మహా గంగ

72-YO Sold Her Company to Help 40,000 Villagers Access Clean Water - Sakshi

మనిషి బతకాలంటే గాలి తర్వాత అంత ముఖ్యమైనది నీటిచుక్క. గాలి మన చుట్టూ ఆవరించి ఉంటుంది. మరి నీరు... అవి మన దగ్గరకు రావు, మనమే నీటి దగ్గరకు వెళ్లాలి. అందుకే ప్రాచీన నాగరకతలు నీటి ఆధారంగానే విస్తృతమయ్యాయి. మరి ఈ ఆధునిక కాలానికి ఏమైంది? మనిషి టెక్నాలజీని అందిపుచ్చుకున్నాడు. తానున్న చోటుకే నీటి తెచ్చుకునే టెక్నాలజీని అభివృద్ధి చేసుకుని కొండ మీద కూడా కాలు మీద కాలేసుకుని జీవిస్తున్నాడు.

మరి భూగర్భంలో జలం పాతాళానికి ఇంకిపోతే ఏం చేయాలి? బిందెలు తలమీద పెట్టుకుని నీటిబొట్టును వెతుక్కుంటూ మైళ్లకు మైళ్ల దూరం నడిచి వెళ్లాలి. మహారాష్ట్ర గ్రామాల పరిస్థితి అదే. ఇరవై ఏళ్ల కిందట అయితే మరీ దుర్భరంగా ఉండేది. అక్కడి నీటి ఎద్దడిని నివారించడానికి విశాల మనస్కులు వస్తూనే ఉన్నారు. వారికి చేతనైంత మేర గంగను పునఃప్రతిష్ఠించి జనం గొంతు తడుపుతున్నారు. బెంగళూరుకు చెందిన జయశ్రీ అయితే ఏకంగా రెండు వందల గ్రామాల దాహార్తిని తీర్చింది. నీటి కొరతతో గంగవెర్రులెత్తుతున్న మహారాష్ట్ర గ్రామాల పాలిట గంగాభవానిగా మారింది.

తిరిగి ఇవ్వాల్సిన సమయం
జయశ్రీ వయసు 72. బెంగళూరులో పుట్టి పెరిగింది. చదువుకునే రోజుల్లో ఆసక్తి కొద్దీ ఒక ఎన్‌జీవోలో ఉద్యోగం చేసింది. పెళ్లి తర్వాత భర్తతోపాటు యూకేకి వెళ్లి పోయింది. ఆ తర్వాత కొన్నేళ్లకు కుటుంబంతో తిరిగి ఇండియాకి వచ్చిందామె. ఆమె తండ్రి నిర్వహిస్తున్న జేఆర్‌రావు అండ్‌ కో బాధ్యతలను చేపట్టింది. అది ఇంజనీరింగ్‌ పరికరాలు తయారు చేసే పరిశ్రమ. దేశం నలుమూలల నుంచి, విదేశాల నుంచి ఆర్డర్‌లు వస్తుంటాయి. పరిశ్రమ నిర్వహణలో మంచి పట్టు వచ్చేసింది. 2006లో ఓరోజు... ఆమె జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన చోటు చేసుకుంది. ఒక పెద్ద ఆర్డర్‌ వచ్చింది. మెషినరీ పరికరాల అమ్మకంలో నికరంగా లక్ష రూపాయలు మిగిలాయి.

జయశ్రీ సంతోషంగా ఇంటికి వచ్చింది. రోజూ కూరగాయలిచ్చే అతడు వచ్చాడు. ఐదు రూపాయలు తగ్గింపు కోసం బాగా బేరం చేసింది. ఆమె కోరినట్లే ఐదు రూపాయలు తగ్గించి కూరగాయలిచ్చి వెళ్లిపోయాడతడు. అప్పుడు ఆమెలో ఆత్మావలోకనం మొదలైంది. ‘నేనేం చేశాను. లక్ష రూపాయలు లాభంతో సంతోషంగా ఇంటికి వచ్చాను. బేరం చేయకుండా కూరగాయలు కొని ఉంటే కూరగాయలమ్మే అతడు కూడా ఎంతో కొంత సంతోషంగా ఇంటికి వెళ్లే వాడు కదా’ అనుకుంది. మన జీవిక కోసం సమాజం నుంచి తీసుకుంటాం. అలాగే సమాజానికి తిరిగి ఇవ్వాల్సిన సందర్భాలను కూడా గమనింపు లో ఉంచుకోవాలి’ అనుకుందా క్షణంలో. ఆ ఆలోచన అక్కడితో ఆగిపోలేదు. ఏం చేయాలి? ఎలా చేయాలి అని గట్టిగా ప్రయత్నాలు మొదలు పెట్టింది.

నాటి చిత్రమే నేటికీ
జయశ్రీకి తాను పెళ్లికి ముందు పని చేసిన మహారాష్ట్ర గ్రామాలు గుర్తుకు వచ్చాయి. నీటి కోసం బిందె తల మీద పెట్టుకుని నడుస్తున్న మహిళల ఫొటోలు పేపర్‌లలో చూసిన సంగతి గుర్తు వచ్చింది. ఒకసారి ఆ గ్రామాలకు వెళ్లి చూసింది. వెంటనే పని మొదలు పెట్టింది జయశ్రీ. సమావేశం ఏర్పాటు చేసి తాను ఏం చేయదలుచుకున్నాననేది గ్రామస్థులకు వివరించడమే పెద్ద సమస్య అయింది. మీటింగ్‌ అంటే ఎవరూ వచ్చే వాళ్ల కాదు. గ్రామస్థులను కూర్చోబెట్టడానికి రకరకాల మార్గాల్లో ప్రయత్నించింది. చివరికి ఒక దీపావళికి ప్రమిదలు తయారు చేసే అవకాశం కల్పించడంతో మహిళలు వచ్చారు.

వారికి ప్రమిదలు చేసినందుకు డబ్బు ఇవ్వడంతోపాటు నీటి సంరక్షణ కోసం తాను చేయదలుచుకున్న విషయాన్ని కూడా చెప్పి వారిని సమాధాన పరిచింది. ఎండిపోయిన నీటి కుంటల పూడిక తీయించడానికి రంగం సిద్ధం చేసింది. యంత్రాల సహకారం ఆమె వంతు భాగస్వామ్యం– శ్రమదానం గ్రామస్థుల భాగస్వామ్యం. ఈ అంగీకారంతో ఒక్కో గ్రామంలో ఉన్న చెరువులు, కుంటలు, సరస్సులు, కాలువలు శుభ్రపడ్డాయి. తర్వాతి వర్షాకాలం నీటితో కళకళలాడాయి. అలాగ ఒక ఊరి తర్వాత మరో ఊరు... అలా రెండు వందల గ్రామాల్లో నీటి సంరక్షణను విజయవంతంగా పూర్తి చేసింది జయశ్రీ.
వాటర్‌ కన్సర్వేషన్‌
స్ప్రింగ్‌ బాక్స్‌
గ్రామస్తులను చైతన్యపరుస్తున్న జయశ్రీ
జయశ్రీ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top