సర్వం భవ్యం.. అనామక సంస్థకు పెద్దపీట | An Anonymous Organization Has a Big Role in Chandrababu Government Know The Details Here | Sakshi
Sakshi News home page

సర్వం భవ్యం.. అనామక సంస్థకు పెద్దపీట

Dec 7 2025 4:12 AM | Updated on Dec 7 2025 5:00 AM

An Anonymous Organization Has a Big Role in Chandrababu Government Know The Details Here

లాభాపేక్ష లేకుండా సేవా దృక్ఫథంతో ముందుకొచ్చిన వాటిని పట్టించుకోని వైనం

సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ (సీవీసీ) మార్గదర్శకాలకూ తూట్లు

టెక్నికల్‌ ప్రజంటేషన్‌ పేరుతో టీడీపీకి చెందిన వ్యక్తికి అప్పగింత

తద్వారా మీకింత–మాకింత అంటూ కమీషన్లు దండుకునేలా స్కెచ్‌

నిబంధనలు సవరించి రూ.2,714 కోట్ల విలువైన 104, 108 కాంట్రాక్టు

రూ.200 కోట్ల విలువైన వెటర్నరీ అంబులెన్స్‌ నిర్వహణ.. ఏపీ జెన్‌కో ఆస్పత్రులకు సంబంధించి రూ.100 కోట్ల ప్రాజెక్టు

ఔషధాలు, పరికరాలు, ఇతరత్రా సౌకర్యాల కల్పన బాధ్యత ప్రభుత్వానిదేనట!

సేవల్లో అలసత్వం చూపినా జరిమానాలు విధించరట!

ఇదంతా ప్రభుత్వ పెద్దల సొంత సంపద వృద్ధి చేసుకునేందుకేనని విమర్శలు

సాక్షి, అమరావతి: వేల కోట్ల రూపాయల టర్నోవర్‌ కలిగిన, అంతర్జాతీయంగా పేరుగాంచిన, వైద్య రంగంలో అపార అనుభవం ఉన్న విఖ్యాత సంస్థలను కాదని అతి చిన్న, ఓ అనామక సంస్థకు రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అడ్డగోలుగా కాంట్రాక్టులు కట్టబెడుతుండటం నివ్వెర పరుస్తోంది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని లాభాపేక్ష లేకుండా సేవా దృక్ఫథంతో ముందుకొస్తున్న, స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ అయిన సంస్థలను పక్కనపెట్టి.. టీడీపీ డాక్టర్స్‌ విభాగంలోని పవన్‌కు చెందిన ‘భవ్య’ అనే ఎలాంటి అనుభవం లేని సంస్థకు ప్రజల ప్రాణ, ఆరోగ్య రక్షణ కోసం తీసుకొచ్చిన 108, 104ల నిర్వహణ కాంట్రాక్ట్‌ను అప్పగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అంతటితో ఆగకుండా బరితెగించి ఇతరత్రా శాఖల్లో సైతం కాంట్రాక్టులు అప్పనంగా కట్టబెట్టి.. మీకింత–మాకింత అంటూ కమీషన్లు దండుకుంటున్నారని స్పష్టమవుతోంది. పశు సంవర్థక శాఖలో పశు సంచార వైద్య సేవలు, ఏపీ జెన్‌కో ఆస్పత్రుల నిర్వహణ, తదితర కాంట్రాక్టుల ద్వారా ఊరూ, పేరు లేని సంస్థకు ఏకంగా రూ.3,025 కోట్ల విలువై కాంట్రాక్టులు అప్పగించడం దుమారం రేపుతోంది. తద్వారా ప్రజాధనాన్ని అడ్డగోలుగా దోచుకోవడానికి ప్రభుత్వ పెద్దలు కాంట్రాక్టులను ఓ సాధనంగా మలుచుకున్నారనడానికి ఈ వ్యవహారమే ఓ ఉదాహరణ.  

తస్మదీయ కాంట్రాక్టర్‌కు పొగబెట్టి.. 
గతేడాది చంద్రబాబు గద్దెనెక్కిన వెంటనే తస్మదీయ కాంట్రాక్టర్‌లకు పొగపెట్టారు. గడువు ఉన్నప్పటికీ కాంట్రాక్టర్‌లే పనులు వదులుకుని వెళ్లిపోయేలా వేధింపులకు దిగారు. దీంతో 104 మొబైల్‌ మెడికల్‌ యూనిట్స్‌ (ఎంఎంయూ), 108 నిర్వహణ కాలపరిమితి 2027 వరకూ ఉన్నప్పటికీ కాంట్రాక్టర్‌ ఎంవోయూను రద్దు చేసుకున్నారు. అనంతరం భవ్య హెల్త్‌ సర్వీసెస్‌కు ఈ కాంట్రాక్ట్‌ను కట్టబెట్టడం కోసం పక్కా ప్రణాళికతో నిబంధనలు రూపొందించి టెండర్‌ పిలిచారు. ఈ సంస్థకు అత్యవసర వైద్య సేవల నిర్వహణలో అనుభవం లేకపోవడంతో నిబంధనలు మార్చేశారు. సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా అత్యవసర వైద్య సేవల కల్పన కోసం టెండర్‌లు పిలిచినప్పుడు అంబులెన్స్‌లు /ఎంఎంయూ /తల్లీబిడ్డా ఎక్స్‌ప్రెస్‌లు, ఇతర సంచార వైద్య సేవల్లో అనుభవం ఉన్న సంస్థలకు ప్రాధాన్యం ఇచ్చేలా నిబంధనలు ఉంటాయి.

భవ్యకు మొబైల్‌ వెటర్నరీ అంబులెన్స్‌లు నిర్వహించిన అనుభవం ఉందనే కారణంతో ఈ నిబంధనను టెండర్‌ మార్గదర్శకాల్లో చేర్చారు. సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ (సీవీసీ) మార్గదర్శకాలకు తూట్లు పొడిచారు. టెండర్‌ నిబంధనలన్నింటినీ భవ్యకు అనుకూలంగా మార్చేశారు. దీంతో టెండర్‌లలో పాల్గొన్నా ఏదో ఒక సాకుతో బిడ్‌లను తిరస్కరిస్తారని గ్రహించడంతో దేశంలో అత్యవసర వైద్య సేవలు అందిస్తున్న ప్రముఖ సంస్థలు కనీసం బిడ్‌లు కూడా వేయలేదు. దీంతో ప్రభుత్వ పెద్దలు విజయవంతంగా భవ్యకు కాంట్రాక్ట్‌ను కట్టబెట్టేశారు. ఐదేళ్ల కాల పరిమితితో 731 అంబులెన్స్‌ల నిర్వహణను రూ.1,100 కోట్లతో, 904 ఎంఎంయూలకు రూ.675 కోట్లు, ఎంఎంయూల్లో వైద్య పరీక్షలకు రూ.810 కోట్లు, కాల్‌ సెంటర్‌ నిర్వహణకు రూ.129 కోట్ల చొప్పున మొత్తం రూ.2,714 కోట్ల కాంట్రాక్ట్‌ను భవ్య కైవసం చేసుకుంది. ఎంఎంయూల్లో వైద్య పరీక్షల నిర్వహణకు వైద్య శాఖ పైలెట్‌ నిర్వహిస్తోంది. త్వరలో వైద్య పరీక్షలు ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

క్వాలిటీ కాస్ట్‌ బేస్డ్‌ సెలక్షన్‌ అట! 
అరంబిందోను వెళ్లగొట్టాక.. ఎన్నడూ లేనట్లుగా 108, 104తో పాటు ఎమర్జెన్సీ కాల్‌ సెంటర్‌ నిర్వహణకు ఒకే టెండర్‌ను పిలిచారు. అత్యవసర వైద్యసేవల్లో విశేష అనుభవం ఉన్న పెద్దపెద్ద సంస్థలు టెండర్లలో పాల్గొంటే భవ్య సంస్థకు కాంట్రాక్ట్‌ దక్కదనే ఉద్దేశంతో ఇలా చేశారు. ఈ చర్యలతో పోటీ, పారదర్శకత లేకుండా పోయింది. తర్వాత 768 అంబులెన్స్‌లు, 904 మొబైల్‌ మెడికల్‌ యూనిట్లతో పాటు, వందకుపైగా సీట్లతో కాల్‌సెంటర్‌ నిర్వహించే అతిపెద్ద కాంట్రాక్ట్‌ను ఏ రాష్ట్రంలోనూ పెద్ద ప్రాజెక్టులు చేసిన అనుభవం లేని భవ్య హెల్త్‌ సర్వీసెస్‌కు అప్పగించారు.

క్వాలిటీ కాస్ట్‌ బేస్డ్‌ సెలక్షన్‌ (క్యూసీబీఎస్‌) పేరుతో టెక్నికల్‌ ప్రజంటేషన్‌కు 80, ఫైనాన్షియల్‌ బిడ్‌కు 20 మార్కులు కేటాయించి భవ్యకు కట్టబెట్టారు. గత ప్రభుత్వంలో రాష్ట్రంలో 340 సంచార పశు వైద్య, ఆరోగ్య సేవా రథాలను అందుబాటులోకి తెచ్చారు. వీటి కోసం 1962 టోల్‌ ఫ్రీ కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వంలో ఎంపిక చేసిన కాంట్రాక్టర్‌ గడువు గతేడాదితో ముగిసింది. దీంతో రూ.200 కోట్లకు పైగా అంచనాలతో ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం నూతన కాంట్రాక్టర్‌ను ఎంపిక చేయడానికి టెండర్‌లు పిలిచారు. భవ్యకే కాంట్రాక్ట్‌ కట్టబెట్టడం కోసం టెండర్‌ నిబంధనలన్నింటినీ మార్చేశారు.  

ఎంత తేడా? 
ఏపీ జెన్‌కో ఆధ్వర్యంలోని ఆస్పత్రుల నిర్వహణకు సంబంధించి భవ్యకు ప్రతి నెలా రూ.1.03 కోట్లను ఏపీజెన్‌కో చెల్లించాలి. ఇతర సంస్థలు నెలకు రూ.67 లక్షలు మాత్రమే అడిగాయి. అంతేకాకుండా స్పెషలిస్ట్‌ డాక్టర్ల సేవల కోసం రూ.8 వేలు, సూపర్‌ స్పెషలిస్ట్‌ డాక్లర్లు వస్తే రూ.12 వేలు, ఉద్యోగుల ఆరోగ్య తనిఖీల కోసం ఒక్కొక్కరికీ రూ.3,800 చొప్పున అదనంగా ఇవ్వాలి. ఇతర సంస్థలు రూ.1,700 ఇస్తే చాలన్నాయి. కానీ తక్కువ నిధులు కోట్‌ చేసిన సంస్థలను కాదని భవ్యకు రూ.100 కోట్ల కాంట్రాక్ట్‌ కట్టబెట్టేయడం దోపిడీకి పరాకాష్టగా నిలుస్తోంది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపాలెం మండలం మంగంపేటలోని ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) హెల్త్‌ సెంటర్‌ కాంట్రాక్టును కూడా ఇదే భవ్యకే అప్పగించేశారు. తద్వారా ఐదేళ్లకు రూ.11.70 కోట్లు దండుకోనుంది. 
 
నిబంధనల ఉల్లంఘన ఇలా. 
➤108, 104 నిర్వహణతో పాటు ఎమర్జెన్సీ కాల్‌ సెంటర్‌ అంటూ లింక్‌ పెట్టి పెద్ద సంస్థలు పోటీకి రాకుండా చేశారు.  

➤సంచార పశు వైద్య, ఆరోగ్య సేవా రథాలకు సంబంధించి గతంలో టెండర్‌లలో పాల్గొనే సంస్థల టర్నోవర్‌ 50 శాతం ఉండాలని నిబంధన ఉండేది. దీన్ని 17 శాతానికి తగ్గించేశారు. నెట్‌వర్త్‌ విలువ 35 శాతం నుంచి 11 శాతానికి కుదించారు. కేంద్ర మార్గదర్శకాలకు విరుద్ధంగా ఎంఎస్‌ఎంఈలకు బిడ్‌ సెక్యురిటీ నుంచి మినహాయింపు ఇచ్చారు.  

➤రాష్ట్రానికి చెందిన సంస్థలకు 5 మార్కులు, ఐదేళ్ల అనుభవం కలిగిన కంపెనీలకు మరో 5 మార్కులు, ప్రజంటేషన్‌కు 30 మార్కులు అంటూ భవ్యకు అనుకూలంగా నిబంధనలు మార్చేశారు.

➤ఏపీ జెన్‌కో ఆధ్వర్యంలోని థర్మల్, జల విద్యుత్‌ ఉత్పత్తి ప్రాజెక్టుల్లో పనిచేసే ఉద్యోగులకు వైద్య సేవలు అందించే ఆస్పత్రుల నిర్వహణకు సంబంధించి రూ.వంద కోట్ల విలువ చేసే కాంట్రాక్ట్‌ కోసం ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏపీ జెన్‌కో టెండర్‌ పిలిచింది. ఒకే టెండర్‌లో హైడల్, థర్మల్‌కు వేర్వేరుగా బిడ్‌ దాఖలు చేయాలని పేర్కొంది. దీంతో పలు సంస్థలు టెండర్లు వేశాయి. కానీ ఆ టెండర్‌ నోటిఫికేషన్‌ను రద్దు చేశారు. మార్చిలో మరోసారి టెండర్లు పిలిచి వాటిని కూడా రద్దు చేశారు. మూడోసారి టెండర్‌ పిలిచి జూలైలో ప్రక్రియ పూర్తి చేశారు. ఈసారి టీడీపీలోని డాక్టర్‌ పవన్‌కు చెందిన భవ్య హెల్త్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కాంట్రాక్ట్‌ను దక్కించుకునేలా నిబంధనలు మార్చేశారు.

➤మొదట రెండు సార్లు టెండర్లు పిలిచినప్పుడు నిర్వహణ చేపట్టే సంస్థకు ఆసుపత్రి ఉండాలని, వైద్య రంగంలో 15 ఏళ్ల అనుభవం ఉండాలని నిబంధన పెట్టారు. కానీ మూడోసారి అవేవీ లేవు. పైగా భవ్య కంటే తక్కువ ఖర్చుతో సేవలందిస్తామన్న యశోద హాస్పిటల్‌పై అనర్హత వేటు వేసి పక్కకు తప్పించారు. అందుకు విచిత్ర కారణం చెప్పారు. జెన్‌కో ఆసుపత్రుల నిర్వహణను చూసే సంస్థ ఏదైనా ఆసుపత్రితో ఒప్పందం చేసుకోవాలని నిబంధన పెట్టారు.  

సొంత సంపద వృద్ధి కోసం 
సంపద సృష్టిస్తాం.. పంచి పెడతాం.. అంటూ గద్దెనెక్కిన చంద్రబాబు సొంత సంపద సృష్టి కోసం నిరంతరం తపిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలు పన్నుల రూపంలో కట్టిన సొమ్మును.. 108, 104 కాంట్రాక్ట్‌లలో వీలైనంత దోపిడీ చేయడానికి పూనుకున్నారు. ధరల పెరుగుదలను సాకుగా చూపి సంస్థకు చెల్లించే నిధులను ఏటా 3 శాతం పెంచి ఖజానాకు గండి కొడుతున్నారు. ఇదంతా ఆయన సొంత సంపద వృద్ధి కోసమేనని సోషల్‌ మీడియా వేదికగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వమే 104, 108 వాహనాల్లో ఔషధాలు, పరికరాలు, ఇతర అవసరమైన వాటిని అందిస్తుంది. ఎమర్జెన్సీ కాల్‌ సెంటర్‌ ఐటీ, ఇతర సదుపాయాల ఖర్చు తిరిగి చెల్లింపుతో పాటు సేవల్లో అలసత్వం చూపినా మూడు నెలల పాటు జరిమానాలు విధించకుండా ఉండేలా నిబంధనలు మార్చారు.

మరోవైపు మొత్తం పెనాల్టి.. కేపిటల్‌ విలువ మీద 10 శాతానికి మించొద్దనే షరతు విధించారు. అత్యవసర సేవల్లో వేగం, పారదర్శకత, అలసత్వం కట్టడికి..  ప్రజలు, ప్రభుత్వానికి పకడ్బందీగా మేలు చేసేలా కాకుండా, కాంట్రాక్టర్‌కు లాభాలు వచి్చపడేలా ప్రభుత్వమే నిబంధనలు రూపొందించింది. తద్వారా మళ్లించిన నిధులన్నీ అస్మదీయ సంస్థ ద్వారా తమ చేతుల్లోకి వచ్చేలా ప్రభుత్వ పెద్దలు మార్గం ఏర్పాటు చేసుకున్నారని స్పష్టమవుతోంది. 

వైఎస్‌ జగన్‌ పాలనలో పారదర్శకత, పోటీనే ప్రామాణికం

  • 2019కి ముందు చంద్రబాబు ‘108’ వ్యవస్థను అస్తవ్యస్తంగా మార్చారు. ఆ తర్వాత అధికారంలోకి వచి్చన ఏడాదిలోనే వైఎస్‌ జగన్‌ మళ్లీ వాటిని బలోపేతం చేశారు. 2019 వరకు 336 వాహనాలతో అంబులెన్స్‌ సేవలు అరకొరగా ఉండేవి. అప్పట్లో 679 మండలాలు (ప్రస్తుతం 686) ఉంటే మండలానికి ఒకటి కూడా లేని దుస్థితి. వైఎస్‌ జగన్‌ సర్కారు ఏడాదిలోపే 412 అంబులెన్స్‌లు కొనుగోలు చేసింది. 2020 జూలై 1న వీటిని ప్రారంభించారు.  

  • 26 నవజాత శిశు (నియోనాటల్‌) అంబులెన్స్‌ సేవలను అందుబాటులోకి తెచ్చారు. దీంతో ఒక్కసారిగా ప్రభుత్వ అంబులెన్సుల సంఖ్య 748కు చేరింది. ఇందుకు మొత్తం రూ.96.5 కోట్లు ఖర్చు చేశారు. 2022 అక్టోబర్‌లో రూ.4.76 కోట్లతో 20 కొత్త 108లను గిరిజన ప్రాంతాల్లో చేర్చారు. అలా 108ల సంఖ్య 768కి చేరింది. 2.5 లక్షల కిలోమీటర్లు పైగా తిరిగిన పాత వాహనాల స్థానంలో 146 కొత్త అంబులెన్సులనూ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టింది.  

  • అత్యవసర సేవల బలోపేతం ద్వారా ఐదేళ్లలో 45 లక్షల మందికి వైఎస్‌ జగన్‌ అండగా నిలిచారు. నేరుగా ప్రభుత్వమే అత్యాధునిక వసతులతో కొత్త అంబులెన్స్‌లు, ఎంఎంయూలు కొనుగోలు చేశారు. తద్వారా ఏ రాష్ట్రంలోనూ లేని అతిపెద్ద అత్యవసర, సంచార వైద్య సేవల వ్యవస్థను ఏర్పాటు చేశారు.

  • దేశంలోనే దిగ్గజ సంస్థలు టెండర్‌లలో పాల్గొనేలా నిబంధనలు పొందుపరిచి పోటీ పెంచారు. సేవల నిర్వహణకు పిలిచిన టెండర్‌లలోనూ అత్యంత పారదర్శక విధానాలు పాటించారు. అనేక వడపోతల అనంతరం చాలా తక్కువ ఫైనాన్షియల్‌ బిడ్‌ కోట్‌ చేసిన సంస్థకే కాంట్రాక్ట్‌ అప్పగించారు. సేవల్లో అలసత్వం వహించిన సందర్భాల్లో భారీగా పెనాల్టీలు విధించేలా నిబంధనలు పెట్టి నిర్వహణ సంస్థలో జవాబుదారీతనం పెంచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement