ్రత్తగా ఖర్చుపెడుతుంది.  రాత్రి పడుకునే ముందు సోషల్‌మీడియా అకౌంట్స్‌తో పాటు, మెయిల్‌కి వచ్చిన నోటిఫికేషన్స్‌ చూడటం అలవాటు. వాటిలో తన ఆఫీసు నుంచి, స్నేహితుల నుంచి వచ్చిన మెసేజ్‌లకు రిప్లై చేసింది. అదే సమయంలో మరో మెసేజ్‌ వచ్చింది. గోల్డ్‌స్కీమ్‌కి సంబంధించిన సమాచారం అది. ఆసక్తిగా అనిపించడంతో దానిని ఓపెన్‌ చేసింది.

ఆ స్కీమ్‌లో చేరితే తక్కువ ధరలో బంగారం కొనుగోలు చేయవచ్చు. అది, పేరున్న కంపెనీ వెబ్‌సైట్‌ నుంచి వచ్చింది. లిమిటెడ్‌ టైమ్‌లో వచ్చిన ఆఫర్‌ అది. మంచి అవకాశాన్ని ఎందుకు వదులుకోవడం అని, అప్లికేషన్‌లో తన వివరాలను పొందుపరిచి, సెండ్‌ చేసింది. మిగతావి ఏమైనా ఉంటే రేపు చూసుకుందాం అని ఫోన్‌ పక్కన పెట్టేసి పడుకుంది. ఉదయం పనిచేసుకుంటూనే ఫోన్‌ చేతిలోకి తీసుకుంది. వచ్చిన బ్యాంక్‌ మెసేజ్‌లు చూసి షాక్‌ అయ్యింది.

యాభై వేల రూపాయలు డెబిట్‌ అయినట్టుగా బ్యాంక్‌ మెసేజ్‌ అది. నిన్నరాత్రి ఆ డబ్బు ట్రాన్స్‌ఫర్‌ అయింది. స్కీమ్‌లో చేరినట్టుగా వివరాలు ఇచ్చింది కానీ, బ్యాంక్‌ అకౌంట్స్‌కి సంబంధించిన సమాచారం ఏమీ ఇవ్వలేదు తను. తన డబ్బు మరెలా పోయినట్టు? మెయిల్‌ ఐడీలో ఉన్న కస్టమర్‌ కేర్‌కి మెసేజ్‌ చేసింది. ఫోన్‌ చేసింది. కానీ, ఎలాంటి సమాచారమూ లేదు. 

పూర్ణిమ మాదిరే చాలామంది మెసేజ్‌లు లేదా మెయిల్స్‌కు వచ్చిన ఆకర్షణీయమైన పథకాలతో ఉన్న లింక్స్‌ను ఓపెన్‌ చేయడం, వాటి ద్వారా మోసాలకు గురికావడం అతి సాధారణంగా జరుగుతున్నాయి. దీనికి కారణం అధికారిక కంపెనీల నుంచి వచ్చినట్టుగా మెసేజ్‌ లింక్స్‌ ఉండటం ప్రధాన కారణం.  

ఈ రోజుల్లో స్పూఫింగ్‌ అనేది మన భద్రత, గోప్యతకు తీవ్రమైన ముప్పుగా పరిణమిస్తుంది. ఈ రకమైన దాడుల గురించి తెలుసుకోవడం, వాటి నుండి తమను తాము రక్షించుకోవడానికి అందరం సిద్ధపడాల్సిన సమయం ఇది. పేరున్న కంపెనీల పేరుతో అధికారిక వెబ్‌సైట్లనుంచి వచ్చినట్టు మెసేజ్‌లు మెయిల్స్‌కు వస్తుంటాయి. అయితే, వాటిలో ఏవి కరెక్ట్‌ అనేది పెద్ద సంశయం. 

ఇలాగే, క్రెడిట్‌ కార్డ్‌ నంబర్లు, ఓటీపీ, లాగిన్‌ ద్వారా మోసగాళ్లు మన సమాచారాన్ని బయటపెట్టేలా చూస్తుంటారు. లాటరీ వచ్చింది, డబ్బు డిపాజిట్‌ చేయడానికి బ్యాంక్‌ వివరాలు ఇవ్వమని అడగడం, ఓటీపీ చెప్పమని కోరడం, బ్యాంక్‌ లేదా ఏదైనా ఇతర సంస్థ నుండి ఫోన్‌ కాల్స్‌ చేస్తుంటారు. ఈ కాల్స్‌ ద్వారా బ్యాంకుకు సంబంధించిన సమాచారాన్ని మనం బయటపెట్టేలా మోసం చేసే అవకాశం ఉంది. మనలో నమ్మకాన్ని కలిగించడానికి సులువైన, ఆకర్షణీయమైన పద్ధతులను మోసగాళ్లు ఎంచుకుంటారు కాబట్టి, మనమే జాగ్రత్త వహించాలి.

ఇ–మెయిల్‌ ద్వారా.. 
ఫేక్‌ మెయిల్‌ ఐడీతో మన ఇన్‌బాక్స్‌లో ఓ మెసేజ్‌ వస్తుంది. అది వేరొకరి నుండి వచ్చినట్లు కనిపిస్తుంది. ఇది సాధారణంగా ఫిషింగ్‌ దాడులలో ఉపయోగించబడుతుంది, ఇక్కడ దాడి చేసే వ్యక్తి సున్నితమైన సమాచారాన్ని బహిర్గతం చేయడానికి లేదా హానికరమైన సాఫ్ట్‌వేర్‌ను డౌన్  లోడ్‌ చేయడానికి, మోసగించడానికి ప్రయత్నిస్తాడు.

పంపినవారి ఇ–మెయిల్‌ చిరునామా అనుమానాస్పదంగా ఉండచ్చు. ఉదాహరణకు.. మనకు వచ్చిన ఫేక్‌ మెయిల్‌ ఐడీలో లెక్కకు మించి, అక్షర దోషాలు లేదా వింత భాష ఉండచ్చు. గమనించాలి. 

మోసపూరిత ఇ–మెయిల్‌లు ఎలా ఉంటాయంటే.. తరచుగా క్రెడిట్‌ కార్డ్‌ నంబర్లు, సోషల్‌ సెక్యూరిటీ నంబర్లు లేదా పాస్‌వర్డ్‌ల వంటి వ్యక్తిగత సమాచారం కోసం రిక్వెస్ట్‌లు కోరుతుంటాయి.

♦ ఇ–మెయిల్‌లోని అనుమానాస్పద లింక్‌లు చట్టబద్ధమైన వెబ్‌సైట్‌లా కనిపించే నకిలీ వెబ్‌సైట్‌కి దారితీయవచ్చు. లేదా అవి అసాధారణమైన అక్షరాలను కలిగి ఉండవచ్చు. లేదా వేరే వెబ్‌సైట్‌కి దారి మళ్లించవచ్చు.

ఫోన్‌ ద్వారా దాడులు
♦ ఫోన్‌ ద్వారా దాడులకు పాల్పడే వ్యక్తులు ఉంటారు. వీరు వినియోగదారుడిని రకరకాల ఆకర్షణీయ పథకాల ద్వారా అతని వ్యక్తిగత, బ్యాంకు వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది.  

♦ మీ ఫోన్‌కి బయటి దేశాల నుంచి కూడా ఫోన్‌లు వస్తుంటాయి. 

♦ మీకు తక్కువ సమయంలో ఎక్కువ కాల్స్‌ వచ్చినా, పగలు లేదా రాత్రి అసాధారణ సమయాల్లో మీకు కాల్స్‌ వచ్చినా, అది కాలర్‌ ఐడీ స్పూఫింగ్‌కు సంకేతం కావచ్చు.

మీరు గుర్తించని కంపెనీలు లేదా వ్యక్తుల నుండి అయాచిత కాల్స్‌ను స్వీకరిస్తే, అది కాలర్‌ ఐడీ స్పూఫింగ్‌కు సంకేతం కావచ్చు.

కాలర్‌ ఐడీ స్పూఫింగ్‌ తరచూ క్రెడిట్‌ కార్డ్‌ నంబర్లు లేదా సామాజిక భద్రతా నంబర్ల వంటి వ్యక్తిగత సమాచారం కోసం రిక్వెస్ట్‌లు ఉంటాయి.  

ఫోన్‌ కాల్‌లో అవతలి వారి మాటల్లో ఏ మాత్రం క్వాలిటీ లేకపోయినా, కాల్‌ సమయంలో అసాధారణ శబ్దాలు లేదా అంతరాయాలు ఉంటే, అది కాలర్‌ ఐడీ స్పూఫింగ్‌కు సంకేతం కావచ్చు.

ఇలా సురక్షితం...
♦  అపరిచిత ఇ–మెయిల్‌లు, మెసేజ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలి.  

♦ బ్రౌజర్‌ అడ్రస్‌ బార్‌లో లాక్‌ గుర్తు ఉండదు.  అడ్రస్‌ బార్‌పై అక్షరాల్లో చిన్న చిన్న తేడాలు ఉంటా యి. ఈ చిన్న అక్షరాలను కూడా గమనించాలి. 

యుఆర్‌ఎల్‌ అక్షరాలు సరిగా ఉన్నా డిజైన్‌లలో కూడా తేడాలు ఉంటాయి. గమనించాలి.

బ్యాంక్, డిజిటల్‌ రెండు రకాల కార్యకలాపాలకు రెండు కారకాల ఫోన్‌ ప్రమాణీకరణను ప్రారంభించడం శ్రేయస్కరం.

- ఇన్‌పుట్స్‌: అనీల్‌ రాచమల్ల,  డిజిటల్‌ వెల్‌బీయింగ్‌ ఎక్స్‌పర్ట్,  ఎండ్‌ నౌ ఫౌండేషన్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top