పాలు పోయడానికి వచ్చా..ఓట్లివ్వండి

Aritha Babu Congress Youngest Assembly Candidate In Kerala - Sakshi

26 ఏళ్ల అరితా బాబూ రోజూ తెల్లవారుజామున 4 గంటలకు లేచి పాలు పితికి 15 ఇండ్లకు పాలుబోసి ప్రచారానికి బయలుదేరుతుంది.కేరళ ఎన్నికలలో ఆమె అత్యంత పిన్న వయస్కురాలైన ఎం.ఎల్‌.ఏ అభ్యర్థి.పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేసినా పాల అమ్మకాన్ని జీవనాధారం చేసుకున్న అరిత కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఇచ్చాక కూడాపాల వాడికీలకు వెళ్లి పాలుపోయడం మానలేదు. ‘పాలు గిన్నెలో పోసే క్షణంలోనే ఆ ఇంటి కష్టం సుఖం నాకు తెలిసిపోతాయి. ఎం.ఎల్‌.ఏ అభ్యర్థికి అంతకన్నా ఏం కావాలి’ అంటోంది. ఆమె ఉత్సాహం, ఊపు అక్కడ పెద్ద వార్త. 

నిన్న మంగళవారం కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు దక్షిణ భారతదేశంలో ఎన్నికల ప్రచారం మొదలెట్టారు. అయితే ఆమె తమిళనాడు వెళ్లలేదు. కేరళకు వచ్చారు. కేరళలో కూడా చాలా నియోజకవర్గాలు ఉండగా మొదట అలెప్పుజా జిల్లాలోని కాయంకులం నియోజకవర్గానికి వెళ్లారు. ఏప్రిల్‌ 4న జరగనున్న అసెంబ్లీ ఎలక్షన్లలో ఆ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అరితాబాబును తన జీప్‌ ఎక్కించుకుని రోడ్‌ షో చేశారు. ‘అరితా... నువ్వు కేరళ భవిష్యత్తువి’ అన్నారు. ఆ తర్వాత అరిత ఇంటికి వెళ్లి ఆమె ఆతిథ్యం స్వీకరించారు కూడా.

కేరళలో అత్యంత చిన్న వయస్కురాలైన అసెంబ్లీ అభ్యర్థిగా వార్తల్లో ఉన్న 27 ఏళ్ల అరితా బాబు హవా అది. కేరళ సినీరంగంలో గొప్ప కమెడియన్‌గా, కేరెక్టర్‌ ఆర్టిస్టుగా ఉన్న సలీమ్‌ కుమార్‌ అరితా బాబు నామినేషన్‌ వేస్తుంటే స్వయంగా వచ్చి తోడు నిలిచాడు. ఆమె గెలవాలి... అందుకు నేను సాయపడతాను అన్నాడు. అరితా బాబుది వెనుకబడిన సామాజికవర్గం. ఆమె తండ్రి కాంగ్రెస్‌ పార్టీలో సామాన్య కార్యకర్త. వాళ్లు ఆవు పాలు అమ్ముకుని జీవిస్తుంటారు.

అరితా తండ్రి ప్రభావంతో కాలేజీ రోజుల నుంచే చురుగ్గా విద్యార్థి రాజకీయాల్లో పాల్గొంది. ఆ తర్వాత యువజన కాంగ్రెస్‌లో పని చేసింది. 2015లో జరిగిన స్థానిక ఎన్నికలలో పంచాయతీ సర్పంచ్‌గా గెలుపొంది ఐదేళ్లు పదవిలో ఉంది కూడా. సోషల్‌ వర్క్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేసిన అరితా తండ్రికి కేన్సర్‌ రావడంతో ఇంటి బాధ్యత తీసుకుంది. ఆవు పాలు పితికి ఇళ్లకు వేయడం ఆమె పని. అందుకోసం రోజూ తెల్లారి నాలుగుకు లేచి ఆరు గంటలకు పాల క్యాన్లు తీసుకుని టూ వీలర్‌ మీద బయలుదేరుతుంది. అలాంటి అరిత ఈసారి ఎం.ఎల్‌.ఏ కావాలని కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని పార్టీ అనుకుంది. యు.డి.ఎఫ్‌ అభ్యర్థిగా ఆమెను కాయంకులంలో నిలబెట్టింది.

ప్రతి గడప కష్టం నాకు తెలుసు
‘పాలు పోయడానికి గడప గడప తిరిగే నాకు తెలియని కష్టం లేదు. నా నియోజక వర్గానికి ఏం కావాలో నాకు తెలుసు. ఇక్కడ టూరిజమ్‌ పరిశ్రమను అభివృద్ధి చేసి ఉపాధి పెంచాలి. వైద్య సదుపాయాలు కల్పించాలి. ఉపాధి పెంచడం గురించే నేను ఎక్కువ కృషి చేస్తాను’ అంది అరిత. అయితే అరితకు ఈ గెలుపు సులభమా? కాయంకులం నియోజక వర్గం నుంచి గత మూడు ఎలక్షన్లలో ఎల్‌.డి.ఎఫ్‌ అభ్యర్థులే గెలుస్తున్నారు. గత ఎలక్షన్లలో కూడా సి.పి.ఎం అభ్యర్థి అయిన ప్రతిభ గెలిచింది. ఆమెను మళ్లీ ఆ పార్టీ నిలబెట్టింది. దాంతో ఇద్దరు మహిళా అభ్యర్థులు హోరాహోరీగా పోరాడే నియోజకవర్గంగా కాయంకులంను పరిశీలకులు గుర్తిస్తున్నారు.

‘ఈసారి పార్టీ అభ్యర్థులపై రాహుల్‌ గాంధీ ముద్ర ఉంది. ఆయన కొత్త, యువ అభ్యర్థులకు ఎక్కువ చోటిచ్చారు. నాలాగే ‘రూపాయి లాయర్‌’గా పేరొందిన బి.ఆర్‌.ఎం.షఫీర్‌కు కూడా సీటు ఇచ్చారు. మేమంతా పరిపాలనలో ఉత్సాహంగా పాల్గొని ప్రజలకు మంచి చేయాలనుకుంటున్నాం’ అంది అరిత. ఎలక్షన్లలో డబ్బు ఖర్చు సంగతి తెలిసిందే. అరితా దగ్గర తన టూ వీలర్, కొన్ని ఆవులు తప్ప మరేం లేవు. ప్రచారం అంతా పార్టీ చూస్తోంది. ‘నేను శ్రేష్ఠమైన పాలు పోస్తాను. కనుక కల్తీ లేని పాలన కూడా అందిస్తానని నా నియోజకవర్గం ప్రజలు భావించి నాకు ఓట్లు వేస్తారన్న నమ్మకం ఉంది’ అంది అరితా. ఆమె గెలుపు ఏమయ్యిందో ఇంకో పది రోజుల్లో తెలుసుకుందాం.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top