‘ఫ్యామిలీతో చూడదగ్గ కొత్త సినిమా ఏదైనా ఉందా?’ | AI turns endless scrolling into instant watching | Sakshi
Sakshi News home page

‘ఫ్యామిలీతో చూడదగ్గ కొత్త సినిమా ఏదైనా ఉందా?’

Apr 17 2026 1:10 PM | Updated on Apr 17 2026 1:15 PM

AI turns endless scrolling into instant watching

మొబైల్‌ డేటాతోనో లేకుంటే ఇంట్లో వైఫై నెట్‌తోనో చేతిలో స్మార్ట్‌ ఫోన్‌లో చేతిని పైకి కిందకు ఆడిస్తూ గడిపేస్తున్న కాలమిది. దీనికి తోడు వారాంతంలో ప్రశాంతంగా ఓ సినిమానో, వెబ్‌సిరీసో చూడడం కుటుంబరావులకు పెద్ద టాస్క్‌గా మారింది.  ఇప్పటి ప్రేక్షకుల పెద్ద సమస్య ఏమిటంటే.. ఏం చూడాలి? ఏది ట్రెండింగ్‌లో ఉంది? ఏది సరదాగా ఉంటుంది? అనే. ఈ ప్రశ్నలతోనే ఎక్కువ సమయం వృథా అవుతోందట. ఇది ఎంతలా అంటే.. ఒక సినిమా చూసే సమయం కంటే ఎక్కువే!

అవును.. ఆశ్యర్యం కలిగించినా పైన చెప్పుకున్నదే ఇదే నిజం.  యూజర్‌టెస్టింగ్‌ అనే సర్వే ప్రకారం.. మన దేశంలో ఒక యూజర్‌ ‘ఏం చూడాలి’ అని నిర్ణయించుకోవడంలోనే ఒక ఏడాదిలో 110 గంటలు.. అంటే సుమారుగా ఐదు రోజులు వేస్ట్‌ చేస్తున్నారని వెల్లడైంది. అలాగే డెలాయిట్‌ సర్వే ప్రకారం.. ఈ గందరగోళంలోనే ఒక వ్యక్తి రోజుకు సగటున ఆరు రకాల డిజిటల్ వినోదం (సిరీస్, షార్ట్ వీడియోలు, సోషల్ ఫీడ్స్) మధ్య చక్కర్లు కొడుతున్నాడు. అయితే.. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఈ పరిస్థితి మార్చేయబోతోంది. 

ఈరోజుల్లో విరామం దొరికితే విశ్రాంతి కోసం కాకుండా వినోదం కోసం వెతికే పనిలోనే బిజీ అయిపోతున్నాం. చాలా ఇళ్లలో ఏం చూడాలి అని ఎంచుకోవడానికి పట్టే సమయం పెరిగిపోతూ వస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఏం చూడడం బెస్ట్‌ అనే అడిగేవాళ్లు.. దానికి తమ రివ్యూలతో ఆన్సర్లు ఇచ్చేవాళ్లు పెరిగిపోతున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్‌లే నడుం బిగించాయి. 

ఇప్పుడు AI ఆధారిత కంటెంట్ డిస్కవరీ వైపు అడుగులు వేస్తున్నాయి. అది ఎలాగంటే.. ఏఐ సెర్చ్‌ బార్‌లోనూ సాధారణ కీవర్డ్ సెర్చ్ కాకుండా.. అంటే చేతి వేళ్లు నొప్పి పుట్టేలా, రిమోట్‌ బటన్‌లు అరిగిపోయేలా టైప్‌ చేయాల్సిన అవసరం ఉండదు. ఉదాహరణకు.. ‘నేను ఫ్యామిలీతో కొత్త సినిమా ఏదైనా చూడాలనుకుంటున్నా.. ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాల్లేని సినిమా ప్లే చేయి’, ‘లేటెస్ట్‌ రిలీజ్‌లు ఏమున్నాయో చూపించు’, ‘తక్కువ రన్‌టైంలో పూర్తయ్యే సినిమాలు ఏమైనా ఉన్నాయా?’’ అలా వాయిస్‌ కమాండ్‌ ద్వారా కావాల్సినవి ఎంచుకోవచ్చు. 

ఇది ఇక్కడితోనే ఆగిపోలేదు. యూజర్‌ మూడ్‌ను, సందర్భాన్ని, ఉద్దేశం అర్థం చేసుకుని కూడా సరైన సజెషన్లు ఇస్తుంది. సో.. ప్రేక్షకులు ఇప్పుడు జానర్ మాత్రమే చెప్పాల్సిన అవసరం లేదు.. ఫీలింగ్స్‌ చెప్పినా సరిపోతుందన్నమాట!. ‘‘రోజంతా అలసిపోయాను.. రిలాక్సేషన్‌ కోసం ఫన్నీగా ఏదైనా ఇవ్వు”, ‘‘ఆదివారం సాయంత్రం బయట వాతావరణం వర్షం పడేలా ఉంది.. ఈ మూడ్‌కు తగ్గట్లు మంచి పాటలు ప్లే చేయు’.. ఇలాగన్నమాట. అలాగే ఏఐ కాబట్టి భాషతోనూ పెద్దగా ఇబ్బంది లేకుండా చూసుకుంటోంది. 

జియో హాట్‌స్టార్‌ ఓపెన్‌ఏఐతో కలిసి ChatGPT ఆధారిత వాయిస్ డిస్కవరీని భారతీయ ప్రేక్షకులకు అందిస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌ ChatGPT ఆధారిత సెర్చ్‌ని మొదట ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో ప్రారంభించి.. ఇప్పుడు భారత్‌కు విస్తరించింది. Amazon Prime Video కూడా ఏఐ జానర్ క్లస్టర్లు (fantasy quest, mind‑bending sci‑fi”) చూపిస్తూ యూజర్‌కు ఎంపిక చేసుకోవడంలో సహాయం చేస్తోంది.  

సో.. ఇకపై ప్రేక్షకులు ఎంత స్క్రోల్ చేసినా ఏదో దొరకడం లేదు అనే సమస్యతో బాధపడాల్సిన అవసరం లేదు. AI ఆధారిత డిస్కవరీ వల్ల ‘ఏం చూడాలి?’ అనే ప్రశ్నకు నేరుగా సమాధానం దొరుకుతుందన్నమాట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement