కృష్ణానదిలో స్నానం... అమరేశ్వరుని దర్శనం’ మోక్షదాయకం అన్నారు పెద్దలు. తెలుగునేల మీద ఉన్న పంచారామాలలో ప్రథమమైనదిగా భావించే అమరేశ్వర స్వామి ఆలయం మన ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా కృష్ణానది ఒడ్డున వందల ఏళ్లుగా పూజలు అందుకుంటున్నది. ఇక్కడ వెలసిన బాల చాముండికా సమేత అమరేశ్వర స్వామిని దర్శించి తరించటానికి భక్తజనం నిత్యం అమరావతిని సందర్శిస్తుంటారు. శ్రీశైలానికి ఈశాన్య భాగాన కృష్ణానది దక్షిణపు గట్టున ఉన్న ఈ క్షేత్రం దేవతలు, గంధర్వులు, ఋషులు సేవించిన మహిమ గల క్షేత్రంగా భక్తులు భావిస్తారు.
దేవాలయంలో గల వివిధ శాసనాలు ద్వారా అమరేశ్వరుణ్ణి క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల నుంచి వివిధ రాజవంశీయులు సేవించినట్లు తెలుస్తుంది. ప్రధానంగా పల్లవ, రెడ్డి, కోటకేతు రాజులు అమరేశ్వరుని సేవించినట్లు చరిత్ర చెపుతోంది.
శ్రీ కృష్ణదేవరాయలు అమరేశ్వరుని దర్శించి తులాభారం తూగినట్లు, బ్రాహ్మణులకు దానాలిచ్చినట్లు ఆధారాలున్నాయి. అలాగే 18వ శతాబ్దంలో చింతపల్లిని రాజధానిగా చేసుకుని దక్షిణాంధ్రదేశాన్ని పరిపాలించిన రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు ఆలయాన్ని పునరుద్ధరించి, మూడు ప్రాకారాలతో 101 లింగాలను ప్రతిష్ఠించారు. నేటికీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు వంశీకులే అనువంశీక ధర్మకర్తలుగా స్వామివారి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. అమరావతి క్షేత్రం హరిహర క్షేత్రంగా కూడా పిలవబడుతుంది.
ఆలయంలో వేంచేసి ఉన్న వేణుగో΄ాల స్వామి క్షేత్ర΄ాలకునిగా విరాజిల్లుతూ శివ కేశవులకు భేదం లేదని చాటుతున్నాడు.
ఏకశిలా రూపంగా దాదాపు 15 అడుగుల ఎత్తున, మూడు అడుగుల కైవారం కలిగిన ఈ లింగం జగద్విఖ్యాతం. ఓంకారానికి ప్రతిరూపంగా స్వామి వారి నుదుట మూడు చిన్న గుంటలు నేటికి దర్శనమిస్తాయి.
శుక్రాచార్యుడి సందేహం
అసుర గురువు శుక్రాచార్యుడు తన గణాలతో వచ్చి భవిష్యత్తులో సహ్యాద్రి పర్వతం మీద కృష్ణవేణి అనే నది పుట్టి ఇటువైపుగా ప్రవహిస్తుంది కనుక దాని ప్రవాహానికి అమరేశ్వరుడు మునిగిపోవచ్చునేమో అనే సందేహం వెలిబుచ్చాడు. అందుకు బృహస్పతి సమాధాన మిస్తూ, అమరేశ్వరుడు వెలసిన దీన్ని క్రౌంచగిరి అంటారనీ, దీని అడుగు పాతాళం దాకా ఉందనీ, దానివల్ల ఈ లింగం స్థిరంగా ఉంటుందనీ, కృష్ణమ్మ ఈ గిరి పక్క నుంచి వంక తిరిగి పారుతుందే తప్ప ఎన్నటికీ దీనిని ముంచెత్తదనీ బదులు చెప్పాడు. దీనికి ఆధారంగా ఇప్పటికీ కృష్ణానది ఈ క్షేత్రాన్ని ఆనుకొని ప్రవహిస్తూ ఉంది.
అమరలింగేశ్వరాలయ ప్రాముఖ్యత...
ద్వాపర యుగం చివరిలో 5053 సంవత్సరాల క్రితం మరియూ కలియుగ ప్రారంభంలో సౌనకాది మహర్షి నారదుడిని మోక్షానికి ఉత్తమమైన మార్గాన్ని కోరినట్లు స్కాంద పురాణం పేర్కొంది. నారదుడు శౌనకాది మహర్షిని కృష్ణానదిలో రోజూ స్నానం చేసి, కృష్ణుడు సృష్టించిన నది ఒడ్డున, అమరేశ్వరుణ్ణి దర్శిస్తూ నివసించమని సలహా యిచ్చాడు.
నారద మహర్షి సౌనకాది అమరేశ్వర ఆలయ కథను చెప్పాడు, తన భక్తులకు కోరికలు తీర్చడానికి శివుడు ఇక్కడ లింగం రూపంలో వెలిశాడని చెప్పాడు. అలాగే కష్ణానదిలో స్నానం చేసి ఇక్కడి ఆలయంలోని అమరేశ్వరుడిని పూజించిన వారికి పాపాలు తొలగిపోతాయని చెప్పారు. ఈ ప్రదేశంలో మూడు రోజులపాటు ఉండి భక్తిశ్రద్ధలతో శివపూజ చేసిన భక్తులు శివలోకాన్ని పొందుతారన్నారు. ఇక్కడ ఏ భక్తుడు మరణించినా శివుడు గ్రహిస్తాడు.
అమరలింగేశ్వర ఆలయ ఉత్సవాలు...
ఈ ఆలయంలో కార్తీక మాసం, మహా బహుళ దశమి, నవరాత్రి, మహా శివరాత్రి అంగరంగ వైభవంగా జరుగుతాయి.
ఆలయ సమయాలు...
మామూలు రోజుల్లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఆలయం తెరచి ఉంటుంది. ప్రస్తుత కార్తికమాసాన్ని పురస్కరించుకుని ఉదయం 5.30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, సా. 4 గంటల నుండి రాత్రి 8.30 వరకు గుడిని తెరచి ఉంచుతారు.
కార్తీకమాసం పౌర్ణమి, సోమవారాలలో ఉ.3 నుండి రాత్రి 10 వరకు, ఆదివారాలలో ఉ. 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంచుతారు.


